పురిటిగడ్డకు బాబు వెన్నుపోటు! | Chandrababu Conspiracy On Rayalaseema Irrigation Project | Sakshi
Sakshi News home page

పురిటిగడ్డకు బాబు వెన్నుపోటు!

Jan 7 2026 5:12 AM | Updated on Jan 7 2026 11:01 AM

Chandrababu Conspiracy On Rayalaseema Irrigation Project

రాయలసీమ, నెల్లూరు అభివృద్ధి, ప్రయోజనాలపై చీమంతైనా చిత్తశుద్ధి లేని చంద్రబాబు 

సీమ ఎత్తిపోతలతో ఎలాంటి ప్రయోజనం లేదంటూ మంత్రి నిమ్మలతో చెప్పించిన బాబు 

శ్రీశైలంలో మట్టం 881 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు ద్వారా రోజూ గరిష్టంగా 44 వేల క్యూసెక్కులు తరలించే అవకాశం 

800 నుంచి 841 అడుగుల లోపే సుమారు 7 టీఎంసీల నీటిని తోడేస్తున్న తెలంగాణ

ఇక 881 అడుగులకు ఎప్పుడు చేరాలి?.. ఎప్పుడు పోతిరెడ్డిపాడుకు నీరు రావాలి? 

అందుకే మనకు హక్కుగా దక్కిన వాటా జలాలను పూర్తి స్థాయిలో వాడుకోవడానికి చేపట్టిందే 

సీమ ఎత్తిపోతల.. ఆ దిశగానే వైఎస్‌ జగన్‌ వడివడిగా అడుగులు

సాక్షి, అమరావతి: రాయలసీమ, నెల్లూరు జిల్లాల అభివృద్ధి.. ప్రయోజనాలపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు చీమంతైనా చిత్తశుద్ధి లేదన్న నిజం మరోసారి తేటతెల్లమైంది. ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబుతో తాను ఏకాంతంగా సమావేశమై రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆపివేయించానని.. ఆ పనులు ఆగిపోయాయో లేదో అన్నది తెలుసుకోవాలంటే తనిఖీ చేసుకోవచ్చని తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ఆ రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డి గత శనివారం చేసిన వ్యాఖ్యలను ఇప్పటివరకు చంద్రబాబు కనీసం ఖండించలేదు. ఇక జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ద్వారా రాయలసీమ ఎత్తిపోతలతో ఎలాంటి ప్రయోజనం లేదంటూ తాజాగా మంగళవారం స్పష్టం చేయించడం ద్వారా.. తెలంగాణ సీఎం రేవంత్‌ చెప్పింది నిజమేనని సీఎం చంద్రబాబు పరోక్షంగా అంగీకరించారు. 

రాయలసీమ ఎత్తిపోతల పూర్తయితే వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు మంచి పేరొస్తుందనే ఈర్ష్యతోనే పనిగట్టుకుని ఆ ఎత్తిపోతల పనులు నిలిపివేయించారని సాగునీటిరంగ నిపుణులు తేల్చి చెబుతున్నారు. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌కే కాదు.. జన్మనిచ్చిన రాయలసీమకు కూడా చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని మండిపడుతున్నారు. దుర్భిక్ష రాయలసీమ, నెల్లూరు జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు 2005లో నాటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌  సామర్థ్యాన్ని 11 వేల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచినప్పుడు.. దాన్ని నిరసిస్తూ, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతూ అటు ప్రకాశం బ్యారేజీపై దేవినేని ఉమామహేశ్వరావుతో ఇటు తెలంగాణ ప్రాంతంలో మహబూబ్‌నగర్‌ జిల్లాలో మాజీ మంత్రి నాగం జనార్ధనరెడ్డితో చంద్రబాబు ధర్నాలు చేయించారని గుర్తు చేస్తున్నారు.

ముమ్మాటికీ సీమ ఎత్తిపోతల గేమ్‌ ఛేంజర్‌..
శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా కనీస నీటి మట్టం 854 అడుగులు. తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి ఆయకట్టుకు సాగునీరు, చెన్నైకి తాగునీటిని శ్రీశైలం ప్రాజెక్టులో పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారానే నీటిని విడుదల చేయాలి. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ను శ్రీశైలం ప్రాజెక్టులో 841 అడుగుల నీటి మట్టం వద్ద అమర్చారు. శ్రీశైలంలో నీటి మట్టం 881 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు ద్వారా ప్రస్తుత డిజైన్‌ మేరకు రోజుకు గరిష్టంగా 44 వేల క్యూసెక్కులు తరలించే అవకాశం ఉంటుంది. అదే 854 అడుగుల్లో నీటి మట్టం ఉంటే 7 వేలు, 841 అడుగుల్లో నీటి మట్టం ఉంటే 2 వేల క్యూసెక్కులు మాత్రమే తరలించే వీలుంది. 

