కేరళ రాష్ట్ర డీజీపీగా ఆయన చేసిన సేవలు నాకు ఆదర్శం
స్వతహాగా ప్రిపేరై గ్రూప్–1 ఉద్యోగానికి ఎంపికయ్యాను
పోచంపల్లి మున్సిపాలిటీ ట్రైనీ కమిషనర్ అన్నంబొట్ల లలిత శ్రావణి
యాదాద్రి భువనగిరి జిల్లా: రిటైర్డ్ డీజీపీ అయిన తన తాత నుంచి స్ఫూర్తి పొంది గ్రూప్–1 ఉద్యోగం సాధించినట్లు పోచంపల్లి మున్సిపాలిటీ ట్రైనీ కమిషనర్ అన్నంబొట్ల లలిత శ్రావణి తెలిపారు. తాత చేసిన సేవలు, ప్రజలచే ఆయన పొందిన మన్ననలను చూసి డిగ్రీ పూర్తవ్వగానే గ్రూప్–1 సాధించి గ్రేడ్–2 మున్సిపల్ కమిషనర్‌గా ఎంపికైనట్లు ఆమె పేర్కొన్నారు. శిక్షణలో భాగంగా గత వారం రోజులుగా పోచంపల్లి మున్సిపల్ కార్యాలయంలో పరిపాలన అంశాలను అధ్యయనం చేస్తున్న ఆమె.. తాను విజేతగా నిలవడానికి పడిన కష్టం గురించి సాక్షికి వివరించింది.
మాది హైదరాబాద్‌లోని మలక్‌పేట. మా నాన్న వెంకట్రామ్మోహన్ బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్, అమ్మ లక్ష్మి గృహిణి. మేము ఇద్దరం సంతానం. తమ్ముడు ఎంఎస్ చేసి ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్నాడు. నేను చిన్నప్పటి నుంచి చదువులో ఫస్టే. గౌతమ్ మోడల్ స్కూల్‌లో ఎస్సెస్సీ(10/10 జీపీఏ), దిల్‌సుఖ్‌నగర్‌లోని నారాయణ జూనియర్ కాలేజీలో ఇంటరీ్మడియట్ (972/1000) పూర్తి చేశాను. ఆ తర్వాత ఎంసెట్, జేఈఈ వైపు వెళ్లకుండా కోఠి ఉమెన్స్ కాలేజీలో చేరి 2019లో బీఏ డిగ్రీ పూర్తి చేశాను.
ఇంటర్‌లో నిర్ణయం తీసుకున్నా
మా తాత బలిజపల్లి శంకర్‌శాస్త్రి కేరళ రాష్ట్ర రిటైర్డ్ డీజీపీ. ఆయన తన సర్వీసులో చేసిన సేవలు, పొందిన అవార్డులు, ప్రజలచే పొందిన ప్రసంశలు నన్ను ఎంతగానో ఆకర్షించాయి. నేను కూడా ఆయన లాగే ప్రభుత్వ ఉద్యోగం సాధించి ప్రజాసేవ చేయాలని ఇంటర్‌లో ఉండగానే నిశ్చయించుకున్నాను. డిగ్రీ అయిపోగానే యూపీఏస్సీ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నాను. ఈలోగా 2022లో టీఎస్‌పీఎస్సీ నుంచి గ్రూప్–1 నోటిఫికేషన్ రావడంతో దానికి దరఖాస్తు చేసి ప్రిలిమ్స్ పాసయ్యాను. మెయిన్స్ సమయంలో పేపర్ లీక్ అయ్యిందనే కారణంతో ఆ నోటిఫికేషన్ రద్దయ్యింది. ఆ తర్వాత మళ్లీ నోటిఫికేషన్ వేశారు. కానీ కొందరు కోర్టుకు వెళ్లడంతో మళ్లీ ఆగిపోయింది.
మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగం
మూడోసారి గ్రూప్–1 నోటిఫికేషన్ వచ్చింది. ఎటువంటి కోచింగ్‌కు వెళ్లకుండా స్వతహాగా నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఇంట్లోనే ఏడాది పాటు ప్రిపేర్ అయ్యాను. ప్రిపరేషన్ సమయంలో శుభకార్యాలు, సెల్‌ఫోన్‌కు దూరంగా ఉండి మొదటి ప్రయత్నంలోనే రాష్ట్రస్థాయిలో 151వ ర్యాంకు సాధించి మున్సిపల్ కమిషనర్ ఉద్యోగానికి ఎంపికయ్యాను. నేను కష్టపడ్డ తీరు చూసి ఏదో ఒక జాబ్ కొడతా అని నా తల్లిదండ్రులకు చాలా నమ్మకం ఉండేది. వారి విశ్వాసాన్ని నిలబెట్టాను. ప్రజలకు నేరుగా సేవ చేసే ఉద్యోగం వచ్చినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. విజయం సాధించాలనే తపన, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. అనవసర విషయాలు వదిలేసి లక్ష్యం వైపు దృష్టిపెడితే సాధ్యం కానిదంటూ ఏదీ లేదు.
పోచంపల్లి ఎంతో ప్రత్యేకం
అంతర్జాతీయంగా పేరున్న పోచంపల్లి మున్సిపాలిటీకి ట్రైనీ మున్సిపల్ కమిషనర్‌గా రావడం అదృష్టంగా భావిస్తున్నా. భూదానోద్యమ చరిత్ర, ఇక్కత్ చేనేత వస్త్రాలు, చేనేత కళాకారుల గొప్పదనం, కుల వృత్తులు ఇలా పోచంపల్లిలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.


