ఊరు చేరని యూరియా! మళ్లీ ‘కట్ట’ కట.. | Chandrababu Govt neglect: Farmers Bad Times Continue Also In Rabi Season | Sakshi
Sakshi News home page

ఊరు చేరని యూరియా! మళ్లీ ‘కట్ట’ కట..

Dec 25 2025 4:31 AM | Updated on Dec 25 2025 4:31 AM

Chandrababu Govt neglect: Farmers Bad Times Continue Also In Rabi Season

శ్రీకాకుళం జిల్లా బూర్జ గ్రామంలో యూరియా కోసం ఇటీవల బారులు తీరిన రైతులు

చంద్రబాబు సర్కారు అలసత్వంతో రబీలోనూ రైతన్నకు తప్పని తిప్పలు

కొనసాగుతున్న ఖరీఫ్‌ కష్టాలు.. దారి మళ్లిస్తున్న అధికార పార్టీ నేతలు

మార్కెట్‌లో కట్ట ధర రూ.350–రూ.500 

పురుగు మందులు, కాంప్లెక్స్‌ ఎరువులను బలవంతంగా అంటగడుతున్న డీలర్లు

ఏ పంటకూ గిట్టుబాటు ధరలు దక్కక.. అదునుకు యూరియా అందక అన్నదాతల అగచాట్లు

పల్నాడు జిల్లా జమ్మలమడక గ్రామంలో టీడీపీ నాయకులు సోమవారం అక్రమంగా యూరియా తరలించేందుకు యత్నిస్తుండగా అన్నదాతలు అడ్డుకుని ఆందోళనకు దిగారు.  

నంద్యాల జిల్లా మిడుతూరు మండలం చింతపల్లి గ్రామానికి మూడు రోజుల క్రితం 240 యూరియా బస్తాలొచ్చాయి. ఒక్కొక్కరికి రెండు బస్తాల చొప్పున 50 మంది రైతులకు వంద బస్తాలు పంపిణీ చేయగా.. మిగిలిన 140 బస్తాలను స్థానిక టీడీపీ నేతలు దారి మళ్లించారు.

సాక్షి, అమరావతి: ఖరీఫ్‌లో కట్ట యూరియా కూడా దొరకక అన్నదాతలు పడరాని పాట్లు పడ్డారు. పొలం పనులు వదిలేసి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ పరుగులు తీశారు. ఒకపక్క సీజన్‌లో పెట్టుబడి సాయం అందక.. ఉచిత పంటల బీమాకు దూరమై.. ఇన్‌పుట్‌ సబ్సిడీ ఎగిరిపోయి.. దిగుబడులు దిగజారి.. ఏ పంటకూ గిట్టుబాటు ధరలు దక్కక.. మరోపక్క కనీసం ఎరువులు కూడా సమకూర్చలేని చంద్రబాబు సర్కారు అసమర్థతతో నిలువు దోపిడీకి గురయ్యారు. ఇంత జరిగినా ఈ ప్రభుత్వంలో కనీసం చలనం లేకపోవడం.. కనీసం ఈ సీజన్‌లో అయినా తగిన ప్రణాళికతో యూరియా పంపిణీ చేయాలన్న ఆలోచన లేకుండా పోవడం రైతన్నలను కలవరపరుస్తోంది. ప్రస్తుతం రబీలో కూడా యూరియా కష్టాలు అన్నదాతను వెంటాడుతూనే ఉన్నాయి. 

చంద్రబాబు సర్కారు నిర్వాకంతో కట్ట యూరియా బ్లాకులో రూ.350 నుంచి రూ.500 పెట్టి కొనాల్సిన అగత్యం దాపురించిందని రైతులు వాపోతున్నారు. పైగా యూరియా ఇవ్వాలంటే.. నానో యూరియా, కాంప్లెక్స్‌ ఎరువులు, పురుగు మందులు బలవంతంగా అంటగడుతున్నారు. సరిహద్దు జిల్లాలకు చెందిన రైతులైతే రవాణా చార్జీలు పెట్టుకుని పొరుగు రాష్ట్రాలకు వెళ్లి యూరియా కొనుక్కోవాల్సి  వస్తోందంటున్నారు. సొసైటీలకు చేరే అరకొర నిల్వలను అధికార టీడీపీ నేతలు  దొడ్డిదారిన పక్కదారి పట్టిస్తున్నా చంద్రబాబు సర్కారు చేష్టలుడిగి చూస్తుండటం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రబీ సీజన్‌లో యూరియా కష్టాలపై ‘సాక్షి’ గ్రౌండ్‌ రిపోర్టు ఇదీ..! 

వరి, జొన్న, మొక్కజొన్నకే ఎక్కువగా..  
రబీ సీజన్‌ ప్రారంభమై దాదాపు మూడు నెలలు గడిచింది. ఈ సీజన్‌లో సాగు విస్తీర్ణం 51.75 లక్షల ఎకరాలు కాగా ఇప్పటి వరకు 25.19 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. డిసెంబర్‌ 23 నాటికి వరి 5.60 లక్షల ఎకరాల్లో సాగవగా, శనగ 6.67 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 4 లక్షల ఎకరాలు, మినుము 3.77 లక్షల ఎకరాల్లో సాగైంది. వరి, జొన్న, మొక్కజొన్న పంటలకే యూరియా ఎక్కువగా అవసరం. ఈ సీజన్‌లో వరికి ఎకరాకు 125 కేజీలు, మొక్కజొన్నకు 200 కేజీలు, జొన్నకు 80 కేజీల చొప్పున యూరియా అవసరం. మూడు నాలుగు దఫాల్లో దీన్ని మొక్కలకు అందించాల్సి ఉంటుంది. 

సీజన్‌ ఆరంభం నుంచి యూరియా కొరత రైతులను పట్టి పీడిస్తోంది. రబీ సీజన్‌కు 9.38 లక్షల టన్నుల యూరియా అవసరమని ప్రభుత్వం అంచనా వేసింది. ప్రస్తుతం 5.83 లక్షల టన్నులు అందుబాటులో ఉంచగా, ఇప్పటికే 3.93 లక్షల టన్నుల యూరియా అమ్మకాలు జరిగినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం వరి, జొన్న, మొక్కజొన్న పంటలకు మొదటి విడతగా యూరియా వేయాల్సి ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, నంద్యాల, తిరుపతి, పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో యూరియా కొరత ఎక్కువగా ఉంది. 

ఈ సీజన్‌లోనూ యూరియా కోసం రైతులకు తప్పని పాట్లు 

టోకెన్లతో తిప్పలు
ఖరీఫ్‌లో మాదిరిగా రబీలో కూడా యూరియా దొరకకపోవడం రైతన్నలను కుంగదీస్తోంది. సొసైటీలు, రైతు సేవా కేంద్రాలకు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు ఖాళీ అయిపోతుందో అంతుబట్టని దుస్థితి నెలకొంది. కట్ట యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. స్టాక్‌ వచ్చిందని తెలియగానే పెద్ద ఎత్తున రైతులు సొసైటీలకు చేరుకోవడంతో సీరియల్‌ నంబర్లతో టోకెన్లు ఇచ్చి పంపించేస్తున్నారు. చెప్పిన సమయానికి వెళ్లినా సరే ఇంకా రాలేదు.. రేపు, మాపు అంటూ తిప్పించుకుంటున్నారు.  

దారి మళ్లిస్తున్న టీడీపీ నేతలు
నంద్యాల జిల్లా పాములపాడులో వారం క్రితం రెండు లారీల యూరియా వచ్చింది. ఒక్కో రైతుకు రెండు బస్తాలిచ్చారు. ఆ తర్వాత ఇప్పటి వరకు యూరియా రాలేదు. దీంతో అదునుకు యూరియా దొరక్క రైతులు బ్లాకులో కొనుగోలు చేస్తున్నారు. ప్రైవేటు డీలర్ల వద్ద బస్తా రూ.350 నుంచి రూ.500 చొప్పున కొంటున్నారు. పురుగు మందులు, కాంప్లెక్స్‌ ఎరువులు, నానో యూరియాను బలవంతంగా అంట­గడుతున్నారని రైతులు వాపోతున్నారు. యూరియాతో సహా ఎరువుల్లో సింహభాగం ఆర్‌ఎస్‌కేలు, పీఏసీఎస్‌లను కాదని ప్రైవేటు వ్యాపారుల వద్దకే చేరుకుంటున్నాయి. బ్లాక్‌ మార్కెట్‌కు తరలిపోతున్నాయి. ఏపీలో యూరియా పెద్దఎత్తున దారి మళ్లుతున్నట్టు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి గతంలో పేర్కొనడం గమనార్హం. ప్రభుత్వ పర్యవేక్షణ కొరవడటం, అధికార పార్టీ నేతల అండదండలతో యూరియా దారి మళ్లుతోంది. సారా, బీర్ల తయారీతో పాటు పెయింట్, వారి్న‹Ù, ప్లైవుడ్, యాడ్‌–బ్లూ ద్రావణం, పశువుల దాణా, కోళ్లు, చేపలు, రొయ్యల మేత తయారీ, కల్తీ పాల తయారీలో యూరియాను విచ్చలవిడిగా వాడుతున్నారు.

పక్కదారి పడుతున్న యూరియాపై దృష్టి సారించాలి 
స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్‌ 
పక్కదారి పడుతున్న యూరియా­పై దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్‌ కోరారు. జేసీలు, వ్యవసా­య, మార్క్‌ఫెడ్‌ అధికారులతో బుధవారం ఆయన మంగళగిరి నుంచి వీడి­యో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అధిక వినియోగం, పంట కాలానికి మొత్తంగా ఒకేసారి కొనుగోలు చేయటం, అవసరానికి మించి ముం­దుగా కొని నిల్వ చేసుకోవడం వంటి విషయాల పట్ల రైతులకు అవగాహన కల్పించాలన్నారు. సేంద్రి­య ఎరువులతో సాగు ద్వారా యూరియా వినియో­గం తగ్గించేలా చూడాలన్నారు. పక్కదారి పడుతున్న యూరియాపై దృష్టి సారించాలన్నారు. వ్యవసాయ­శాఖ డైరెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ మాట్లాడుతూ కొన్ని జిల్లాల్లో యూరి­యా అధిక ధరలకు అమ్మ­టం మొక్కుబడి తనిఖీలు వంటి అంశాలపై వార్తలు వస్తున్నాయన్నారు.  

ఎకరానికి 10 బస్తాలు నష్టపోయా.. 
వరి కోశాక నెల క్రితం మూడు ఎకరాలు జొన్న సాగు చేశా. ప్రస్తుతం 15 బస్తాలు యూరియా అవసరం. అడిగితే రేపు మాపు అంటున్నారు. ఖరీఫ్‌లో సక్రమంగా యూరియా వేయకపోవడంతో ఎకరానికి దాదాపు 10 బస్తాలు దిగుబడి తగ్గిపోయింది. రబీలో కూడా యూరియా అందకపోతే జొన్న దిగుబడి తగ్గుతుంది.  
    – తాడికొండ శ్రీనుబాబు, కుచ్చెళ్ల్లపాడు, వేమూరు మండలం, బాపట్ల జిల్లా

పలుకుబడి ఉన్న వారికే.. 
10 ఎకరాల్లో మొక్కజొన్న వేశా. మండలంలో నాలుగు సొసైటీలు ఉన్నాయి. ఏ సొసైటీకి వెళ్లినా రేపు రావాలంటున్నారు. మాలాంటి వాళ్లు క్యూలైన్‌లో గంటల తరబడి నిల్చున్నా యూరియా దొరకడం లేదు. మార్కెట్‌లో కట్ట రూ.450–500కు అమ్ముతున్నారు. ఖరీఫ్‌లోనూ ఇలాగే ఇబ్బంది పడ్డాం. 
    – తాడిబోయిన శ్రీనివాసరావు, కంఠంరాజు కొండూరు, గుంటూరు జిల్లా

ఏడాది మొత్తం అవస్థలే.. 
యూరియా బస్తా రూ.260.50కు అమ్మాల్సి ఉండగా మార్కెట్‌లో రూ.500 వరకు విక్రయిస్తున్నారు. ఆర్బీకేల్లో ఎలాగూ ఉండడం లేదు. సొసైటీల్లో కూడా లేదంటున్నారు. బ్లాక్‌లో అమ్మేవాళ్లకు మాత్రం ఎక్కడ నుంచి వస్తుందో తెలియడం లేదు. యూరియా కోసం ఏడాదంతా ఇబ్బందులు పడుతూనే ఉన్నాం. 
    – పగడాల నరేష్‌,  కె.ఒడ్డిపల్లి, తిరుపతి జిల్లా 

రైతుకు ఏమిటీ దుస్థితి! 
నేను 4 ఎకరాల్లో మొక్క జొన్న సాగు చేస్తున్నా. 20 బస్తాల యూరియా అవసరం. పట్టాదారు పాస్‌ పుస్తకంపై బస్తాకు మించి ఇవ్వడం లేదు. బ్లాక్‌లో బస్తా రూ.500–600 వరకు అమ్ముతున్నారు. రైతులకు సరిపడినంత యూరియా ఇవ్వలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఇలాంటి ప్రభుత్వం ఉన్నా, లేకున్నా ఒకటే. 
    –బూటు అప్పారావు, బాతువ, జి.సిగడాం మండలం, శ్రీకాకుళం

రెండు బస్తాలిస్తే ఏం చేయాలి? 
నేను 15 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నా. 25 బస్తాల యూరియా అవసరం. రెండు బస్తాలిస్తే ఎలా సరిపోతుంది? బహిరంగ మార్కెట్‌లో కొందామంటే రూ.350 నుంచి రూ.500 వరకు చెబుతున్నారు. తమిళనాడు వెళ్లి కొనుక్కోవాల్సి రావడంతో పెట్టుబడి వ్యయం రూ.10 వేలు దాకా అదనంగా పెరిగింది.
    – రామ్‌రమేష్, ముడిపల్లి, నగరి మండలం. తిరుపతి జిల్లా 

అంతా బ్లాక్‌ మార్కెట్‌కే..
సీజన్‌లో సాగయ్యే పంటలను బట్టి 5.5–6 లక్షల టన్ను­లకు మించి యూరి­యా అవసరం  ఉండదు. 9.38 లక్షల టన్నుల డిమాండ్‌ ఉన్నట్లు చూపిస్తున్నారు. ఇప్పటికే 3.93 లక్షల టన్నుల అమ్మకాలు జరిగినట్లు చెబుతున్నారు. యూరియా పెద్దఎత్తున బ్లాక్‌ మార్కెట్‌కు వెళ్తోంది. పంటల వారీగా డిమాండ్, అమ్మకాల వివరాలను ప్రకటించాలి.     
–ఎంవీఎస్‌ నాగిరెడ్డి, వ్యవసాయ మిషన్‌ మాజీ వైస్‌ చైర్మన్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement