స్టేషన్ ఘన్‌పూర్: స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి దాఖలు చేసిన అఫిడవిట్‌పై తాటికొండ రాజయ్య తీవ్ర స్థాయిలో స్పందించారు. కడియం శ్రీహరి రాజకీయ నైతికతను పూర్తిగా కోల్పోయి వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
“రామా.. కృష్ణా అనుకుంటూ జీవించాల్సిన వ్యక్తి రాజకీయ వ్యభిచారానికి పాల్పడ్డాడు. ఘనపూర్ నియోజకవర్గ ప్రజల ఉసురు పోసుకుంటున్నాడు” అంటూ రాజయ్య ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల కష్టంతో ఎమ్మెల్యేగా గెలిచి, అదే పార్టీ కార్యకర్తలను నట్టేట ముంచేశారని ఆరోపించారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
గతంలో అనేకసార్లు తాను కాంగ్రెస్‌లో చేరానని, కాంగ్రెస్ కండువా కప్పుకున్నానని బహిరంగంగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. “నీ నీతిమాలిన మాటలతో సభ్య సమాజమే సిగ్గుపడుతోంది” అంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ శ్రేణులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని, లేకపోతే కాంగ్రెస్ నాయకుల వద్దకే వెళ్లిపోతావా అని ప్రశ్నించారు. ప్రజలకు తన రాజకీయ వైఖరిని ఎలా సమర్థించుకుంటావని నిలదీశారు.
అదే సమయంలో పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో స్పీకర్ కూడా రాజ్యాంగాన్ని పట్టపగలు ఖూనీ చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. “సిగ్గు, శరం ఉంటే ఇప్పటికైనా రాజీనామా చేయాలి” అంటూ కడియం శ్రీహరికి హితవు పలికారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో అడుగుపెడితే తీవ్ర నిరసనలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించిన రాజయ్య, ప్రజల్లో ఆగ్రహం రోజురోజుకు పెరుగుతోందని స్పష్టం చేశారు.


