నైజీరియాకు తరలించిన ఈగల్ ఫోర్స్
సాక్షి, హైదరాబాద్: స్థానికంగా మత్తుపదార్థాలు సరఫరా చేస్తున్న నైజీరియాకు చెందిన ఓ మహిళను తెలంగాణ ఈగల్ ఫోర్స్ మన దేశం నుంచి బహిష్కరించింది. మంగళవారం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఈమెను నైజీరియాకు తరలించారు. ఈ మేరకు ఈగల్ ఫోర్స్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. నైజీరియాకు చెందిన ముగ్గురు మహిళలు నకిలీ పాస్‌పోర్ట్, నకిలీ వీసాలతో భారత్‌కు వచ్చారు. ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి విశాఖపట్నం చేరుకున్న వారు స్థానికంగా షెల్టర్ తీసుకున్నారు. ఒక ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుని డ్రగ్స్ అమ్మకాలు చేస్తున్నారు.
నవంబర్ మొదటి వారంలో తెలంగాణ ఈగల్ ఫోర్స్ పోలీసులు ఢిల్లీలో నిర్వహించిన భారీ ఆపరేషన్‌లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఆపరేషన్‌లో 50 మందికి పైగా నైజీరియన్లను అరెస్ట్ చేయగా.. విశాఖపట్నంలో డ్రగ్స్ దందా చేస్తున్న ముగ్గురు మహిళల సమాచారం తెలిసింది. ఈ మేరకు డిసెంబర్‌లో విక్టరీ ఇటోహాన్ ఇయాసేలే సహా ముగ్గురు విదేశీ మహిళలను ఈగల్ ఫోర్స్ అరెస్ట్ చేసింది. ముగ్గురికీ హైదరాబాద్‌లోని ఫారినర్స్ రీజినల్ రిజి్రస్టేషన్ ఆఫీస్‌లో (ఎఫ్‌ఆర్‌ఆర్‌వో) బయోమెట్రిక్ నిర్వహించారు.
ఆమెకు జింబాబ్వేకు చెందిన దంబుజా తఫాడ్జ్వా పేరున నకిలీ పాస్‌పోర్ట్, వీసా ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత ఎఫ్‌ఆర్‌ఆర్‌వో పాస్‌పోర్ట్‌ను పరిశీలించారు. ఇయాసేలే విక్టరీ ఇటోహాన్ నైజీరియాకు చెందిన మహిళను గుర్తించారు. ఎఫ్‌ఆర్‌ఆర్‌వో నుంచి అనుమతి తీసుకుని ముగ్గురిని హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌లోని డిటెన్షన్ సెంటర్‌లో ఉంచారు. విక్టరీ ఇటోహాన్ ఇయాసేలేకు ఎఫ్‌ఆర్‌ఆర్‌వో నుంచి ఎగ్జిట్ పరి్మట్ పొందిన తర్వాత నైజీరియాకు టికెట్ కొనుగోలు చేశారు. దాదాపు 37 రోజుల పాటు డిటెన్షన్ సెంటర్‌లో ఉంచిన తర్వాత మంగళవారం నైజీరియాలోని లాగోస్‌కు పంపించారు.


