జోర్డాన్ రాజు అబ్దుల్లాతో ప్రధాని మోదీ విస్తృతస్థాయి చర్చలు
ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపైనా మంతనాలు
అమ్మాన్: జోర్డాన్‌తో భారత ద్వైపాక్షిక బంధం ద్విగుణీకృతం కాబోతోందని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా సోమవారం జోర్డాన్‌కు విచ్చేసిన ప్రధాని మోదీ అక్కడి అత్యంత విలాసవంత రాజ ప్రాసాదం హుస్సేనియా ప్యాలెస్‌లో జోర్డాన్ రాజు అబ్దుల్లాహ్–2 ఇబిన్ అల్ హుస్సేన్‌తో భేటీ అయ్యారు.
37 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఒకరు జోర్డాన్‌లో పూర్తిస్థాయిలో ద్వైపాక్షిక చర్చల నిమిత్తం పర్యటించడం ఇదే తొలిసారికావడం విశేషం. ఇరుదేశాల ప్రతినిధుల స్థాయి సమావేశానికి ముందే ఇరుదేశాల అగ్రనేతలు ఇలా స్వయంగా భేటీ అయి ద్వైపాక్షిక అంశాలపై విస్తృతస్థాయిలో చర్చలు జరిపారు. పరస్పరం ప్రయోజనం చేకూర్చే ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపైనా మోదీ, రాజు అబ్దుల్లాలు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు.
ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్ష జరిపారు. ‘‘భారత్–జోర్డాన్ బంధం మరింత పటిష్టమవుతోందని రాజు అబ్దుల్లాహ్ బలంగా విశ్వసిస్తున్నారు. ఇరుదేశాల సత్సంబంధాల పునాదులు మరింత గట్టిపడుతున్నాయి. వాణిజ్యం, ఎరువులు, డిజిటల్ సాంకేతికత, మౌలిక వసతుల కల్పన అంశాలతోపాటు ఇరుదేశాల ప్రజల మధ్య సాంస్కృతిక బంధాల బలోపేతం కోసం పరస్పర సహకారాన్ని ఇకమీదటా కొనసాగిస్తాం. ఉగ్రవాదం విషయంలో ఇరుదేశాల ఉమ్మడి పోరు సల్పుతాం.
గాజా అంశంలోనూ క్రియాశీలక, సానుకూల పాత్ర పోషిస్తాం. పశ్చిమాసియాలో శాంతికపోతాలు ఎగిరేందుకు శతథా కృషిచేస్తాం. ఉగ్రవాదం విషయంలో ఇరుదేశాల వైఖరి ఒక్కటే’’ అని మోదీ వ్యాఖ్యానించారు. ‘‘ మీ నాయకత్వంలో జోర్డాన్ అనేది ఉగ్రవాదం, అతివాదం, వేర్పాటువాదాల విషయంలో ప్రపంచానికి గట్టి సందేశం ఇస్తోంది. నన్ను, భారత ప్రతినిధులకు సాదర స్వాగతం పలికిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు’’ అని రాజు అబ్దుల్లాహ్‌ను మోదీ కొనియాడారు.
సత్సంబంధం సమున్నత శిఖరాలకు..
‘‘ ఇండియా–జోర్డాన్ బంధాన్ని నూతన శిఖరాలకు తీసుకెళ్లేలా మీరెంతో సానుకూల దృక్పథాన్ని అవలంభిస్తున్నారు. భారత్ విషయంలో మీ స్నేహపూర్వక వైఖరి, అంకిత భావానికి ధన్యవాదాలు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధం ఈ ఏడాదితో 75 వసంతాలు పూర్తిచేసుకుంటోంది. మేలిమలుపు లాంటి ఈ సందర్భంలో కొంగొత్త ఉత్సాహంతో ఇరుదేశాల బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్దాం’’ అని రాజుతో మోదీ అన్నారు.
ఈ సందర్భంగా 2018లో ఇస్లామిక్ వారసత్వ సదస్సు కోసం అబ్దుల్లాహ్ భారత పర్యటన నాటి విశేషాలను మోదీ గుర్తుచేసుకున్నారు. ‘‘ ప్రాంతీయ శాంతి కోసం మాత్రమేకాదు ప్రపంచశాంతి కోసం మీరు చేస్తున్న కృషి ప్రశంసనీయం. 2015లో ఐక్యరాజ్యసమితిలో సమావేశాల వేళ తొలిసారిగా మీతో భేటీ అయ్యా. ఉగ్రవాదభూతాం పెను విలయాలను మానవాళి ఎంతగా ఇబ్బందులు పడుతుందో మీరెంతో స్ఫూర్తిదాయకంగా ప్రసంగించారు’’ అని మోదీ పొగిడారు. పర్యటనలో భాగంగా మోదీ ప్రాచీనభారత్‌లో వ్యాపారంచేసిన పెట్రా ప్రాంతంలో యువరాజుతో కలిసి పర్యటించనున్నారు.
భారతీయుల ఘన స్వాగతం
అంతకుముందు సోమవారం మోదీ జోర్డాన్‌లోని అమ్మాన్ నగరంలోని విమానాశ్రయానికి చేరుకోగానే జోర్డాన్ ప్రధానమంత్రి జఫర్ హసన్ సాదరంగా ఆహ్వానించారు. తర్వాత హోటల్‌కు చేరుకోగానే అక్కడి ప్రవాస భారతీయులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. భారతీయ అనుకూల జోర్డాన్ పౌరులు సైతం ప్రధానికి షేక్‌హ్యాండ్ ఇచ్చారు. జోర్డాన్‌స్థానికులు భారతీయ నాట్యంచేశారు. దేశ సాంస్కృతిక వారసత్వాన్ని తెలిపే కళారూపాలను ప్రదర్శించారు.