ఇక శ్రీశైలంలో 841 అడుగుల కంటే దిగువన నీటి మట్టం ఉంటే చుక్క నీటిని కూడా తీసుకోలేం. ఈ క్రమంలో విభజన తర్వాత 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సర్కార్‌.. తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం కొలువుదీరాయి. కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశించే వరకూ ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలాన్ని ఏపీ ప్రభుత్వం.. నాగార్జునసాగర్‌ను తెలంగాణ సర్కార్‌ నిర్వహించాలని నాడు కేంద్రం నిర్దేశించింది. కానీ.. శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రం తమ భూభాగంలో ఉందంటూ అప్పట్లో తెలంగాణ సర్కార్‌ తన అధీనంలోకి తీసుకున్నప్పటికీ చంద్రబాబు సర్కార్‌ అభ్యంతరం చెప్పలేదు. ఇంతలో 2015లో ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ సర్కార్‌కు సీఎం చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. దీంతో తెలంగాణ సర్కార్‌ కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యాన్ని 25 నుంచి 40 టీఎంసీలకు పెంచుతున్నా.. అనుమతి లేకుండా శ్రీశైలం నుంచి రోజుకు 2 టీఎంసీలు తరలించేలా పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల చేపట్టినా చంద్రబాబు సర్కార్‌ నోరు మెదపలేదు. 

ఫలితంగా శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రం నుంచి 4 టీఎంసీలు, కల్వకుర్తి నుంచి 0.4 టీఎంసీ, ఎస్సెల్బీసీ నుంచి 0.5 టీఎంసీ, పాలమూరు–రంగారెడ్డి–డిండి ఎత్తిపోతల ద్వారా 2 టీఎంసీలు వెరసి శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల నీటి మట్టం నుంచే రోజుకు 6.95 టీఎంసీలు తరలించే సామర్థ్యాన్ని తెలంగాణ సర్కార్‌ సాధించుకుంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 800 అడుగుల స్థాయిలో హంద్రీ–నీవా ద్వారా కేవలం 0.33 టీఎంసీలు తరలించే సామర్థ్యం మాత్రమే ఏపీకి ఉంది. శ్రీశైలం దిగువన తాగు, సాగునీటి అవసరాలు ఉన్నప్పుడు కృష్ణా బోర్డు అనుమతి ఇచ్చిన మేరకే నీటిని విడుదల చేస్తూ రెండు రాష్ట్రాలు విద్యుదుత్పత్తి చేయవచ్చు. కానీ.. 2014 నుంచి శ్రీశైలంలో నీటి మట్టం కనీస స్థాయికి 854 అడుగులకు చేరకున్నా.. వరద ప్రవాహం ప్రారంభం కాకపోయినా సరే తెలంగాణ సర్కార్‌ శ్రీశైలం దిగువన ఎలాంటి నీటి అవసరాలు లేనప్పటికీ ఎడమ గట్టు కేంద్రంలో యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ.. దిగువకు నీటిని తరలిస్తూ శ్రీశైలాన్ని ఖాళీ చేస్తూ రాయలసీమ రైతుల హక్కులను హరిస్తున్నా చంద్రబాబు సర్కార్‌ నోరుమెదపలేదు. 

శ్రీశైలంలోకి వచ్చిన నీటిని వచ్చింది వచ్చినట్టుగా తరలించడం వల్ల పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌కు నీళ్లందక.. తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి ఆయకట్టులో 2014–19 మధ్య ఏటా పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కృష్ణా బేసిన్‌లో 2015–16లో వర్షాభావ పరిస్థితుల వల్ల శ్రీశైలానికి 58.69 టీఎంసీల ప్రవాహమే రాగా.. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌కు కేవలం 0.95 టీఎంసీని మాత్రమే సరఫరా చేశారు. ఆ ఏడాది గుక్కెడు తాగునీటి కోసం కటకటలాడారు. ఇక 2016–17లో శ్రీశైలానికి 337.95 టీఎంసీలు వచ్చినా.. తెలంగాణ 800 అడుగుల నుంచే యథేచ్ఛగా నీటిని తరలించడం వల్ల పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా కేవలం 67.44 టీఎంసీలను మాత్రమే విడుదల చేశారు. 

