సాక్షి, వరంగల్: పార్టీ ఫిరాయింపుల విచారణ కొనసాగుతున్న వేళ.. సీనియర్ నేత, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. పరిస్థితులను బట్టే తన నిర్ణయం ఉంటుందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారాయన. శనివారం మీడియాతో ఆయన మాట్లాడుతూ..
‘‘నిన్న స్పీకర్‌ని కలిసి కొంత సమయం ఇవ్వాలని కోరాను. దానికి వారు సానుకూలంగా స్పందించారు. ఆయన ఎంత సమయం ఇస్తారో ఇవాళ తెలుస్తుంది. సమాధానం ఇవ్వకపోవడానికి ఎలాంటి ప్రత్యేక కారణాలు లేవు. శ్రేయోభిలాషులు, నియోజకవర్గ ప్రజలు, న్యాయ నిపుణులతో చర్చించి సలహాలు తీసుకుంటున్నాను. స్పీకర్ నిర్ణయం.. పరిస్థితులను బట్టే నా నిర్ణయం ఉంటుంది’’ అని కడియం స్పష్టత ఇచ్చారు.
బైపోల్ వస్తే..
రాజీనామా,ఉప ఎన్నిక అంశంపై మాట్లాడుతూ.. తన రాజీనామాపై ప్రతిపక్షాలు చాలా కుతూహలంతో ఉన్నాయని కామెంట్ చేశారు. అయితే ఉప ఎన్నికలు వచ్చినా అభ్యర్థిగా తానే ఉంటానని.. గెలిచి తీరతానని కడియం ధీమా వ్యక్తం చేశారు.


