సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. సుప్రీంకోర్టు ఈ కేసును సీరియస్‌గా పరిగణించి విచారణను వేగవంతం చేయాలని సూచించిన నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ వేగం పెంచారు.
సుప్రీంకోర్టు దిశానిర్దేశాలు చేసిన నేపథ్యంలో ఇప్పటికే అఫిడవిట్లు సమర్పించని ఇద్దరు ఎమ్మెల్యేలకు స్పీకర్ మరోసారి నోటీసులు జారీ చేశారు. అయితే స్పీకర్‌ను ఎమ్మెల్యే కడియం శ్రీహరి కలిసి కాస్త గడువు కోరారు. ఇదిలావుండగా మరోవైపు ఎమ్మెల్యే దానం నాగేందర్ మాత్రం స్పీకర్ వద్ద ఎలాంటి విజ్ఞప్తి చేయలేదని తెలుస్తోంది.
రెండు రోజుల పాటు ఢిల్లీలో ఉండి పార్టీ అధిష్టాన పెద్దలతో ఆయన చర్చించినట్టు సమాచారం. తిరిగి రాష్ట్రానికి వచ్చాక కూడా కీలక సమావేశాల్లో పాల్గొన్నారు. అయితే.. స్పీకర్ ఇచ్చిన నోటీసులకు సంబంధించిన వివరణను సిద్ధం చేసుకునే ప్రక్రియలో భాగంగా దానం శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో గంటకు పైగా భేటీ అయినట్లు తెలుస్తోంది. అధిష్టాన పెద్దలు సూచించిన అంశాలనే ఆయన ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. ఈ భేటీలో అసెంబ్లీ సెక్రటరీ నర్సింహాచార్యులు సైతం పాల్గొన్నారు.