ఈ నేపథ్యంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తడారిన గొంతులను తడిపేందుకు.. బచావత్‌ ట్రిబ్యునల్‌ ద్వారా హక్కుగా దక్కిన నీటిని వాడుకుని ఎండిపోతున్న పంటలను రక్షించడం కోసం.. తెలంగాణ తరహాలోనే శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం నుంచి రోజుకు 3 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ దిగువన కుడి ప్రధాన కాలువలోకి నీటిని ఎత్తిపోసేలా రూ.3,825 కోట్ల వ్యయంతో 2020 మే 5న రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టడానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ ఎత్తిపోతల రాయలసీమ, నెల్లూరు జిల్లాల రూపురేఖలను మార్చేస్తుందని.. ఆ జిల్లాల అభివృద్ధికి గేమ్‌ ఛేంజర్‌ అవుతుందని సాగునీటిరంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. మంత్రి నిమ్మల చెబుతున్నట్లుగా శ్రీశైలంలో 841 అడుగుల దిగువన నిల్వ ఉండే 34 టీఎంసీలను తరలించడానికి కాదు.. 841 అడుగుల ఎగువ నుంచి కూడా హక్కుగా దక్కిన వాటా జలాలను పూర్తి స్థాయిలో వాడుకోవడానికి చేపట్టిందే రాయలసీమ ఎత్తిపోతల అని స్పష్టం చేస్తున్నారు. 

గవినోళ్ల శ్రీనివాస్‌తో ఎన్జీటీలో ఫిర్యాదు చేయించిదెవరు బాబూ..?
రాయలసీమ ఎత్తిపోతలను రూ.3,307.6 కోట్ల అంచనాతో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కాంట్రాక్టర్‌కు అప్పగించి పనులను పరుగులెత్తించింది. సీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే వైఎస్‌ జగన్‌కు ఎక్కడ మంచి పేరొస్తుందోననే ఈర్షతో.. తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన టీడీపీ సానుభూతిపరుడు గవినోళ్ల శ్రీనివాస్‌ ద్వారా ఎన్జీటీ (చెన్నై) బెంచ్‌లో చంద్రబాబు రిట్‌ పిటిషన్‌ దాఖలు చేయించారు. ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పశ్చిమ మండలాల రూపురేఖలను మార్చడానికి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం హంద్రీ–నీవాలో అంతర్భాగంగా చేపట్టిన ముదివేడు, నేతిగుంటపల్లి, ఆవులపల్లి రిజర్వాయర్ల పనులపైనా అదే గవినోళ్ల శ్రీనివాస్‌తో ఎన్జీటీలో ఫిర్యాదు చేయించారు. రాయలసీమ ఎత్తిపోతలతోపాటు ఆ మూడు రిజర్వాయర్ల నిర్మాణం వల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందని ఎన్జీటీలో వాదించారు. 

అయితే తెలుగుగంగ, గాలేరు–నగరి, ఎస్సార్బీసీలకు పర్యావరణ అనుమతి ఉందని.. ఆ ప్రాజెక్టులకు నీటిని అందించడానికి చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి అవసరం లేదని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం నాడు ఎన్జీటీకి స్పష్టం చేసింది. కానీ.. పర్యావరణ అనుమతి తీసుకుని, ఆ పనులు చేపట్టాలంటూ 2020 అక్టోబర్‌ 29న ఎన్జీటీ ఆదేశించింది. దీంతో పర్యావరణ అనుమతి కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తూనే.. ఆ అనుమతి వచ్చేలోగా చెన్నైకి 15 టీఎంసీలు, రాయలసీమలో దుర్భిక్ష ప్రాంతాలకు తాగునీటిని సరఫరా చేసే పనులను తొలి దశలో చేపట్టాలని 2023 ఆగస్టు 11న  నిర్ణయించింది. 

 



చెన్నైకి నీటిని సరఫరా చేయాలంటే.. తెలుగు గంగ ప్రధాన కాలువపై ఉన్న వెలిగోడు రిజర్వాయర్‌ (9.5 టీఎంసీలు), సోమశిల (17.33 టీఎంసీలు), కండలేరు (8.4 టీఎంసీలు) రిజర్వాయర్‌లలో మొత్తంగా కనీసం 35.23 టీఎంసీలు నిల్వ ఉండాలి. అప్పుడే చెన్నైకి 15 టీఎంసీలను సరఫరా చేయడానికి అవకాశం ఉంటుంది. దీనికి తోడు రాయలసీమలోని దుర్భిక్ష ప్రాంతాలకు తాగునీటి కోసం 8.6 టీఎంసీలు వెరసి 58.83 టీఎంసీలు (35.23+15+8.6) శ్రీశైలం నుంచి తరలించే పనులను పర్యావరణ అనుమతి వచ్చేలోగా చేపట్టడానికి అనుమతి ఇవ్వాలన్న అధికారుల ప్రతిపాదనకు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. 

