పిట్ట కుంచెం కుత ఘనం అన్నట్లుగా ఈ చిన్నారి చిన్న వయసుకే అత్యంత అరుదైన ఘనత సృష్టించాడు. నిండా పట్టుమని పదేళ్లు కుడా లేవు. ఏకంగా ఏడు ఖండాలు చుట్టేశాడు అమెరికన్ బుడ్డోడు వైల్డర్ మెక్‌గ్రా. జస్ట్ ఏడేళ్లకే అంటార్కిటికాతో సహా ఏడు ఖండాలు చుట్టొచ్చి.. అరుదైన ఘనతను సాధించాడు. అంటే ఈ చిన్నారి ప్రయాణం శిశువుగా ఉన్నప్పుడే ప్రారంభమైందని తెలుస్తోంది.
అతడి సాహసయాత్రలను తల్లిదండ్రులు జోర్డి లిప్పే మెక్‌గ్రా, రాస్ మెక్‌గ్రాలు నమోదు చేశారు. ఏడు ఖండాలను చుట్టొచ్చే చిన్నారిగా తమ కుమారుడిని పెంచలేదని చెబుతున్నారు అతడి తల్లిందండ్రులు. తమకు పర్యాటనలంటే మహాఇష్టమని, ఆ నేపథ్యంలోనే తాము నచ్చిన ప్రదేశాలకు పర్యటిస్తున్నామని ఆ కుటుంబం చెబుతోంది. ఇక తమ కుమారుడు వైల్డర్ జర్నీ ఎనిమిది వారాల వయసులో పోర్చుగల్ పర్యటనతో ప్రారంభమైందని, తర్వాత అతడి రెండో పుట్టినరోజు ముందు కరేబియన్, కెనడా, మెక్కికోలను సదర్శించినట్లు వెల్లడించాడు తండ్రి రాస్.
అతను పెద్దయ్యాక యూరప్, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా వరకు వెళ్లడం జరిగిందని అన్నాడు. అయితే తాము దక్షిణ అమెరికా పర్యటనకు ముందు తమ బిడ్డ ఐదు ఖండాలు సందర్శించాడని గుర్తించాం అని చెప్పుకొచ్చాడు తండ్రి రాస్. దాంతో అప్పుడే తమకు వైల్డర్ ఈ ఖండాల జాబితాను పూర్తి చేస్తే ఎలా ఉంటుది అనే ఊహ వచ్చిందని, అందుకు అనుగుణంగా ట్రిప్‌లు ప్లాన్ చేశామని చెప్పుకొచ్చారు పేరెంట్స్.
అలా ఈ కుటుంబం సాహసయాత్ర కాస్తా అంటార్కిటిక్ ఖండానికి చేరుకుంది. ఆ విధంగా తమ బిడ్డ వైల్డర్ ఈ ఖండంలో అడుగుపెట్టిన అతిపిన్న వయస్కులలో ఒకడిగా నిలిచాడని ఆనందంగా చెబుతున్నారు. అంతేగాదు ఈ అంటార్కిటక్ పర్యటనలో తన భార్య జోర్డికి అత్యంత ప్రత్యేకం అంటున్నాడు వైల్డర్ తండ్రి రాస్. ఎందుకంటే ఆమె ఈ అంటార్కిటికా ఖండంలో గర్భవతిగా(వైల్డర్ కడుపులో ఉండగా) అడుగు పెట్టిందట. అంటే జోర్డీ డెలివరీ అయ్యాక తన బిడ్డతో కలిసి మరోసారి అంటార్కిటికాకు వచ్చారామె.
కాగా, ఆ కుటుంబం ఈ పర్యటనలు కేవలం గమ్యస్థానాలు లేదా రికార్డుల కోసం మాత్రం కాదని, ఆయా విభిన్న సంస్కృతులను అనుభవించడం, మరుపురాని జ్ఞాపకాలను పొందుపర్చుకోవడం అని చెబుతుండటం విశేషం. ఈ టూర్‌ల వల్ల వైల్డర్‌కి సహనంగా ఉండటం అలవడిందని చెబుతున్నారు తల్లిదండ్రులు.
అయితే ఆ ఫ్యామిలీ విజయవంతంగా ఏడు ఖండాలు చుట్టేసినా..ఇక్కడ నుంచి ప్రశాంతమైన ప్రయాణాలపై దృష్టి సారించనున్నాం అని చెబుతుండటం విశేషం. ఇక ఇప్పుడే వెళ్లే టూర్‌లన్ని తమ బిడ్డకు తమకు నచ్చిన వాటిని ఎంపిక చేసుకుని వెళ్లేలా జర్నీ ప్లాన్ చేయనున్నాం అని నవ్వుతూ చెబుతున్నారు వైల్డర్ తల్లిదండ్రులు.
(చదవండి: భార్య కేన్సర్ చికిత్సకు నిధులుగా..50 టన్నుల చిలగడ దుంపలు!)


