మాన్సా (పంజాబ్): కెనడాలోని ఎడ్మంటన్‌లో జరిగిన కాల్పుల ఘటన పంజాబ్‌లోని మాన్సా జిల్లా పరిధిలో గల రెండు గ్రామాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో బార్రే గ్రామానికి చెందిన గురుదీప్ సింగ్ (27), ఉద్దత్ సైదేవాలాకు చెందిన రణ్‌వీర్ సింగ్ (19) గుర్తు తెలియని దుండగుల కాల్పులకు బలయ్యారు. ఉన్నత కెరీర్ ఆశయాలతో విదేశాలకు వెళ్లిన తమ పిల్లలు హత్యకు గురికావడంతో మృతుల కుటుంబాలు తల్లడిల్లిపోతున్నాయి.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఈ హత్యలు తప్పుడు గుర్తింపు కారణంగా జరిగి ఉండవచ్చు. మరో పంజాబీ యువకుని కారులోకి ఎక్కిన గురుదీప్, రణ్‌వీర్‌లపై దుండగులు కాల్పులు జరిపారు. 19 ఏళ్ల రణ్‌వీర్ గత మార్చిలో కెనడాకు వెళ్లాడు. అమెరికాలో అకౌంటెన్సీ వృత్తిలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఉద్యోగ కౌన్సెలింగ్ సెషన్‌కు హాజరైన తర్వాత ఎడ్మంటన్‌లో తన స్నేహితుడి పుట్టిన రోజు పార్టీలో పాల్గొనేందుకు వెళ్లాడు. ఆ సమయంలో స్నేహితుడి మరో ఫ్రెండ్‌కు చెందిన కారులో డ్రైవర్ సీటులో కూర్చున్న సమయంలో అతనిపై కాల్పులు జరిగాయి. రణ్‌వీర్ మామ మన్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ ఈ ఘటనతో కుటుంబం షాక్‌లో ఉందని, కెనడియన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.
ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మరో యువకుడు గురుదీప్ 2023లో కెనడాకు వెళ్లాడు. ట్రక్ మెకానిక్స్‌లో కోర్సు పూర్తి చేసి, ఉద్యోగ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాడు. త్వరలో తన భార్య అమన్‌దీప్ కౌర్‌ను ఇక్కడికి తీసుకురావాలని ప్లాన్ చేసుకున్నాడు. గురుదీప్ మామ దర్శన్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం కారు యజమాని వెనుక సీట్లలో కూర్చోగా, రణ్‌వీర్, గురుదీప్ ముందు సీట్లలో కూర్చున్నారు. దీంతో దుండగులు తమ టార్గెట్‌కు భిన్నంగా గురుదీప్, రణ్‌వీర్‌లపై కాల్పులు జరిపివుంటారని దర్శన్ సింగ్ అన్నారు. కాగా బాధిత కుటుంబ సభ్యులు తమ వారి మృతికి గల నిజమైన కారణం కోసం, నేరానికి సంబంధించిన వివరాల కోసం ఎదురుచూస్తున్నాయి.
ఇది కూడా చదవండి: లిబియాలో భారత జంట కిడ్నాప్: రూ. రెండు కోట్లు డిమాండ్