ఆ మేరకు అధికారులు పనులు చేపట్టారు. రూ.990 కోట్ల విలువైన పనులను పూర్తి చేశారు. కానీ.. గతేడాది ఫిబ్రవరి 27న కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నిర్వహించిన ఈఏసీ సమావేశంలో రాయలసీమ ఎత్తిపోతలను తొలి దశలో తాగునీటి అవసరాల కోసం చేపడుతున్నామని.. మలి దశలో పర్యావరణ అనుమతి తీసుకుంటామని చంద్రబాబు సర్కారు స్పష్టం చేసి ఉంటే ఆ ఎత్తిపోతల పనులకు ఎలాంటి అడ్డంకి ఉండేది కాదని సాగునీటిరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కేవలం వైఎస్‌ జగన్‌కు మంచి పేరొస్తుందనే ఈర‡్ష్యతోనే ఉద్దేశపూర్వకంగానే వాస్తవాలను ఈఏసీ సమావేశంలో చంద్రబాబు సర్కార్‌ చెప్పలేదని స్పష్టం చేస్తున్నారు. 

పట్టిసీమ, పురుషోత్తపట్నం, చింతలపూడికి పర్యావరణ అనుమతి ఏదీ..?
రాయలసీమ ఎత్తిపోతలను వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పర్యావరణ అనుమతి తీసుకోకుండా చేపట్టిందని.. అందువల్లే ఆ ఎత్తిపో­తల పనులు ఆగిపోయాయంటూ మంత్రి నిమ్మల ఏమాత్రం పసలేని వాదన చేస్తున్నారు. 2014–19 మధ్య చంద్రబాబు సర్కార్‌ పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేయకుండా.. కమీషన్ల కోసం గోదావరి కుడి గట్టుపై పట్టిసీమ, ఎడమ గట్టుపై పురుషోత్తపట్నం ఎత్తిపోతలను చేపట్టింది. ఆ రెండు ఎత్తిపో­తలకు పర్యావరణ అనుమతులు తీసుకోలేదు. ఇక చింతలపూడి ఎత్తిపోతల తొలిదశకు 2008లో నాటి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం పర్యావరణ అనుమతి తీసుకుంది. కానీ.. 2018లో ఆ ఎత్తిపోతల సామర్థ్యాన్ని చంద్రబాబు సర్కార్‌ పెంచింది. 

అయితే దానికి పర్యావరణ అనుమతి తీసుకోలేదు. ఈ మూడు ఎత్తిపోతల పథకాలపై ఎన్జీటీలో కేసులు దాఖలయ్యాయి. పర్యావరణ అనుమతి తీసుకోకుండా చేపట్టిన ఆ మూడు ఎత్తిపోతల పథకాలపై జరిమానా విధిస్తూ 2021 డిసెంబర్‌ 2న ఎన్జీటీ తీర్పు ఇచ్చింది. పురుషోత్తపట్నం ఎత్తిపోతలపై రూ.24.56 కోట్లు, పట్టిసీమ ఎత్తిపోతలపై రూ.24.9 కోట్లు, చింతలపూడి ఎత్తిపోతలపై రూ.73.6 కోట్లను జరిమానాగా విధించింది. నిజానికి రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి అవసరం లేదని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఏర్పాటు చేసిన కమిటీ తొలుత నివేదిక ఇచ్చింది.

