సాక్షి, న్యూఢిల్లీ: భారతదేశంలో యూదు సమాజంపై ఉగ్రదాడుల ముప్పు నేపథ్యంలో హై అలర్ట్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఢిల్లీ, బెంగళూరు, ముంబై నగరాల్లో యూదు ప్రార్థనా మందిరాలు, సాంస్కృతిక కేంద్రాలు, యూదు సమాజానికి చెందిన సంస్థలు ఉగ్రవాదుల లక్ష్యంగా మారే అవకాశం ఉందని గూఢచార సంస్థలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో భద్రతా దళాలు కీలక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టాయి.
సంతాపం ప్రకటించిన ప్రధాని మోదీ
ఆస్ట్రేలియాలో యూదులపై ఉగ్రవాద దాడి పట్ల భారత ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముష్కరుల దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. మృతులకు సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు భారతీయుల తరఫున సానుభూతి తెలియజేస్తున్నట్లు వెల్లడించారు.
ఆస్ట్రేలియా బాండీ బీచ్‌లో ఇద్దరు ముష్కరుల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 16 మంది మృతి చెందారు. ఇద్దరు పోలీసులు సహా 38 మంది గాయాలపాలైయ్యారు. కాగా పోలీసులు కాల్పుల్లో ఒక ఉగ్రవాదిని హతమార్చారు. మరొక ఉగ్రవాదిని అరెస్టు చేశారు.


