పార్టీ మారిన 8 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ విచారణ పూర్తి
స్పీకర్ నోటీసులకు స్పందించిన ఎనిమిది మందిపై విచారణ
దానం, కడియంకు మళ్లీ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల వ్యవహారం కీలక దశకు చేరుకుంది. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేల్లో ఎనిమిది మందిపై విచారణ పూర్తయింది. ఇరుపక్షాల వాదనలు పూర్తయిన నేపథ్యంలో స్పీకర్ తన తుది తీర్పును రిజర్వు చేశారు. ఇప్పటివరకు స్పీకర్ నోటీసులకు స్పందించని ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి తాజాగా మరోమారు నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ సారథ్యంలోని ట్రిబ్యునల్ రెండు విడతలుగా విచారణ జరిపింది.
రెండో విడత విచారణలో భాగంగా ఈనెల 6, 7, 14, 15 తేదీల్లో ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్‌రావు, డాక్టర్ ఎం.సంజయ్ కుమార్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అరికెపూడి గాం«దీని పిటిషనర్ల తరపు న్యాయవాదులు ప్రశ్నించారు. తిరిగి తాజాగా 19, 20 తేదీల్లోనూ ఇరుపక్షాల న్యాయవాదులు స్పీకర్ ఎదుట మౌఖిక వాదనలు వినిపించారు. బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అరికెపూడి గాం«దీ, డాక్టర్ ఎం.సంజయ్ కుమార్, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, కాలె యాదయ్య, టి.ప్రకాశ్ గౌడ్‌పై స్పీకర్ వద్ద బీఆర్‌ఎస్ ఈ ఏడాది ఆరంభంలో అనర్హత పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
వారికి మూడు రోజుల గడువు
నాలుగు వారాల్లోగా అనర్హత పిటిషన్ల అంశం తేల్చాలంటూ సుప్రీంకోర్టు అసెంబ్లీ స్పీకర్‌కు ఇటీవల గడువు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి కూడా స్పీకర్ తాజాగా మరోమారు నోటీసులు జారీచేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ గడువులో ఇప్పటికే వారం రోజులు పూర్తి కాగా, స్పీకర్ తన నిర్ణయం ప్రకటించేందుకు మరో మూడు వారాల సమయం ఉంది. ఈ నేపథ్యంలో దానం, కడియంకు జారీ చేసిన నోటీసుల్లో మూడు రోజుల్లో సమాధానం ఇవ్వాలని స్పీకర్ గడువు విధించినట్లు తెలిసింది.
వారి నుంచి సమాధానం అందిన తర్వాత వాటిపై బీఆర్‌ఎస్ తన అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం ఇస్తారు. ఇరువర్గాల నుంచి అందిన సమాధానాలు, అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత స్పీకర్ వచ్చే నెల మొదటి వారంలో విచారణ షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశముంది. ఈ ఇద్దరి పిటిషన్ల విచారణ పూర్తయిన తర్వాతే పది మంది ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ తుది తీర్పును ప్రకటించే అవకాశముందని సమాచారం. అయితే ఎమ్మెల్యేలు స్పీకర్ విచారణకు హాజరవుతారా లేక అంతకుమునుపే తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తారా అనే అంశంపై చర్చ జరుగుతోంది.


