తరలిపోనున్న ‘తీహార్‌’.. ఎక్కడకి? ఎందుకు? | Delhi CM Rekha Gupta Plans To Move Tihar Jail To Outskirts Amid Overcrowding And Safety Issues, Know About Tihar Jail History | Sakshi
Sakshi News home page

Tihar Jail: తరలిపోనున్న ‘తీహార్‌’.. ఎక్కడకి? ఎందుకు?

Dec 14 2025 12:11 PM | Updated on Dec 14 2025 1:30 PM

Delhi CM Rekha Gupta Plans to Move Tihar Jail

తీహార్ జైలు.. దీనిని అధికారికంగా తీహార్ కారాగార ప్రాంగణం(Tihar Prison Complex) అని పిలుస్తారు. ఇది దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద కారాగారంగా ప్రసిద్ధి చెందింది. ఢిల్లీలోని ఈ జైలు.. ఖైదీల సంస్కరణ నిలయంగానూ ప్రసిద్ధి చెందింది. ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీ హయాంలో దీనికి ‘తీహార్ ఆశ్రమం’ అనే పేరు కూడా వచ్చింది. ఇక్కడ కరుడుగట్టిన నేరస్తులు మొదలుకొని, పేరుపొందిన రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తల వరకు పలువురు నేరస్తులు శిక్షలు అనుభవిస్తుంటారు. ఖైదీలకు వృత్తి విద్య, ఆధ్యాత్మిక శిక్షణ, యోగా, తీహార్‌ బ్రాండ్ కింద వివిధ ఉత్పత్తులను తయారుచేసే అవకాశాలు కల్పిస్తుంటారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన తీహర్‌ జైలు త్వరలో తరలిపోతున్నదనే వార్త చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా  తాజాగా నగరంలోని తీహార్ జైలును ఢిల్లీ శివార్లకు తరలించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిపారు. మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో భాగంగా ఈ దిశగా ఆలోచిస్తున్నట్లు తెలిపారు.

తీహార్ గ్రామంలో..
తీహార్ జైలు అనేది కేవలం ఒకే భవనం కాదు. పలు కేంద్ర జైళ్లతో కూడిన ఒక అతిపెద్ద సముదాయం. అధికారికంగా దీనిని ‘తీహార్ జైళ్లు’ అని పిలుస్తారు. ఇది పశ్చిమ న్యూఢిల్లీలోని తీహార్ గ్రామంలో 1958లో నెలకొల్పారు. తొలుత ఈ కేంద్ర జైలు 1,273 మంది ఖైదీలను ఉంచే సామర్థ్యంతో ప్రారంభమైంది. జైలు పరిపాలనా నియంత్రణ మొదట్లో పంజాబ్ ప్రభుత్వం ఆధీనంలో ఉండేది. ఆ తర్వాత 1966లో ఢిల్లీ పరిపాలనకు జైలు బదిలీ  అయ్యింది. తీహార్ జైలు ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద జైలుగా పేరొందడంతో పాటు ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే జైలు వ్యవస్థలలో ఒకటిగా నిలిచింది.

సామర్థ్యానికి మించి..
కాలక్రమేణా తీహార్ జైలు సముదాయం భారీగా విస్తరించింది ప్రస్తుతం ఇందులో 10 వేర్వేరు కేంద్ర జైళ్లు (CJ-1 నుండి CJ-10 వరకు) ఉన్నాయి. ఈ జైలు అధికారికంగా దాదాపు 10,000 మంది ఖైదీలను ఉంచే సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ,  దీనిలో సామర్థ్యానికి మించి 15,000 నుండి 19,000 మంది ఖైదీలు ఉంటుంటారు. ఈ అధిక రద్దీ తీహార్ జైలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటి. ఈ సముదాయం శిక్ష పడిన ఖైదీలు, విచారణలో ఉన్న ఖైదీలు మహిళా ఖైదీల కోసం ప్రత్యేక విభాగాలు ఉన్నాయి.

కిరణ్ బేడీ సంస్కరణలతో..
1990లలో కిరణ్ బేడీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (జైళ్లు)గా పనిచేసిన సమయంలో తీహార్ జైలు ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఆమె నాయకత్వంలో జైలులో పలు మానవతా సంస్కరణలు ప్రవేశపెట్టారు. వీటిలో ఖైదీల కోసం ధ్యానం, యోగా, వృత్తిపరమైన శిక్షణ, విద్యా కార్యక్రమాలు ప్రధానమైనవి. ఈ సంస్కరణలు జైలు వాతావరణాన్ని మెరుగుపరచడంలో, ఖైదీలలో సానుకూల మార్పులు తీసుకురావడంలో సహాయపడ్డాయి. ఈ సంక్షేమ కార్యక్రమాల కారణంగా తీహార్ జైలు కేవలం ఖైదీలను నిర్బంధించే స్థలంగానే కాకుండా, సంస్కరణల కేంద్రంగా కూడా పేరు పొందింది.

హింస, గ్యాంగ్ వార్ ఘటనలతో..
తీహార్ జైలును తరలించడానికి ఇక్కడ పెరుగుతున్న ఖైదీల సంఖ్య, భద్రతా సమస్యలు  ప్రధాన కారణాలుగా నిలిచాయి. సుమారు 10 వేల మంది ఖైదీలను ఉంచే సామర్థ్యం ఉన్న జైలులో ప్రస్తుతం 19 వేల మందికి పైగా ఖైదీలు ఉండటంతో భద్రత, నిర్వహణ సమస్యలు తలెత్తుతున్నాయి. అలాగే ఈ జైలు నివాస ప్రాంతాలకు దగ్గరగా (తిలక్‌నగర్, హరినగర్ వంటి జనావాసాలకు సమీపంలో) ఉండటం వల్ల, చుట్టుపక్కల ప్రజల భద్రత, రక్షణ కోసం దీనిని నరేలా వంటి నగర శివారు ప్రాంతాలకు తరలించాలని ఢిల్లీ ప్రభుత్వం యోచిస్తున్నది. ఇటీవల జైలులో ఖైదీల మధ్య హింస, గ్యాంగ్ వార్ లాంటి సంఘటనలు పెరగడం కూడా ఈ యోచనకు ఒక కారణంగా కనిపిస్తోంది. 



ఇది కూడా చదవండి: Monkey Day: అడవులను సృష్టించే ‘కోతి చేష్టలు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement