గుంటూరు: పరమ పవిత్రమైన తిరుమల లడ్డు ప్రసాదం జంతువుల కొవ్వుతో తయారు చేశారని ఎటువంటి ఆధారాలు లేకుండా సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పటం దారుణమన్నారు మాజీ మంత్రి మేకతోటి సుచరిత. సీబీఐ తన చార్జ్‌షీట్లో తిరుమల లడ్డూలో ఎటువంటి జంతువుల కొవ్వు లేదని స్పష్టం చేసిందని, అయినా కూటమి నేతలకు ఇంకా సిగ్గు రాలేదని ధ్వజమెత్తారు సుచరిత.
‘మొన్నటి వరకు జంతువుల కొవ్వు తిరుమల లడ్డులో ఉందని విష ప్రచారం చేశారు. సిపిఐ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత బాత్రూములు కడిగే హార్పిక్ ను లడ్డు తయారీలో ఉపయోగించారంటూ మరో విషపు ప్రచారాన్ని మొదలుపెట్టారు. దిగజారుడు రాజకీయం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలి. స్వామి వారి లడ్డు ప్రసాదం పై విష ప్రచారం చేసిన వారికి త్వరలోనే దేవుడు గుణపాఠం చెప్తాడు’ అని హెచ్చరించారు.
ఒక పథకం ప్రకారం విష ప్రచారం..
తిరుమల లడ్డు ప్రసాదం పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఒక పథకం ప్రకారం విష ప్రచారం చేశారని వైఎస్సార్‌సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ విమర్శించారు. ‘ తిరుమల లడ్డులో ఎటువంటి జంతువుల కొవ్వు లేదని నిజాన్ని సిబిఐ బయటపెట్టినా తెలుగుదేశం నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కూటమి నాయకులు తప్పుడు ప్రచారం చేస్తూ.. ప్రతిపక్ష నాయకుల ఇళ్లను దహనం చేస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూటమి ప్రభుత్వాన్ని దహనం చేయడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. కూటమి ప్రభుత్వానికి రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వెంటనే రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.


