సాక్షి, ఖమ్మం: ఎగవేతలు, కూల్చివేతలతో కాంగ్రెస్ పాలన కొనసాగుతోందని.. అందుకే ఆ పార్టీని తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ఖమ్మంలో బుధవారం నిర్వహించిన నూతన సర్పంచ్‌ల అభినందన సభలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ సర్కార్‌పై ధ్వజమెత్తారు.
క్వార్టర్ ఫైనల్‌లో(సర్పంచ్ ఎన్నికలను ఉద్దేశించి..) మంచి ఫలితాలు వచ్చాయి. సెమీ ఫైనల్ లో మంచి ఫలితాలు వస్తాయి. చివరికి ఫైనల్ లో విజయం మనదే. వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే. యూరియా బస్తాలు దొరకడం లేదని రైతన్నలు చెబుతున్నారు. పాలిచ్చే గేదెను వదులుకొని.. తన్నే దున్నపోతు ను గెలిపించారని నేను వారితో చెప్పా. అయిపోయింది ఏదో అయిపోయింది.. వచ్చేది బీఆర్‌ఎస్ అని రైతులు నాతో చెప్పారు. రైతులు ఎంత క్లారిటీగా ఉన్నారో అర్థమైంది.
బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో యూరియా కష్టాల్లేవ్. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే లైన్‌లలో చెప్పులు కనిపిస్తున్నాయి. షాపుల్లో లేని యూరియా యాప్‌ల్లో ఎలా వస్తుంది?.. కాంగ్రెస్ పాలనలో ఎగవేతలు, కూల్చివేతలు. లక్ష కోట్ల బడ్జెట్ అన్నారు.. ఏమైంది?. కౌలు రైతులకు ఇస్తామన్న డబ్బులు ఇచ్చారా?. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇచ్చారా?. రెండేళ్లలో ఏం అభివృద్ధి జరిగింది?.. కూల్చివేతలు, ఎగవేతలే కనిపిస్తున్నాయి. ఇది సర్వభ్రష్ట ప్రభుత్వం..
ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయాలని కేసీఆర్ పని చేశారు. ఇప్పుడు ఇదే జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నారు. కనీసం రైతులకు యూరియా ఇప్పించలేని పరిస్థితిలో ఉన్నారు. కమీషన్ల కోసమే ఆ మగ్గురు పని చేసేది. 30 శాతం ట్యాక్స్ నడిపిస్తున్నారు వాళ్లు. ఆరు గ్యారెంటీలు భద్రంగా పెట్టుకొండనీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆనాడు ఎన్నికల ప్రచారం లో చెప్పారు. ఇప్పుడు రెండేళ్లు అయిన గ్యారెంటీలు అమలు కాలేదు. దీనికి భట్టి ఏమి సమాధానం చెబుతారు?..
ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ఓటమికి రంగం సిద్ధమైంది. సర్పంచ్ ఎన్నికల్లో 40 శాతం పదవులు గెలుచుకున్నాం. ఇక్కడే రెండేళ్లలోనే ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత వచ్చిందో తెలుస్తోంది. త్వరలో జగరబోయే కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి తప్పదు. ఖమ్మం నుంచి 7 నుంచి 8 స్థానాలు గెలుస్తాం అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.


