సాక్షి, హైదరాబాద్: స్టడీ టూర్ పేరిట ఇతర సిటీలను చూసేందుకు వెళ్లిన కార్పొరేటర్ల అవస్థలు అన్నీఇన్నీ కావు. వారిని చూసి పలువురు జాలి పడుతున్నారు. సాధారణంగా.. నగర పాలనకు సంబంధించి ఇతర సిటీల్లో అమలవుతున్న మెరుగైన విధానాలను అధ్యయనం చేసి, వాటిని హైదరాబాద్‌లో అమలు చేసే అంశాన్ని పరిశీలించేందుకు కార్పొరేటర్లు స్లడీ టూర్లకు వెళ్తారు. తాము అధ్యయనం చేసిన అంశాల్ని, వాటిని ఇక్కడ ఎలా అమలు చేయవచ్చో పేర్కొంటూ ఒక నివేదిక రూపొందించి కమిషనర్‌కు అందజేస్తారు. సాధ్యాసాధ్యాలు పరిశీలించి అమలు చర్యలు చేపడతారు. కార్పొరేటర్ల స్టడీటూర్‌కయ్యే వ్యయాన్ని జీహెచ్‌ఎంసీ ఖజానా నుంచే చెల్లిస్తారు. జీహెచ్‌ఎంసీలో చేయాల్సిన పనులకు కాబట్టి జీహెచ్‌ఎంసీ నుంచి ఖర్చు చేస్తారు. అందుకు ఎవరికీ అభ్యంతరం లేదు.
ఎందుకీ అభ్యంతరాలు ?
కార్పొరేటర్ల టూర్లపై పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. గతంలో స్టడీటూర్ల పేరిట ఆయా నగరాలు తిరిగి వచ్చి , ఇక్కడ చేసిందేమీ లేకపోవడం ఒక కారణం కాగా.. మరో నెలరోజుల్లో పదవి నుంచి దిగిపోనున్న వారు ఇక చేసేదేముంటుందన్నది ప్రధాన అభ్యంతరం. ప్రజా ధనంతో ఇలాంటి టూర్లను అనుమతించరాదంటూ ఫోరమ్ ఫర్ గుడ్‌గవర్నెన్స్ సహా పలు సంస్థలు, ప్రజలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో లోకాయుక్త సైతం ప్రజాధనంతో కార్పొరేటర్ల టూర్లను ఆక్షేపించింది. ఈ నేపథ్యంలో గుట్టుచప్పుడు కాకుండా.. మేయర్ సహా అహ్మదాబాద్ కు బయలుదేరారు. దిగిపోయేముందు ఈ టూర్లు అనవసరమని భావించి స్వచ్ఛందంగానే టూర్లను విరమించుకున్న కార్పొరేటర్లు కూడా ఉండటం విశేషం.
టూర్ కోసం జీహెచ్‌ఎంసీ ఒక్కో కార్పొరేటర్‌కు దాదాపు లక్ష రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. కార్పొరేటర్లు టూర్లు చేయాలనుకుంటే కష్టమేం కాదు. ఏ కొందరో మినహా, ఎన్నికల్లో గెలిచేందుకు లక్షలకు లక్షలు ఖర్చు చేశారు. అలాంటి వారికి ఈ టూర్‌కయ్యే వ్యయం లెక్కలోది కాదు. అలాంటప్పుడు ఈ కక్కుర్తి ఏమిటన్నదే సాధారణ ప్రజల ప్రశ్న. పదవి దిగిపోయే ముందు అపప్రథ మూటగట్టుకోవడం తప్ప ఇప్పుడీ టూర్ ఎందుకన్నదానికి ‘స్టడీ’టూర్‌కు వెళ్లిన, వెళ్లనున్న వారేమైనా సమాధానం చెబుతారేమో వేచి చూడాల్సిందే.
పేరుకు మాత్రమే..
జీహెచ్‌ఎంసీలో కొంతకాలంగా, మరీ ముఖ్యంగా ప్రస్తుత పాలకమండలి హయాంలో స్టడీ టూర్లంటే విహార యాత్రలనే ముద్ర పడేలా చేశారు. పేరు మాత్రం స్టడీ టూర్లంటూ ఇష్టమొచ్చినట్టు నగరాల్ని రెండు మూడు బ్యాచ్‌లుగా వెళ్లి వచ్చేలా అలవాటు చేశారు. వెళ్లనివారు అనివార్య కారణాల వల్ల వెళ్లలేదని పేర్కొంటూ ప్రయాణ చార్జీల్ని పొందిన ఘటనలు కూడా గతంలో ఉన్నాయి. తాజాగా మంగళవారం 40 మందికి పైగా అహ్మదాబాద్ వెళ్లినట్లు సమాచారం. అహ్మదాబాద్‌లోని నర్మద రివర్‌ప్రాజెక్ట్ అధ్యయనం పేరిట వెళ్లారు. మిగతా వారు సంక్రాంతి పండగ తర్వాత వెళ్లేందుకు ప్లాన్ సిద్ధం చేశారు.


