సాక్షి, తాడేపల్లి: అమరావతి రాజధానిలో రెండో దశ భూ సమీకరణపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి దశలో తీసుకున్న భూమినే అభివృద్ది చేయకుండా మళ్లీ రెండో దశ ఎందుకని వైఎస్ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు చేస్తున్నది పిచ్చి పని అంటూ మండిపడ్డారు.
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు వైఖరిని తప్పు పట్టారు. ఈ సందర్బంగా వైఎస్ జగన్..‘రాజధాని పేరుతో తొలి విడతలో 50 వేల ఎకరాలు తీసుకున్నారు. ఆ భూమి అభివృద్దికే లక్ష కోట్లు అవసరమని చంద్రబాబు చెప్పారు. అది కూడా కేవలం రోడ్లు, కరెంటు, డ్రైనేజీ, నీరు లాంటి మౌళిక సదుపాయాలకే ఖర్చు చేశారు. ఆ లక్ష కోట్లు ఎప్పుడు వస్తాయో? ఎలా వస్తాయో తెలియదు. అప్పట్లో రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు.
చంద్రబాబు చర్యలతో భూములు ఇచ్చిన రైతులు బోరుమంటున్నారు. వారికి ఇప్పటి వరకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఇంకా రెండో దశ పేరుతో భూములు ఎందుకు తీసుకుంటున్నారు?. మరో 50 వేల ఎకరాలు తీసుకుని ఏం చేస్తారు?. ఈ లక్ష ఎకరాల్లో మౌళిక సదుపాయాల కల్పనకే రూ.2 లక్షల కోట్లు అవసరం అవుతాయి. ఈ డబ్బంతా ఎక్కడ నుంచి తెస్తారు?. తాను, తన బినామీలు దోచుకోవటానికే చంద్రబాబు భూములు సేకరిస్తున్నారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.

ఇది కూడా చదవండి: క్రిడెట్ చోరికి బాబు పడరాని పాట్లు: వైఎస్ జగన్


