నేను లింగమార్పిడి ద్వారా స్త్రీగా మారాను. దానికి అంగీకరించని మా కుటుంబం నన్ను వదిలేసింది. మాకు పూర్వికుల ఆస్తి ఉంది. ఇటీవలే మా అమ్మానాన్నా ఇద్దరూ చనిపోయారు. ఇప్పుడు మా అన్నయ్య ‘‘నువ్వు మగాడిగా పుట్టి ఆడదానిగా మారిపోయావు అంటే నువ్వు చచ్చిపోయినట్టే. మా నాన్నకి పుట్టింది కొడుకు. కూతురు కాదు.’’ అంటున్నాడు. అది నిజమేనా?
– మాళవిక, సూర్యాపేట
మీ పరిస్థితి బాధాకరం. చట్టాలలో ఎన్ని మార్పులు వచ్చినప్పటికీ సమాజంలో ఇంకా మార్పు రాలేదు. బహుశా ఆ మార్పు రావడానికి ఇంకాస్త సమయం పట్టేలా కనిపిస్తుంది. లింగమార్పిడి చేసుకున్న స్త్రీలైనా పురుషులైనా ముందుగా వారు మనుషులు! మనిషిని మనిషిగా చూడడం కనీస మానవత్వం. అదే చట్టం – రాజ్యాంగం కూడా. అందుకనే సుప్రీంకోర్టు సైతం స్వలింగ సంపర్కులకు, లింగ మార్పిడి చేయించుకున్న వారికి, ఔఎఆఖీఖగా గుర్తింపబడే ఇతర లైంగిక వర్గాలను వివక్షించే వీలు లేదు అంటూ అనేక తీర్పులు ఇచ్చింది.
ట్రాన్స్ జెండర్ల రక్షణ చట్టం, 2019లో సైతం లింగమార్పిడి చేయించుకున్న వారిపై వివక్షను రద్దు చేయడమే కాకుండా వివక్ష చూపిన వారిపై శిక్షలు కూడా విధించింది. ఉత్తరప్రదేశ్ లాంటి కొన్ని రాష్ట్రాలు లింగమార్పిడి చేయించుకున్నవారికి పూర్వీకుల వ్యవసాయ భూమిలో హక్కు ఉంటుంది అని చట్టాలు చేశాయి. అయితే మిగతా రాష్ట్రాలలో లింగమార్పిడి చేయించుకున్న వారికి వారసత్వం ద్వారా ఆస్తి ΄÷ందే విషయంలో చట్టంలో కొంత స్తబ్దత ఉన్న మాట నిజమే అయినప్పటికీ, మీ కేసులో మీ అన్నగారు మీకు ఆస్తి ఇవ్వను అనడం కుదరదు. లింగమార్పిడి చేయించుకున్నంత మాత్రాన మీరు మనుగడలో లేకుండా పోయినట్లు కాదు. అందువల్ల మీరు మీపై వివక్ష చూపుతున్న మీ అన్నయ్యపై నిరభ్యంతరంగా ΄ార్టిషన్ సూటు వేయచ్చు.
హిందూ వారసత్వ చట్టంలో కూడా బైనరీ జెండర్ ఆధారంగానే అంటే వారసులుగా కేవలం ఆడ/మగ లను మాత్రమే గుర్తిస్తుంది. అయితే అదే చట్టంలోని సెక్షన్ 28 ప్రకారం, ఏదైనా వ్యాధి ఉందని గానీ, లోపం ఉంది అనిగానీ, మరే ‘‘ఇతర కారణాలు’’ చూపి అయినా గాని వివక్ష చూపడానికి వీలు లేదు – ఆస్తి ఇవ్వను అనడానికి వీల్లేదు. మీ అన్నగారు మీకు లోపం ఉంది అనే వాదన చేస్తే చేసుకోనివ్వండి. మీరేం ఆందోళన పడనక్కరలేదు. చట్టం మీ ఆస్తి మీకు వచ్చేలా చేస్తుంది.



