చికెన్ ప్రియులకు అలర్ట్. మీరు తినే చికెన్ ఎంత వరకు ఆరోగ్యకరమైంది?. మన దేశంలో దాదాపు 95 శాతం వరకు చికెన్‌లో ఎక్కువగా యాంటీ బయోటిక్స్ స్థాయి ఉన్నట్టు పలు అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ఇలాంటి చికెన్ తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తాజాగా వెల్లడైంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై ఓ నెటిజన్.. కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ (లాలన్ సింగ్)ను ప్రశ్నించారు. దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కొందరికి మాంసంలేనిది ముద్ద దిగదు. అందుకే మన దేశంలో మటన్, చికెన్‌కు డిమాండ్ ఎక్కువ. ఇదే సమయంలో డిమాండ్ తగినట్టు చికెన్‌ను సరఫరా చేసేందుకు పౌల్ట్రీ నిర్వాహకులు.. కోళ్ల ఉత్పత్తిని ఎప్పటికప్పుడు పెంచుతుంటారు. ఈ క్రమంలో కోళ్లకు యాంటీ బయోటిక్స్‌ను ఇస్తారు. కోళ్ల ఆరోగ్యానికి పలు రకాల యాంటీ బయోటిక్స్ వాడుతున్నారు. అయితే, ఇటీవల చేసిన కొన్ని పరిశోధనల్లో చికెన్‌లో ఎక్కువగా యాంటీ బయోటిక్స్ స్థాయి నిల్వలు ఉన్నాయని తేలింది.
పౌల్ట్రీలో యాంటీ బయోటిక్ వినియోగం గ్లోబల్ సగటు కంటే ఎక్కువగా ఉన్నట్టు పరిశోధనల్లో గుర్తించారు. పౌల్ట్రీల్లో ప్రపంచ సగటు కంటే 3–5 రెట్లు ఎక్కువ స్థాయిలో యాంటీ బయాటిక్స్ ఇస్తున్నట్టు తేలింది. పౌల్ట్రీ కోళ్లలో టెట్రాసైక్లిన్స్, ఫ్లోరోక్వినోలోన్స్, కోలిస్టిన్ వంటి ఔషధాల అవశేషాలు నమూనాల్లో ఉన్నట్టు తేలింది. అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) కోలిస్టిన్ విషయంలో ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. దీన్ని కేవలం “చివరి ప్రత్యామ్నాయ ఔషధం”గా మాత్రమే వాడాలని సూచించింది. కోలిస్టిన్ వాడకాన్ని పెద్ద ప్రమాదంగా పేర్కొంది. కానీ, మన దేశంలో మాత్రం కోళ్లు తొందరగా ఎదిగేందుకు, బ్యాక్టీరియా దరి చేరకుండా ఉండేందుకు వీటిని అందిస్తున్నారు. అయితే, 160 కంటే ఎక్కువ దేశాలలో నిషేధించబడిన స్టెరాయిడ్ హార్మోన్లను భారత్‌లో మాత్రం ఎక్కువగా వాడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇది స్వేచ్ఛగా జరుగుతున్నట్టు తేలింది.
Wake Up, India: Your Plate of Chicken Could Be a Prescription for Superbugs & Hormonal Chaos ‼️ 🆘 🚨
Every time you eat chicken from industrial farms (which is 95%+ of all chicken sold in India), you are likely consuming:
• Antibiotics far above global averages – India uses… pic.twitter.com/tpneUrI9Kc— 🥇 Pragnya Gupta (@GuptaPragnya) December 10, 2025
ఇక, మన దేశంలో అమ్ముడయ్యే చికెన్‌లో 95 శాతం వరకు ఇలాంటి కోళ్లే ఉన్నట్టు తేలింది. కోళ్లలో యాంపిసిల్లిన్ రెసిస్టెన్స్ అత్యధికంగా 33 శాతం ఉన్నట్లు తేల్చారు. అలాగే సెపోటాక్సిమ్ రెసిస్టెన్స్ 51 శాతం, టెట్రా సైక్లిన్ రెసిస్టెన్స్ 50 శాతం ఉందని కొందరు పరిశోధకులు తెలిపారు. కోళ్ల పెంపకంలో భాగంగా ఎక్కువగా అమోక్సోక్లాప్, ఎన్రోఫ్లోక్సాసిన్ వంటి యాంటీ బయాటిక్స్ ఎక్కువగా వాడుతున్నారు. ఇవి కోళ్లకు రోగనిరోధక శక్తి పెంచడానికి వీటిని వాడుతున్నా.. వీటిని మనుషులు తినడం వల్ల ప్రమాదమే అంటున్నారు. ఇవి ఎక్కువగా తీసుకున్న కోళ్లను తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఆరోగ్యంపై ప్రభావం..
హార్మోన్లు ఎండోక్రైన్ డిస్రప్షన్‌కు కారణం కావచ్చు
పిల్లల్లో ముందస్తు యవ్వనం వచ్చే అవకాశం.
మహిళల్లో PCOS, పురుషుల్లో ఫెర్టిలిటీ సమస్యలు
తాజా అధ్యయనంలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని వెల్లడి.
దేశంలో ఇప్పటికే యాంటీ మైక్రోబయల్ నిరోధకత (AMR) కారణంగా సంవత్సరానికి 1.2 మిలియన్ల మరణాలు నమోదు.
తాజా అధ్యయనాలు బయటకు వచ్చిన నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా ఓ నెటిజన్ మత్స్య, పశుసంవర్ధక & పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖకు పలు ప్రశ్నలు సంధించారు. ప్రజల ఆరోగ్యం విషయమై సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. #CleanChickenNow అనే హ్యాష్ ట్యాగ్‌ను కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లాలన్ సింగ్‌కు జత చేశారు.
ప్రశ్నలు ఇవే..
1. కొలిస్టిన్ పౌల్ట్రీ పెరుగుదలకు చట్టబద్ధంగా ఎందుకు అనుమతించబడింది?
2. ఈయూ, అమెరికా, చైనా, బంగ్లాదేశ్‌లో కూడా స్టెరాయిడ్ హార్మోన్‌లను నిషేధించారు. కానీ, భారతీయ పౌల్ట్రీలో ఎందుకు ఉపయోగిస్తున్నారు?
3. రిటైల్ స్థాయిలో ఎందుకు రెగ్యులర్ టెస్టింగ్ లేదు?
4. FSSAI చికెన్‌ను ‘యాంటీబయాటిక్స్, హార్మోన్లతో పెంచబడింది, యాంటీ బయాటిక్ రహితం’ అని లేబుల్ చేయడాన్ని ఎప్పుడు తప్పనిసరి చేస్తుంది?
5. క్యాన్సర్ కారకాలుగా నిరూపించబడిన ఆర్సెనిక్ యాడిటివ్స్ ఇంకా ఎందుకు నిషేధించలేదు?
6. పౌల్ట్రీలో వెటర్నరీ ఔషధాల కోసం గరిష్ట అవశేష పరిమితులు (MRLలు) 5–20 రెట్లు ఎక్కువ కలిగి ఉన్నాయి. MRLs ఎందుకు అంతర్జాతీయ ప్రమాణాలకు సరిపోలడం లేదు?. ఎప్పుడు తీసుకువస్తారు?.