జగన్‌ హయాంలో సీమ సుభిక్షం..
నాడు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పులిచింతల నిర్వాసితులకు పరిహారం చెల్లించి సమస్యలను పరిష్కరించింది. తెలంగాణకు పరిహారం చెల్లించి పూర్తి స్థాయిలో అంటే 45.77 టీఎంసీలను పులిచింతలలో నిల్వ చేసి కృష్ణా డెల్టాలో రెండు పంటలకు నీళ్లందించి చరిత్ర సృష్టించింది. తెలుగుగంగ లింక్‌ కెనాల్‌ను ఆధునికీకరించి.. వెలుగోడు రిజ­ర్వాయర్‌ను సకాలంలో గరిష్ట సామర్థ్యం 16.95 టీఎంసీలను చేర్చి నింపింది. రూ.600 కోట్లతో తెలుగుగంగ ప్రధాన కాలువకు లైనింగ్‌ చేసి.. డిజైన్‌ మేరకు ప్రవాహ సామర్థ్యాన్ని 5 వేల క్యూసెక్కులకు పెంచింది. బ్రహ్మంసాగర్‌ మట్టికట్టకు రూ.90 కోట్లతో డయాఫ్రం వాల్‌ను వేసి లీకేజీలకు అడ్డుకట్ట వేసి దాని పూర్తి సామర్థ్యం మేరకు 17.74 టీఎంసీలను నిల్వ చేసింది. 

తెలుగుగంగలో అంతర్భాగమైన సోమశిల రిజర్వా­యర్‌లో గరిష్ట సామర్థ్యం మేరకు 78 టీఎంసీలు, కండలేరు రిజర్వాయర్‌లో పూర్తి సామర్థ్యం మేరకు 68.3 టీఎంసీలను నింపి ఐదేళ్లూ ఆయకట్టులో రెండు పంటలకూ నీళ్లందించింది. ఇక గాలేరు–నగరి వరద కాలువలో అవుకు వద్ద రెండు సొరంగాలను పూర్తి చేసి.. గండికోట రిజర్వాయర్‌ నిర్వాసి­తులకు రూ.వెయ్యి కోట్లను పరిహారంగా చెల్లించి, వారికి పునరావాసం కూడా కల్పించి గరిష్ట సామర్థ్యం మేరకు 26.85 టీఎంసీలను నిల్వ చేసింది. చిత్రావతి రిజర్వాయర్‌ నిర్వాసితులకు రూ.250 కోట్లను పరి­హారంగా చెల్లించి, పునరావాసం కల్పించి.. గరిష్ట సామర్థ్యం మేరకు పది టీఎంసీలు నిల్వ చేసింది. ఇలా ఐదేళ్లూ రిజర్వాయ­ర్లను సకాలంలో నింపి.. రాయల­సీమను సస్యశ్యామలం చేసింది. 

మారిన వాతావరణ పరిస్థి­తుల్లో వర్షాలు కురిసే రోజులు తగ్గాయి. శ్రీశైలానికి గరిష్టంగా వరద వచ్చినప్పుడు దాన్ని ఒడిసి పట్టుకునే సామర్థ్యం కాలువలకు లేదు. దీంతో కృష్ణా వరద జలాలను గరిష్ట స్థాయిలో ఒడిసి పట్టి శ్రీశైలానికి వరద వచ్చే 30–40 రోజుల్లోనే రాయలసీమ, నెల్లూరు ప్రాజెక్టులను నింపేలా వైఎస్సార్‌సీపీ హయాంలో కాలువల సామర్థ్యం పెంచే పనులు, అవసరమైన చోట్ల కొత్త ప్రాజెక్టుల పనులను చేపట్టింది. ఈ క్రమంలో పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యాన్ని 44 వేల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచే పనులు.. శ్రీశైలం కుడి గట్టు ప్రధాన కాలువ సామర్థ్యాన్ని, గాలేరు–నగరి వరద కాలువ, తెలుగుగంగ లింక్‌ కెనాల్, ప్రధాన కాలువ ప్రవాహ సామర్థ్యం పెంచే పనులను చేపట్టింది. 

కేసీ కెనాల్‌ ఆయకట్టును స్థిరీకరించడానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాజోలి, జోలదరాసి రిజర్వాయర్ల పనులను చేపట్టింది. ఇక తెలుగుగంగ ఆయకట్టుకు సమృద్ధిగా నీటిని అందించడానికి కుందూ ఎత్తిపోతల పనులను చేపట్టింది. గాలేరు–నగరి సుజల స్రవంతి–హంద్రీ–నీవా సుజల స్రవం­తిలను అనుసంధానం చేస్తూ ఉమ్మడి అనంతపురం, వైఎస్సార్‌ కడప, చిత్తూరు జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు పనులు చేపట్టింది. హంద్రీ–నీవా ప్రధాన కాలువ సామ­ర్థ్యాన్ని 3,850 నుంచి 6,300 క్యూసెక్కులకు పెంచే పనులను చేపట్టింది. కానీ.. చంద్రబాబు సర్కార్‌ ఆ పనులన్నింటినీ ఆపేసి రాయలసీమకు వెన్నుపోటు పొడిచింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement