న్యూఢిల్లీ: నేటి(సోమవారం) నుంచి ప్రారంభం కావాల్సిన ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సోమవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేయడంతో, ప్రధాని నరేంద్ర మోదీ మూడు దేశాల పర్యటన కోసం వెళ్లాల్సిన విమానం ఆలస్యమైంది. ప్రధాని వాస్తవానికి ఉదయం 8:30 గంటలకు బయలుదేరాల్సి ఉండగా, దట్టమైన పొగమంచు కారణంగా దృశ్యమానత (విజిబిలిటీ) గణనీయంగా పడిపోవడంతో ఆయన పర్యటనలో ఆలస్యం చోటుచేసుకుంది. ఈ పర్యటనలో ప్రధాని ముందుగా జోర్డాన్‌ను సందర్శించనున్నారు. ‘ముందుగా నేను జోర్డాన్‌ను సందర్శిస్తాను. హిజ్ మెజెస్టి కింగ్ అబ్దుల్లా II ఇబ్న్ అల్ హుస్సేన్ ఆహ్వానం మేరకు ఈ చారిత్రాత్మక పర్యటన ఉండబోతోంది. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 75 సంవత్సరాలు అయ్యింది’ అని ప్రధాని తన విదేశీ పర్యటనకు ముందు ఒక ప్రకటనలో తెలిపారు.
ఎన్నడూ లేనంత దట్టమైన పొగమంచు
ఢిల్లీ నగరాన్ని సోమవారం దట్టమైన పొగమంచు పూర్తిగా కమ్మేయడంతో దృశ్యమానత దాదాపు సున్నాకి పడిపోయింది. ఫలితంగా ఉదయం వేళ ట్రాఫిక్ నెమ్మదిగా కదిలింది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఈ దట్టమైన పొగమంచు దృష్ట్యా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది. ఉదయం ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవడంతో నగరం అంతటా చలి వాతావరణం నెలకొంది. ఈ సీజన్‌లో ఇంత దట్టమైన పొగమంచు కమ్మడం ఇదే మొదటిసారి.
విమానాలకు తీవ్ర అంతరాయం
ఢిల్లీ విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలకు ఈ పొగమంచు తీవ్ర అంతరాయం కలిగించింది. దృశ్యమానత బాగా తగ్గిపోవడంతో, సురక్షితమైన కార్యకలాపాలను నిర్ధారించడానికి విమానయాన సంస్థలు తమ షెడ్యూల్‌లను సర్దుబాటు చేయాల్సి వస్తున్నది. ఫలితంగా అనేక విమానాలు ఆలస్యం అయ్యాయి. ఈ అంతరాయం కారణంగా ప్రయాణీకులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది.
ప్రయాణికులకు సూచన
ప్రస్తుత పరిస్థితిపై ఢిల్లీ విమానాశ్రయం ప్రయాణికులకు ఒక సలహాను జారీ చేసింది. ‘దట్టమైన పొగమంచు కారణంగా విమానాల కార్యకలాపాలకు అంతరాయాలు ఏర్పడవచ్చు. ప్రయాణికులకు అసౌకర్యాన్ని తగ్గించేందుకు మేము భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నాం. అప్‌డేట్‌ల కోసం ప్రయాణికులు తమ తమ విమానయాన సంస్థలను సంప్రదించాలి’ అని సూచించింది.
ఇది కూడా చదవండి: కెనడా: ఇద్దరు భారతీయులపై కాల్పులు


