ప్రకటించిన హాంకాంగ్ కోర్టు
జీవితకాల జైలు శిక్ష పడే అవకాశం
ఖండించిన అమెరికా, యూకే
హాంకాంగ్: ప్రజాస్వామ్య అనుకూల మీడియా మాజీ అధిపతి, చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించే జిమ్మీ లాయ్(78)ను హాంకాంగ్‌లోని న్యాయస్థానం సోమవారం దోషిగా నిర్థారించింది. దీంతో, జాతీయ భద్రతా చట్టం కింద ఆయనకు జీవితకాల జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి. విదేశీ శక్తులతో కుమ్మక్కై దేశ భద్రతను ప్రమాదంలో పడేశారని, విద్రోహ కథనాలను ప్రచురించేందుకు కుట్ర పన్నారంటూ ముగ్గురు జడ్జీలు ఏకగ్రీవంగా ప్రకటించారు.
అయితే, తానెలాంటి తప్పూ చేయలేదని లాయ్ వాదించారు. 2019లో చైనా వ్యతిరేక, ప్రజాస్వామ్య అనుకూల నిరసనలు హాంకాంగ్‌లో మిన్నంటాయి. జిమ్మీ లాయ్ సారథ్యంలోని యాపిల్ డైలీ ప్రజాస్వామ్య వాదులకు అనుకూలంగా పనిచేసింది. దీంతో, డ్రాగన్ ప్రభుత్వం 2020 ఆగస్ట్‌లో లాయ్‌ను, అందులోని కీలక ఉద్యోగులను అరెస్ట్ చేసింది. 2021లో యాపిల్ డైలీని మూసివేసింది. ఆ పత్రిక ఆస్తుల్ని సీజ్ చేసింది. అప్పటినుంచి ఆయన జైలులోనే మగ్గుతున్నారు.
ఇందులో ఎక్కువ కాలం ఏకాంతవాసమే. దీంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. జిమ్మీ లాయ్‌పై హాంకాంగ్ అధికారులు పలు అవినీతి ఆరోపణలను కూడా మోపారు. చైనాలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి కూలదోసేందుకు అమెరికా, యూకే తదితర దేశాలతో కుట్ర పన్నారని పేర్కొన్నారు.
మొత్తం 156 రోజులపాటు ఆయనపై విచారణ జరిపారు. అయితే, న్యాయమూర్తులు వెలువరించిన 855 పేజీల తీర్పులో తన తండ్రికి వ్యతిరేకంగా ప్రత్యేకించి ఎలాంటి నేరారోపణలు లేవని ఆయన కుమారుడు సెబాస్టియన్ లాయ్ చెప్పారు.
లాయ్, తదితరులు తమ వాదనలను జనవరి 12వ తేదీ నుంచి వినిపించేందుకు అవకాశమిస్తారని భావిస్తున్నారు. అభియోగాల తీవ్రతను బట్టి గరిష్టంగా లాయ్‌కు జీవిత కాల జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి. లాయ్‌కు జైలు శిక్ష విధించడంపై చైనా ప్రభుత్వంతో మాట్లాడుతానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలపగా, బ్రిటిష్ పౌరుడు కూడా అయిన లాయ్ విడుదలకు ప్రయత్నాలను కొనసాగిస్తామని యూకే ప్రధాని స్టార్మర్ చెప్పారు. లాయ్‌ను దోషిగా నిర్థారించడాన్ని ఈయూ ఖండించింది.


