అంతా మా ఇష్టం.. | - | Sakshi
Sakshi News home page

అంతా మా ఇష్టం..

Mar 7 2026 8:20 AM | Updated on Mar 7 2026 8:20 AM

● పట్టపగలే ఇసుక అక్రమ లోడింగ్‌ ● చెక్‌పోస్ట్‌ ఏర్పాటుచేసినా ఆగని దందా

● పట్టపగలే ఇసుక అక్రమ లోడింగ్‌ ● చెక్‌పోస్ట్‌ ఏర్పాటుచేసినా ఆగని దందా

గంధసిరి మున్నేటిలో మధ్యాహ్నమే ఇసుక ట్రాక్టర్లు

ముదిగొండ: మండలంలోని గంధసిరి, పెద్దమండవ మున్నేటి నుంచి ఇసుక అక్రమ రవాణా ఆగడం లేదు. ఆయా గ్రామాల్లో దాదాపు 300 వరకు ట్రాక్టర్లు ఉన్నాయని తెలుస్తుండగా, నిత్యం వందకు పైగా ట్రాక్టర్లు ఇసుక తరలింపునకే వినియోగిస్తున్నట్లు అంచనా. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కూపన్ల పేరిట ఇసుక తరలిస్తున్నట్లు చెబుతూ లెక్కకు మిక్కిలిగా ఇసుక తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. పట్టపగలే మున్నేటి వద్ద ట్రాక్టర్లలో ఇసుక నింపి అర్ధరాత్రి సమయాన అనుకున్న చోటకు చేరుస్తున్నారు. రాత్రి సమయాన ట్రాక్టర్ల శబ్దానికి నిద్రకు దూరమవుతున్నామని స్థానికులు వాపోతున్నారు. కాగా, అనువైన దారులను ఎంచుకుని ఇసుకను చింతకాని, ముదిగొండ, నేలకొండపల్లి, ఖమ్మం రూరల్‌, ఖమ్మంకు తెల్లవారుకల్లా చేరుస్తున్నారని సమాచారం.

అనుసరిస్తూ.. సమాచారం ఇస్తూ..

ఇసుక దందా అరికట్టాలన్న లక్ష్యంతో ఇటీవల పోలీసు శాఖ ఆధ్వర్యాన మల్లారం–పెద్దమండవ, ఏపీలోని సరిహద్దు వద్ద ఇటీవల చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. వరస దాడులతో హడావుడి చేసి పదుల సంఖ్యలో ఇసుక ట్రాక్టర్లను సీజ్‌ చేసి యజమానులు, డ్రైవర్లపై కేసులు కూడా నమోదు చేశారు. అయినప్పటికీ దందా ఆగకపోవడం గమనార్హం. పోలీసు పెట్రోలింగ్‌ వాహనం ఎప్పుడు వచ్చేది, ఏ అధికారి ఎటు వెళ్తున్నాడనేది గుర్తించేందుకు కొందరు అక్రమార్కులు వారి వాహనాలను అనుసరిస్తూ.. ట్రాక్టర్ల యజమానులకు సమాచారం ఇస్తున్నట్లు తెలిసింది. దీంతో అధికారులు మరో మార్గంలో వెళ్తున్నట్లు తెలియగానే.. ఇంకో పక్క ఇసుక తరలిస్తున్నట్ల సమాచారం. మైనింగ్‌ అధికారుల జాడే లేకపోవడంతో అక్రమార్కులకు కలిసొస్తుందని చెబుతున్నారు. వేసవి సమీపిస్తున్న వేళ ఇసుక తోడుస్తుండడంతో మున్నేటిలో నీరు అడుగంటే ప్రమాదం ఉన్నందున అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement