మణుగూరు టౌన్: మణుగూరులోని అన్నారం గ్రామంలో దానధర్మట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం 200 ఆదివాసీ జంటలకు సామూహిక వివాహాలు నిర్వహించారు. ట్రస్ట్ నిర్వాహకురాలు గంటా రాధ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతోపాటు ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన 200 ఆదివాసీ జంటలు పాల్గొన్నాయి. మైసూరు అవధూత దత్తపీఠం బాధ్యుల సమక్షంలో వేడుకలు జరిపారు. మేళతాళాలు, వేద మంత్రోచ్ఛరణతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. మంగళసూత్రం, మెట్టెలు, పట్టు వస్త్రాలు, పీటలు తదితర పెళ్లి సామగ్రిని ట్రస్ట్ ఆధ్వర్యంలో అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ట్రస్ట్ చైర్ పర్సన్ గంటా రాధ మాట్లాడుతూ 2021 నుంచి పలు దఫాలుగా అన్నారం గ్రామంలో 720 జంటలకు సామూహిక వివాహాలు నిర్వహించినట్లు తెలిపారు. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమానికి రూ.1.20 కోట్ల మేర వెచ్చించామని తెలిపారు. కాగా, 200 జంటలు, వారి బంధువులతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
దానధర్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో
200 ఆదివాసీ జంటలకు పెళ్లిళ్లు


