ఖమ్మంఅర్బన్: తిరుమలాయపాలెం మండలం కాకరవాయికి చెందిన కొత్తపల్లి లచ్చమ్మ(85) మతిస్థిమితం కోల్పోయి ఇంటి నుంచి తప్పిపోగా పోలీసులు, అన్నం ఫౌండేషన్ సభ్యులు తిరిగి ఆమెను కుటుంబానికి అప్పగించారు. కొద్దిరోజుల క్రితం లచ్చమ్మ ఇంటి నుంచి వెళ్లిపోగా ఆమె కుమారులు పలుచోట్ల గాలించి ఫలితం లేక ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈక్రమాన గురువారం రాత్రి చైన్నె షాప్ షాపింగ్ మాల్ సమీపాన అచేతనావస్థలో ఉన్న ఆమెను గుర్తించి వన్ టౌన్ ఎస్‌ఐ అనిల్ అన్నం ఫౌండేషన్‌కు అప్పగించారు. ఆపై సభ్యులు వివరాలు సేకరించగా కాకరవాయికి చెందిన లచ్చమ్మగా తేలడంతో ఆమె కుమారులకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


