చండీగఢ్: పంజాబ్‌లో రూ.500 కోట్లు ఇచ్చిన వారికి ముఖ్యమంత్రి కుర్చీ దక్కుతుందంటూ సంచలన వ్యాఖ్యలతో కలకలం రేపిన రాష్ట కాంగ్రెస్ నేత నవ్ జోత్ కౌర్‌ను సస్పెండ్ చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఆమెను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్టు పీసీసీ చీఫ్ అమరీందర్ సింగ్ రజా వారియర్ సోమవారం ప్రకటించారు.
అయితే, ఆలోపే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీపై కౌర్ మరో బాంబు పేల్చారు. తారన్ తరన్ అసెంబ్లీ స్థానానికి ఇటీవల జరిగిన ఉప ఎన్నికలో టికెట్ కోసం కాంగ్రెస్ అభ్యర్థి కర్ణబీర్ సింగ్ బుర్జ్ ఇద్దరు పార్టీ నేతలకు రూ.10 కోట్లు ఇచ్చారని సస్పెన్షన్‌కు ముందు ఆమె ఆరోపించారు. ఈ ఆరోపణలను బుర్జ్ వెంటనే ఖండించారు. సస్పెన్షన్ అనంతరం కౌర్ మాట్లాడుతూ.. పీసీసీ చీఫ్ వారియర్ పై నిప్పులు చెరిగారు. ఆయనకు కోర్టు పట్ల, ప్రజల పట్ల నిబద్ధత, నైతికత, బాధ్యత వంటివి ఏ కోశానా లేవంటూ దుయ్యబట్టారు. సీఎం కుర్చీకి సంబంధించి తన వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పుకొచ్చారు.
ఈ సందర్బంగా కౌర్.. ‘‘నా భర్త (పీసీసీ మాజీ చీఫ్, రాష్ట్ర మాజీ మంత్రి నవ్ జోత్ సింగ్ సిద్ధూ) ఏ ఇతర పార్టీ నుంచైనా సీఎం అభ్యర్థి అవుతారా అన్న మీడియా ప్రశ్నకు, అందుకు ఆఫర్ చేసేందుకు కావాల్సిన డబ్బులు మా దగ్గర లేవని మాత్రమే నేనన్నా’’ అని ఆమె ఎక్స్ పోస్టులో చెప్పుకొచ్చారు. నిజం చెప్పినందుకు కౌర్ పై కాంగ్రెస్ పార్టీ ఫత్వా జారీ చేసిందని బీజేపీ నేత షెహజాద్ పూనావాలా ఎద్దేవా చేశారు.


