45 బంతుల్లో 9 ఫోర్లు, 11 సిక్స్‌లతో 125 నాటౌట్
అయినా పంజాబ్‌కు తప్పని ఓటమి
6 వికెట్ల తేడాతో జార్ఖండ్ గెలుపు
మరో మ్యాచ్‌లో రాజస్తాత్‌న్‌పై హరియాణా విజయం
ముస్తాక్ అలీ ట్రోఫీ టి20 టోర్నమెంట్ ‘సూపర్ లీగ్’
అంబి (మహారాష్ట్ర): పంజాబ్ యువ బ్యాటర్ సలీల్ అరోరా (45 బంతుల్లో 125 నాటౌట్; 9 ఫోర్లు, 11 సిక్స్‌లు) సూపర్ సెంచరీతో చెలరేగినా... పంజాబ్ జట్టుకు పరాజయం తప్పలేదు. దేశవాళీ టి20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ‘సూపర్ లీగ్’ గ్రూప్ ‘ఎ’లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో జార్ఖండ్ జట్టు 6 వికెట్ల తేడాతో పంజాబ్‌ను ఓడించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది.
స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ... జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తుండగా... అతడు లేని లోటును అరోరా భర్తీ చేశాడు. బంతి ఎక్కడపడ్డా దాని గమ్యస్థానం బౌండరీనే అన్న చందంగా చెలరేగిపోయాడు. మిగిలిన వారి నుంచి చెప్పుకోదగ్గ తోడ్పాటు లభించకపోయినా... అరోరా ఏ దశలోనూ వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలో అతడు 39 బంతుల్లోనే సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. కెపె్టన్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (10), హర్‌నూర్ సింగ్ (13), సాన్‌వీర్ సింగ్ (10), రమణ్‌దీప్ సింగ్ (8) విఫలం కాగా... అన్‌మోల్ ప్రీత్ సింగ్ (23), నమన్ ధిర్ (27) ఫర్వాలేదనిపించారు.
జార్ఖండ్ బౌలర్లలో సుశాంత్ మిశ్రా, బాలకృష్ణ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్యఛేదనలో జార్ఖండ్ జట్టు 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది. కెపె్టన్ ఇషాన్ కిషన్ (23 బంతుల్లో 47; 8 ఫోర్లు, 1 సిక్స్), విరాట్ సింగ్ (18; 1 ఫోర్, 2 సిక్స్‌లు) జట్టుకు మెరుపు ఆరంభాన్నిచ్చారు. సాధించాల్సిన రన్‌రేట్ కొండంత ఉన్న జార్ఖండ్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు.
‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ కుమార్ కుశాగ్ర (42 బంతుల్లో 86 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ అర్ధశతకంతో ఆకట్టుకోగా... చివర్లో అనుకూల్ రాయ్ (17 బంతుల్లో 37; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), పంకజ్ కుమార్ (18 బంతుల్లో 39 నాటౌట్, 1 ఫోర్, 4 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. జార్ఖండ్ బ్యాటర్లలో రాబిన్ మింజ్ (2) మినహా తక్కిన వాళ్లంతా రెండొందల పైచిలుకు స్ట్రయిక్ రేట్‌తో పరుగులు రాబట్టడం విశేషం. ఐపీఎల్ మినీ వేలానికి ముందు యువ ఆటగాళ్లు తమ పవర్‌హిట్టింగ్‌తో ఫ్రాంచైజీల దృష్టిలో పడే ప్రయత్నంలో ఉన్నారు.
అంకిత్ కుమార్ అర్ధసెంచరీ
‘సూపర్ లీగ్’ గ్రూప్ ‘బి’లో భాగంగా జరిగిన మరో మ్యాచ్‌లో హరియాణా జట్టు 7 వికెట్ల తేడాతో రాజస్తాన్‌పై గెలిచింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. మహిపాల్ లోమ్రర్ (39 బంతుల్లో 37 నాటౌట్; 1 ఫోర్), శుభమ్ గర్వాల్ (27 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. దీపక్ హుడా (0), కునాల్ సింగ్ రాథోడ్ (4), కరణ్ లాంబా (1), కెపె్టన్ మానవ్ సుతార్ (15) విఫలమయ్యారు.
హరియాణా బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఇషాంత్ భరద్వాజ్, అన్షుల్ కంబోజ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం స్వల్ప లక్ష్యఛేదనలో హరియాణా 16.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. కెప్టెన్ అంకిత్ కుమార్ (41 బంతుల్లో 60; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకంతో మెరవగా... అర్ష్ రంగా (12 బంతుల్లో 27; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), పార్థ్ వత్స్ (29 బంతుల్లో 27; 1 ఫోర్ 1 సిక్స్) రాణించారు. ఆదివారం జరగనున్న తదుపరి మ్యాచ్‌ల్లో ముంబైతో హరియాణా, ఆంధ్రతో పంజాబ్, హైదరాబాద్‌తో రాజస్తాన్, మధ్యప్రదేశ్‌తో జార్ఖండ్ తలపడతాయి.


