బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన కొద్ది నెలలకు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాతో సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. 2022లో కాంగ్రెస్‌తో చర్చలు విఫలమై, తీవ్ర విభేదాలు తలెత్తిన మూడేళ్ల తర్వాత ఈ భేటీ జరగడం గమనార్హం. అయితే తాజాగా ఇరు పార్టీల మధ్య మొదలైన మంతనాలు ఎటువైపునకు దారి తీస్తాయో.. పీకే తాజా వ్యూహం ఎంతవరకూ ఫలిస్తుందో అనేది అత్యంత ఆసక్తికరంగా మారింది.
బిహార్ వైఫల్యంతో పునరాలోచన?
బిహార్ ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ పార్టీ జన్ సురాజ్ పేలవమైన ప్రదర్శన కనబరచడం ఈ భేటీకి ప్రధాన కారణంగా తెలుస్తోంది. బీజేపీకి, కాంగ్రెస్ కీలక భాగస్వామిగా ఉన్న మహాకూటమికి వ్యతిరేకంగా పోటీకి దిగిన జన్ సురాజ్ రాష్ట్రంలో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. పోటీ చేసిన మొత్తం 238 మంది అభ్యర్థులలో 236 మంది (99.16%) తమ డిపాజిట్లను కోల్పోయారు. ఈ ఫలితాలు పీకే ఎన్నికల వ్యూహాలపై, అతని రాజకీయ ప్రస్థానంపై పలు ప్రశ్నలు లేవనెత్తాయి. మరోవైపు కాంగ్రెస్ కూడా బిహార్‌లో ఘోరంగా విఫలమైంది. 61 స్థానాల్లో పోటీ చేసి, కేవలం ఆరింటిని మాత్రమే గెలుచుకుంది. ఇది ఆ పార్టీ 2020 ఎన్నికల్లో గెలిచిన 19 స్థానాల కంటే చాలా తక్కువ.
నిన్నమొన్నటి వరకూ విమర్శించి..
2022లో చర్చలు విఫలమైనప్పటి నుండి ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌పై నిరంతరం విమర్శనాత్మక ధోరణితో వ్యవహరిస్తున్నారు. బిహార్ ఎన్నికల ప్రచారం సమయంలో కూడా ఆయన రాహుల్ గాంధీ లేవనెత్తిన ‘ఓట్ చోరీ’ ప్రచారం రాష్ట్రంలో ఎన్నికల సమస్య కాదని వాదించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)గురించి పీకే చేసిన వ్యాఖ్యలు కూడా కాంగ్రెస్ వైఖరికి వ్యతిరేకంగానే ఉన్నాయి. ఇలా నిరంతర విమర్శల నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ అకస్మాత్తుగా కాంగ్రెస్ కీలక మహిళా నేత ప్రియాంకా గాంధీని కలవడం రాజకీయంగా కొత్త సమీకరణలకు దారితీయవచ్చనే ఊహాగానాలకు బలం చేకూరుతోంది.
2022లో ఎలా బెడిసికొట్టింది?
రాజకీయ వ్యూహకర్తగా, నేతగా గాంధీ కుటుంబంతో ప్రశాంత్ కిషోర్‌కు గతంలో మంచి అనుబంధం ఉంది. 2021లో జేడీయూ నుండి బహిష్కరణ వేటు పడిన తర్వాత ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్‌ను పునరుద్ధరించే ప్రతిపాదనతో గాంధీ కుటుంబాన్ని సంప్రదించారు. ఇందుకోసం ఆయన 2022, ఏప్రిల్‌లో సోనియా గాంధీ నివాసంలో కాంగ్రెస్ అగ్ర నాయకత్వానికి ఒక వివరణాత్మక ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ తర్వాత సోనియా గాంధీ ఈ ప్రతిపాదనలను పరిశీలించేందుకు ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు. అయితే కాంగ్రెస్ నాయకత్వం ఏర్పాటు చేసిన ‘అధికార సాధికార బృందం’ (ఈఏజీ)లో చేరాలనే ప్రతిపాదనను పీకే తిరస్కరించడంతో నాటి చర్చలు అకస్మాత్తుగా ముగిశాయి.
అధిక స్వేచ్ఛ, ప్రాధాన్యత కోరడంతో..
ఇదే తరుణంలో కాంగ్రెస్ నిర్దిష్ట బాధ్యతతో ఈఏజీలో భాగంగా పార్టీలో చేరాలంటూ పీకేని ఆహ్వానించింది. దీనికి పీకే వెంటనే స్పందించారు. ఈఏజీలో చేరి, ఎన్నికల బాధ్యత తీసుకోవాలనే కాంగ్రెస్ ప్రతిపాదనను తిరస్కరించారు. పార్టీలోని నిర్మాణాత్మక సమస్యలను పలు సంస్కరణల ద్వారా పరిష్కరించడానికి నాయకత్వం, సామూహిక సంకల్పం అవసరమని నాడు పీకే ప్రకటించారు. ఈ ప్రకటన ద్వారా ఆయన తనకు అధిక స్వేచ్ఛ, ప్రాధాన్యత కావాలని కోరారు. అయితే బయటి వ్యక్తి చెప్పినట్లు పార్టీలో నిర్మాణాత్మక మార్పులు చేయడానికి సీనియర్ నాయకత్వం విముఖత చూపిందని తెలుస్తోంది.
ఇరు పార్టీలకు అవసరమై..
ఇప్పుడు మూడేళ్ల తర్వాత జరిగిన ఈ సమావేశం మళ్లీ కాంగ్రెస్- పీకే మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యానికి సంకేతమా? అనేది అందరిలో పలు సందేహాలను లేవనెత్తుతోంది. బిహార్ ఎన్నికల్లో ఎదురైన పరాజయం నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్‌కు కాంగ్రెస్ లాంటి జాతీయ స్థాయి పార్టీతో తిరిగి కలిసి పనిచేయాలనే ఆలోచన వచ్చి ఉండవచ్చని పలువురు అంటున్నారు. అలాగే వరుస పరాజయాలతో సతమతమవుతున్న కాంగ్రెస్, భవిష్యత్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మార్గదర్శకత్వం కోసం పీకేను తిరిగి సంప్రదించి ఉండవచ్చని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదిఏమైనా ఒకప్పుడు తీవ్ర విభేదాలు తలెత్తిన నేతల మధ్య జరిగిన తాజా భేటీ.. రాబోయే రాజకీయ సమీకరణలపై తప్పక ప్రభావం చూపనుంది.
ఇది కూడా చదవండి: తరలిపోనున్న ‘తీహార్’.. ఎక్కడకి? ఎందుకు?


