కుల్కచర్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఘటన
వికారాబాదు జిల్లా: భూ సమస్య పరిష్కారంలో తమకు అన్యాయం చేయొద్దంటూ ఓ రైతు తహసీల్దార్ కార్యాలయం వద్ద అర్ధనగ్నంగా నిరసన చేపట్టాడు. వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన రైతు హన్మయ్య 2007లో మృతిచెందాడు. ఇతనికి ముగ్గురు భార్యలు ఉండగా, వీరిలో ఈశ్వరమ్మ చనిపోయింది. హన్మయ్యకు 6.32 ఎకరాల భూమి ఉంది.
దీన్ని తమ పేరిట విరాసత్ చేయాలంటూ మిగిలిన ఇద్దరు భార్యలు హన్మమ్మ, భీమమ్మ గత ఐదేళ్లుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. రెండేళ్ల క్రితం హన్మమ్మ కుటుంబీకులు విరాసత్‌కు దరఖాస్తు చేసుకోగా వారసత్వ ధ్రువీకరణ పత్రం తీసుకురావాలని సూచించి, తిరస్కరించారు. అయితే, రెండు నెలల క్రితం భీమమ్మ కూతురు యాదమ్మ భూమి కోసం విరాసత్ చేసుకోగా, ఈ విషయమై అధికారులు విచారణ చేస్తున్నారు.
దీంతో తమ దరఖాస్తును తిరస్కరించి, వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ హన్మమ్మ కుమారుడు సత్యం తదితరులు మంగళవారం తహసీల్ ఆఫీసు ఎదుట అర్ధనగ్న నిరసన చేపట్టారు. ఈ విషయమై తహసీల్దార్ వెంకటేశ్వర్లును వివరణ కోరగా బాధిత కుటుంబీకులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, విచారణ కొనసాగుతోందని తెలిపారు.


