ఐబొమ్మ రవికి మరో షాక్‌ | Ibomma Ravi Bail Petition Dismissed | Sakshi
Sakshi News home page

ఐబొమ్మ రవికి మరో షాక్‌

Jan 7 2026 12:03 PM | Updated on Jan 7 2026 1:42 PM

Ibomma Ravi Bail Petition Dismissed

సాక్షి, హైదరాబాద్‌: పైరసీ వెబ్‌సైట్‌ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి బెయిల్‌ పిటిషన్లను నాంపల్లి హైకోర్టు కొట్టివేసింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఐదు కేసుల్లో బెయిల్ ఇవ్వాలని రవి కోర్టును ఆశ్రయించాడు. అయితే, కేసు దర్యాప్తు దశలో ఉందని కోర్టు దృష్టికి పోలీసులు తీసుకెళ్లారు. అతడికి విదేశాల్లో పౌరసత్వం ఉందని.. బెయిల్ ఇస్తే దేశం దాటి పోయే అవకాశం ఉందని తెలిపారు. విచారణ జరిపిన న్యాయస్థానం రవి బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది.

కాగా, ఇమంది రవి విచారణలో పలు కీలక విషయాలు బయటపడుతున్న సంగతి తెలిసిందే. ప్రహ్లాద్‌తో పాటు మరో ఇద్దరి పేర్లు, వివరాలతో రవి నకిలీ గుర్తింపు కార్డులు పొందినట్లు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నిర్థారించారు. వెల్లెల ప్రహ్లాద్‌ కుమార్‌తో పాటు అంజయ్య, కాళీప్రసాద్‌ పేర్లు, వివరాలు వాడి తన ఫొటోతో వీటిని పొందాడు. వీటిని ఉపయోగించి తన ఫొటోతో కొన్ని గుర్తింపు కార్డులతో దరఖాస్తు చేసి తీసుకోగా.. మరికొన్ని తయారు చేశారు.

గతంలో రవి అమీర్‌పేట్‌లోని హాస్టల్లో ఉన్నప్పుడు ప్రహ్లాద్‌తో పరిచయమైంది. కడప జిల్లాకు చెందిన ప్రహ్లాద్‌ 2017లో అమీర్‌పేటలోని హాస్టల్‌ రూమ్‌లో రవితో కలిసి ఉన్నాడు. ఆ సమయంలో ప్రహ్లాద్‌కు సంబంధించిన పదో తరగతి మార్కుల లిస్టు, ఆధార్‌ కార్డు కలర్‌ జిరాక్సులు తీసుకున్నాడు. ఆపై వాటిని వాడి ప్రహ్లాద్‌ పేరుతోనే డ్రైవింగ్‌ లైసెన్స్, పాన్‌కార్డు తీసుకుని వీటి ఆధారంగా బ్యాంక్‌ అకౌంట్‌ తెరిచాడు. కరీంనగర్‌కు చెందిన అంజయ్య పేరుతోనూ రవి నకిలీ గుర్తింపుకార్డులు తయారు చేశాడు.

ఇతడితో పాటు తన పదో తరగతి క్లాస్‌మేట్‌ అయిన కాళీప్రసాద్‌ పేరుతో రూపొందించాడు. ఈ ముగ్గురి పేర్లు, వివరాలు వాడే వెబ్‌సైట్ల నిర్వహణకు అవసరమైన డొమైన్లు ఖరీదు చేశాడు. హాస్పిటల్‌.ఇన్, సప్లయర్స్‌.ఇన్‌ తదితర వెబ్‌సైట్లను ఇలానే ఏర్పాటు చేశారు. ఈ రెండూ విజయం సాధించకపోవడంతోనే రవి ‘ఐబొమ్మ’ను ఏర్పాటు చేశాడు. ఇతడి బ్యాంకు ఖాతాల ద్వారా జరిగిన లావాదేవీల్లో ఇప్పటికి రూ.13 కోట్లు గుర్తించారు. వీటిలో రూ.3 కోట్లు పోలీసులు ఫ్రీజ్‌ చేయగా.. మిగతా రూ.10 కోట్లు విదేశాల్లో జల్సాలు, ఆస్తుల ఖరీదుకు రవి ఖర్చు చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement