సొరంగం తవ్వకాల పునరుద్ధరణకు నిర్వహణ
స్వయంగా పర్యవేక్షించనున్న సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్
నేడు నాగర్‌కర్నూలు జిల్లా మన్నేవారిపల్లికి పయనం
భూగర్భంలో 1,000 మీటర్లలోతు వరకు అధ్యయనం
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం తవ్వకాల పనుల పునరుద్ధరణలో భాగంగా సోమవారం నుంచి హెలికాప్టర్ బోర్న్ వీటెమ్ ప్లస్ మాగ్నెటిక్ జియోఫిజికల్ సర్వేను ప్రారంభించనున్నారు. సర్వే నిర్వహణకు పౌర విమానయాన శాఖ డైరెక్టర్ జనరల్ (డీజీసీఏ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోమవారం స్వయంగా నాగర్ కర్నూలు జిల్లా మన్నేవారిపల్లికి చేరుకుని సర్వేను పర్యవేక్షిస్తారు.
సర్వే జరిపే హెలికాప్టర్‌కు సమాంతరంగా మరో హెలికాప్టర్‌లో సీఎం, మంత్రి ప్రయాణిస్తూ సర్వే ప్రక్రియను పరిశీలించనున్నారు. నేషనల్ జియో ఫిజికల్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌జీఆర్‌ఐ) శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సర్వేలో భాగంగా దాదాపు 200 కి.మీ.ల విస్తీర్ణంలో సొరంగం తవ్వకాలు జరగాల్సిన ప్రాంతంలో భూగర్భంలో 800–1,000 మీటర్ల లోతు వరకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది గుర్తిస్తారు.
గత ఫిబ్రవరిలో సొరంగం కుప్పకూలిన ఘటనలో కార్మికులు మరణించటంతోపాటు టన్నెల్ బోరింగ్ మెషీన్ (టీబీఎం) ధ్వంసమైంది. దీంతో సురక్షిత పద్ధతిలో సొరంగం తవ్వకాలను పునరుద్ధరించడానికి నిపుణుల కమిటీ చేసిన సిఫారసుల మేరకు ఈ సర్వే నిర్వహిస్తున్నారు. ప్రాజెక్టులో భాగంగా రెండు వరుస సొరంగాలను నిర్మిస్తుండగా, రెండో సొరంగం తవ్వకాలు పూర్తి అయ్యాయి.
ఒకటో సొరంగాన్ని మొత్తం 43.93 కి.మీ.లు తవ్వాల్సి ఉండగా, ఇన్‌లెట్ వైపు నుంచి 13.94 కి.మీ.లు, దేవరకొండ వద్ద ఉన్న అవుట్ లెట్ వైపు నుంచి 20.4 కి.మీ.లు తవ్వారు. మధ్యలో 9.8 కి.మీ. ల సొరంగాన్ని తవ్వాల్సి ఉంది. తవ్వకాలు పూర్తయితే ప్రపంచంలోనే అత్యంత పొడవైన మానవ నిర్మిత సొరంగంగా ఇది రికార్డు సృష్టించనుంది.
సర్వే ఇలా చేస్తారు..
24 మీటర్ల వ్యాసం కలిగిన ట్రాన్స్‌మీటర్ లూప్‌ను హెలికాప్టర్‌కు వేలాడదీసి సొరంగం తవ్వాల్సిన ప్రాంతంపై గాల్లో ఎగరడం ద్వారా ఈ సర్వే జరపనున్నారు. విద్యుత్ అయస్కాంత తరంగాలను ట్రాన్స్ మీటర్ భూమిలోకి పంపిస్తుంది. అవి భూగర్భంలోని పొరలకు తాకి పరావర్తనం చెందుతాయి.
తిరిగివచ్చే తరంగాలను రిసీవర్ ద్వారా గ్రహించి భూగర్భంలో ఎలాంటి నిర్మాణం ఉందో అంచనా వేస్తారు. 800–1,000 మీటర్ల లోతులో ప్రమాదకర పరిస్థితులు (షీర్ జోన్) ఉన్నాయా? నీళ్లు ఉన్నాయా? అనే అంశాలను నిపుణులు అధ్యయనం చేసి సొరంగం తవ్వకాలకు ఎలాంటి టెక్నాలజీ వినియోగించాలనేది సూచించనున్నారు.


