భారత్.. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం. అలాంటి దేశ రాజధాని ఢిల్లీ ఇప్పుడు వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. శీతాకాలం మరింత విషాన్నికలిపి, గాలి నాణ్యతను మరింత దిగజార్చుతోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పీల్చే గాలి కూడా ధనికులకే సొంతమా?
కోవిడ్-19 మహమ్మారి సమయంలో దేశం ఊపిరి ఆడని పరిస్థితిని ఎదుర్కొంది. ముఖ్యంగా ఆస్పత్రిలో పడకలకోసం సామాన్యులు నానా ఇబ్బందులూ పడుతూ.. ఆక్సిజన్ లేక రోడ్లపైనే చనిపోతున్న సమయంలో.. ధనికులు ఆక్సిజన్ సిలిండర్‌కు ప్రత్యామ్నాయంగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్‌లతో ప్రాణాలు నిలుపుకున్నారు. ఇప్పుడు ఢిల్లీ వాసులు నాటి కోవిడ్-19 పరిస్థితుల్ని గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకంటే?
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం సమస్య తీవ్రమైంది. శీతాకాలం కావడంతో పరిస్థితి మరింత దిగజారింది. కాలుష్య కారక సూక్ష్మ ధూళికణాల స్థాయిలు పెరుగుతున్నట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) విశ్లేషణలో తేలింది. దీంతో ఢిల్లీ అంతటా కాలుష్య నియంత్రణ చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది.
వాయు కాలుష్య కారకాలను తగ్గించడం, కాలుష్యంపై ప్రజలకు అవగాహన కల్పించడం. కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల పని వేళల తగ్గించడం,కార్యాలయాల్లో 50శాతం సిబ్బందికి వర్క్ ఫ్రం హోం సదుపాయాన్ని (ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు) కల్పించడం, అనవసర నిర్మాణాలు, కూల్చివేత కార్యకలాపాలపై పూర్తి నిషేధం విధించడం, ఐదవ తరగతిలోపు ఉన్న అన్ని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల మూసివేయడం, రైల్వే, మెట్రో, విమానాశ్రయాలు, రక్షణ రంగాలకు సంబంధించిన నిర్మాణాలు మినహా ఇతర నిర్మాణాలపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
కానీ అప్పటికే విషవాయువుల ప్రభావం అక్కడి ప్రజలపై ప్రతాపం చూపించింది. నగర ప్రజలు గొంతు, తలనొప్పి, కళ్ల మంటలు, నిద్ర సరిగ్గా పట్టకపోవడం వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. కాలుష్యాన్ని నియంత్రించడానికి ఢిల్లీ ప్రభుత్వం కృత్రిమ వర్షాలు కురిపించడానికి ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రతపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఢిల్లీలో వాయు కాలుష్య పరిస్థితిని చాలా తీవ్రమైనదిగా అభివర్ణించింది. వాయు కాలుష్య తీవ్రతకు మాస్కులు కూడా సరిపోవని వ్యాఖ్యానించింది.
ఢిల్లీ నగరంలో గాలి విషపూరితమై, జీవనమే ప్రశ్నార్థకమవుతున్న ఈ సమయంలో ధనికులు తమ ఇళ్లను ‘క్లీన్ ఎయిర్ బబుల్స్’గా మార్చుకుంటున్నారు. ప్రత్యేక వెంటిలేషన్ వ్యవస్థలు, పదుల సంఖ్యలో ఎయిర్ ప్యూరిఫయర్లు, డీహ్యూమిడిఫయర్లు ఇలా లగ్జరీ సీల్డ్ హోమ్స్‌లో వారు తమకోసమే ఒక మైక్రో క్లైమేట్ సృష్టించుకున్నారు. బయట గాలి ఎంత విషపూరితమైనా.. ఇంటి లోపల మాత్రం స్వచ్ఛమైన గాలిని పీల్చేలా వాతావారణాన్ని కల్పించుకుంటుకున్నారు.
క్లీన్ ఎయిర్ బుడగలు
సంపన్న కుటుంబాలు తమ ఇళ్లలోకి ప్రవేశించే ముందు బయట గాలిని ఫిల్టర్ చేసే ప్రత్యేక వెంటిలేషన్, ఎయిర్ ప్యూరిఫికేషన్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ వ్యవస్థలు ఇంటి లోపల శుభ్రమైన గాలిని ఉంచి, కలుషిత గాలి లోపలికి చొరబడకుండా అడ్డుకుంటాయి.
ఎయిర్ ప్యూరిఫయర్లు
కొన్ని అపార్ట్‌మెంట్‌లలో యజమానులు 10–12 ఎయిర్ ప్యూరిఫయర్లను ఉపయోగిస్తున్నారు. లోపలి గాలి శ్వాసించదగిన స్థాయిలో ఉండేందుకు ఫిల్టర్లను సంవత్సరంలో అనేకసార్లు మార్చుతున్నారు.
డీహ్యూమిడిఫయర్లు
ఇళ్లను పూర్తిగా సీల్ చేయించుకున్న వారు తలుపులు, కిటికీలను మూసివేసి ఉంచుతారు. తేమ పెరగకుండా, గాలి కలుషితం కాకుండా ఉండేందుకు డీహ్యూమిడిఫయర్లను కూడా ఇన్‌స్టాల్ చేస్తున్నారు.
లగ్జరీ సీల్డ్ ఇళ్లు
ఢిల్లీలోని పలువురు ధనికులు బయట గాలి ఇంట్లోకి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ విధంగా వారు నియంత్రిత మైక్రోక్లైమేట్‌లను సృష్టించి, బయట వాతావరణం కంటే లోపల గాలి నాణ్యతను చాలా మెరుగ్గా ఉంచుతున్నారు.
కానీ ఈ సౌకర్యం పేదలకు మాత్రం అందని ద్రాక్షాల మారింది. ఖరీదైన పరికరాలు, నిర్వహణ ఖర్చులు.. మధ్యతరగతి,పేద కుటుంబాలకు దూరమైంది. వాయు కాలుష్య తీవ్రతకు మాస్కులు కూడా సరిపోకపోవడంతో విషపూరిత గాలిని పీల్చడం తప్ప మరో ప్రత్యామ్నాయ మార్గం కనిపించడం లేదని వాపోతున్నారు. అదే సమయంలో ధనికులు, పేదల మధ్య అంతరం మరింత పెరిగిపోతుంది. ధనికులు శుభ్రమైన గాలిని పీలుస్తుంటే.. సాధారణ ప్రజలు విష వాయుల్ని పీల్చి దినదినగండంగా కాలం వెళ్లదీయడం ప్రశ్నార్ధకంగా మారింది.
ఢిల్లీలో గాలి సంక్షోభం ఇప్పుడు సామాజిక అసమానతకు ప్రతీకగా మారింది. ధనికులు తమ ఇళ్లలో బబుల్స్ సృష్టించుకుంటే, పేదలు విషవాయువులను పీల్చి జీవించాల్సి వస్తోంది. గాలి పీల్చడం ప్రాథమిక హక్కు. ప్రభుత్వం తాత్కాలిక చర్యలతో కాకుండా..దీర్ఘకాలిక పరిష్కారాలు తీసుకురావాలి. లేకపోతే ఢిల్లీ గాలి సంక్షోభం, అసమానత సంక్షోభంగా మారిపోతుంది.


