సాక్షి, హైదరాబాద్: భార్య వంట చేయలేదని చెప్పి భర్త విడాకులు కోరడాన్ని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. దంపతులిద్దరూ ఉద్యోగాలు చేస్తున్న ప్పు డు భార్య వంట చేసేందుకు ఆస్కారం ఉండకపోవచ్చునని చెప్పింది. అంతేకాకుండా వంట చేయకుండా తన తల్లికి ఆమె సహకరించడం లేదని చెప్పి భార్య క్రూరత్వానికి పాల్పడిందనే భర్త వాదనను తోసిపుచ్చింది. వివరాలు ఇలా...ఎల్‌ఎల్‌బీ గ్రాడ్యుయేట్..సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిని 2015, మేలో వివా హం చేసుకున్నారు. వైద్య సమస్యల కారణంగా 2017లో ఆమెకు గర్భస్రావమైంది. ఆ తర్వాత గృహ కలహాలతో 2018, అక్టోబర్ నుంచి ఇద్దరూ విడివిడిగా నివసిస్తున్నారు.
ఈ క్రమంలో విడాకులు కోరుతూ భర్త మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కోర్టులో దావా వేశారు. జిల్లా కోర్టు విడాకులకు నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ భర్త హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ మౌషుమి భట్టాచార్య, జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మా సనం విచారణ చేపట్టింది. జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన భార్య తనకు వంట చేయడంలో విఫలమైందని, తన తల్లికి రోజువారీ పనుల్లో సహకరించడం లేదన్న అతని ఆరోపణను తప్పుబట్టింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని కావడంతో విభిన్న పనివేళల దృష్ట్యా ఆమె వంట చేయకపోవడాన్ని తీవ్రంగా పరిగణించలేమని, దానిని క్రూరత్వంగా పేర్కొనలేమని అభిప్రాయపడింది. చిన్న చిన్న సమస్యలతో విడాకుల వరకు వెళ్లవద్దని సూచిస్తూ.. అప్పీల్‌ను కొట్టివేసింది.


