జగన్ ప్రభుత్వంలో ఈ కష్టాల్లేవ్: రైతులు
సాక్షి, కృష్ణా: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో రైతులకు ఎరువుల కొరత(Urea Crisis) అనే మాటే వినిపించలేదు. కానీ ఇప్పుడు అదే వ్యవస్థ.. అదే అధికారులు ఉన్నా.. యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. బ్లాక్ మార్కెట్ దందాతో నిస్సహాయంగా మిగిలిపోయారు. దీంతో రైతులు చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఉయ్యూరు మండలం ముదునూరులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(PACS) వద్ద పడిగాపులు పడుతున్న రైతులు కొందరిని సాక్షి పలకరించింది. ఈ సందర్భంగా చంద్రబాబు సర్కార్‌పై వాళ్లు దుమ్మెత్తిపోశారు. ‘‘అర్ధరాత్రి నుంచి సొసైటీ గేట్ ఎదురు పడిగాపులు కాస్తున్నాం. మొదటి కోట యూరియా ఇంకా వెయ్యలేదు. రైతు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయం చేయటం దుర్భరంగా మారింది.బ్లాక్‌లో యూరియా రూ.800 పైగా అమ్ముతున్నారు. 10 ఎకరాలకు 2 కట్టలు ఇస్తున్నారు. యూరియా కోసం ఇంతకు ముందెప్పుడూ రోడ్లపైకి ఎప్పుడు రాలేదు. జగన్ ప్రభుత్వంలోనూ ఈ పరిస్థితి లేదు. సకాలంలో ఎరువులు, పంట సాయం అందేవి. ఇప్పుడు యూరియా వాడితే చంద్రబాబు క్యాన్సర్ వచ్చింది అంటున్నాడు. చంద్రబాబుకు రైతులు అంటే అంత చులకన?. ఇకనైనా ప్రభుత్వం రైతును ఆదుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు పడుతున్న అవస్థలపై తాజాగా ప్రెస్మీట్లో కూటమి సర్కార్‌కు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Press Meet On Urea Troubles) చురకలంటించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడూ యూరియా కొరత రాలేదు. అధికారులు కూడా రైతుల పక్షాన ఉండేవారు. ఇప్పుడు మాత్రం యూరియాను బ్లాక్ మార్కెట్‌కు మళ్లించి, రూ. 250 కోట్ల స్కాం చేశారు. రైతులు బారులు తీరుతున్నారు, కానీ అధికార పార్టీ క్యాడర్‌కు మాత్రం యూరియా బస్తాలు సిద్ధంగా ఉన్నాయి. MSP (మద్దతు ధర) కూడా ఇవ్వకుండా, రైతులను ఆత్మహత్యల దిశగా నెట్టుతున్నారు. మేము తిరిగి అధికారంలోకి వస్తే, ఈ దందా అంతా బయటపెడతాం. రైతులకు న్యాయం చేస్తాం అని అన్నారాయన. గత వైఎస్సార్సీపీ హయాంలో ఆర్బీకే(రైతు భరోసా కేంద్రాల) ద్వారా 12 లక్షల టన్నుల ఎరువులు సరఫరా చేసినట్లు గుర్తు చేశారు. ఈ క్రమంలో అదే అధికారులు ఉండి, అదే వ్యవస్థ ఉండి.. అప్పుడు లేని యూరియా కొరత ఇప్పుడే ఎందుకు వచ్చింది? అని చంద్రబాబును నిలదీశారాయన. ఇదీ చదవండి: ఎరువులు అందిస్తే ఏ రైతూ రోడ్డెక్కడు: వైఎస్ జగన్