సాక్షి, వైఎస్సార్ జిల్లా: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌పై కడప డీఆర్సీ సమావేశంలో వైఎస్సార్‌సీపీ గళమెత్తింది. ఇంచార్జ్ మంత్రి సబితా అధ్యక్షతన జరిగిన డీఆర్సీ సమావేశంలో ఇరిగేషన్‌పై ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. ఆ అంశంపై చర్చను కూటమి నేతలు పక్కదోవ పట్టించారు. అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ.. డీఆర్సీ సమావేశంలో అంతా ఆత్మ స్తుతి తప్ప ప్రజలకు ఉపయోగపడేది ఏమీ లేదని మండిపడ్డారు.
‘‘రాయలసీమ ఎత్తిపోతలపై చర్చిస్తే పక్కదోవ పట్టిస్తున్నారు. రేవంత్‌రెడ్డి, చంద్రబాబు ఇద్దరూ కలిసే రాయలసీమ గొంతు కోశారు. ఓ వైపు ఎటువంటి అనుమతులు లేకుండా తెలంగాణ సాగు, విద్యుత్ ఉత్పత్తికి ప్రాజెక్టులు కట్టుకుంటూ పోతోంది. వైఎస్ జగన్ రాయలసీమ ఎత్తిపోతల చేపట్టారు. ఈ ప్రాజెక్టుకు రూ. 950 కోట్లు ఖర్చు చేశారు. వరద సమయంలో రోజుకు 3 టీఎంసీల నీటిని ఈ ప్రాజెక్ట్ ద్వారా తీసుకోవచ్చు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాకే ఈ ప్రాజెక్ట్ పర్యావరణ అనుమతులు రిజెక్ట్ చేశారు
..పొత్తులో ఉన్న బాబు ఆ అనుమతులు తీసుకురావడానికి కనీసం ప్రయత్నం చేయలేదు. పైగా దాన్ని రేవంత్, చంద్రబాబు కలిసి కుట్ర చేసి పక్కన పెట్టారు. సీమకు హక్కుగా రావాల్సిన 111 టీఎంసీల నీరు రావడం లేదు. అయినా చంద్రబాబు పట్టించుకోవడం లేదు. పైగా ఈ ప్రాజెక్ట్ నిరర్థకమని ఇరిగేషన్ మంత్రి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. 800 అడుగుల్లో మనమూ నీళ్ళు తీసుకునే అవకాశం ఈ ఒక్క ప్రాజెక్ట్ వల్లే వస్తుంది. చంద్రబాబు వెంటనే పర్యావరణ అనుమతులు తీసుకురావాలి. రాయలసీమ ఎత్తిపోతల పనులు ముందుకు కొనసాగించాలి. ఈ ప్రాజెక్ట్ చేపట్టే వరకూ వైఎస్సార్సీపీ పోరాటం చేస్తూనే ఉంటుంది. రాయలసీమ రైతులపై ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే ప్రాజెక్ట్ పనులు ముందుకు సాగించాలి’’ అని అవినాష్‌రెడ్డి డిమాండ్ చేశారు.


