సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపులు తీసుకుంటోంది. ఈ కేసు దర్యాప్తులో సిట్ దూకుడు పెంచింది. తాజాగా ఇద్దరు బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేలతో పాటు సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డికి సైతం నోటీసులు జారీ చేసింది. రేపు(గురువారం) తమ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.
బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్యలకు నోటీసులు జారీ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో మాజీ అధికారులను దఫదఫాలుగా ప్రశ్నించిన సిట్.. రాజకీయ నేతలను సైతం సిట్ విచారించడం మొదలుపెట్టింది. మొన్నీమధ్యే ఎమ్మెల్సీ నవీన్ రావును సుదీర్ఘంగా ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో ఇద్దరు బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేలను ప్రశ్నించబోతుండడం విశేషం. అయితే..
కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను అధికారులు గతంలోనే విచారించారు. ఈ కేసులో మరో నిందితుడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబీ) మాజీ అదనపు ఎస్పీ మేకల తిరుపతన్న ఫోన్‌లో లింకు దొరికిన నేపథ్యంలో.. ఆ ఆధారాలను ముందుపెట్టి ఈ మాజీ ఎమ్మెల్యేలను ప్రశ్నించారు.

అయితే.. తాజాగా ఈ కేసులో సిట్‌ను తెలంగాణ ప్రభుత్వం మార్చింది. హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో 9 మంది అధికారుల బృందానికి ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును అప్పగించింది. అప్పటి నుంచి పొలిటికల్ లీడర్లను ప్రశ్నించడం మొదలైంది.
ఇక సీఎం రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డికి సైతం సిట్ నుంచి పిలుపు వచ్చింది. ప్రతిపక్ష నేతగా ఉన్న టైంలో రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాపింగ్‌కు గురైనట్లు సిట్ గుర్తించింది. ఈ క్రమంలోనే ఆయనను సైతం తమ ఎదుట హాజరు అయ్యి తాము అడిగే ప్రశ్నకు సమాధానాలు ఇవ్వాలని సిట్ కోరినట్లు సమాచారం.
మరోవైపు ఈ కేసులో మాజీ మంత్రి హరీష్‌రావును విచారించాలన్న సిట్ ప్రయత్నం ఫలించలేదు. ఆయనపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను గతంలో తెలంగాణ హైకోర్టు కొట్టేయగా, తాజాగా ఆ తీర్పును ఇటు సుప్రీం కోర్టు సమర్థించడంతో ఊరట లభించినట్లైంది. ఇక.. ఈ కేసులో ప్రధాన నిందితుడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ప్రభాకర్‌రావును సిట్ రెండు దఫాలుగా కస్టోడియల్ ఎంక్వైరీ జరిపింది. ఆ విచారణకు సంబంధించిన నివేదికను ఈ నెలాఖరులోపే దర్యాప్తు బృందం కోర్టుకు సమర్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు విచారణ రాజకీయ మలుపు తీసుకోవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.


