సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో యూరియా కొరతతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూరియా పంపిణీలో అక్రమాలను నిలువరించడంతో పాటు రేషన్ పద్ధతిలో ఒక్కో రైతుకు ఎకరాకు మూడు ఎకరాల మేర సక్రమంగా పంపిణీ చేసేందుకు ‘ఫెర్టిలైజర్ యాప్’ను వ్యవసాయ శాఖ తీసుకొచ్చింది. ఈ యాప్‌లో సాంకేతిక సమస్యలు రావడంతో రైతులు మండిపడుతున్నారు. పొలం నాట్ల సమయంలో యూరియాపై ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఖమ్మం జిల్లాలో..
ఖమ్మం జిల్లాలోని కొనిజర్ల మండల కేంద్రంలోని గ్రోమోర్ రైతుసేవ కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. తెల్లవారుజామున మూడు గంటల నుండి క్యూ లైన్‌లోనే రైతులు వేచి చూస్తున్నారు. రాష్ట్ర రహదారి పక్కనే షాపు ఉండడంతో రోడ్డు పక్కనే రైతులు బారులుతీరారు.

వరంగల్ జిల్లా..
మరోవైపు.. వరంగల్ జిల్లాల్లోని నెక్కొండ (మం) అప్పలరావుపేటలో యూరియా బస్తాల కోసం తెల్లవారుజాము నుంచే రైతులు క్యూలైన్‌లో నిలబడ్డారు. చలిలో యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. ఈ సందర్బంగా యూరియా బుకింగ్ కోసం ఫర్టిలైజర్ యాప్ పనిచేయడం లేదని రైతులు తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఐదు జిల్లాల్లో యాప్ ద్వారా పంపిణీ
యూరియా పంపిణీ కోసం ‘ఫెర్టిలైజర్ యాప్’ను వ్యవసాయ శాఖ తీసుకొచ్చింది. దీని ద్వారా తొలుత ఐదు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు కింద రైతులకు యూరియా బస్తాల పంపిణీ చేయాలని నిర్ణయించింది. పైలట్ ప్రాజెక్టు కింద ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, జనగామ, నల్లగొండ, పెద్దపల్లి జిల్లాల్లో 82,059 మంది రైతులు 2,01,789 యూరియా బస్తాలను కొనుగోలు చేశారు. మిగతా జిల్లాల్లో కూడా ఈ విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నప్పటికీ, రైతుల నుంచి డిమాండ్ పెరగడంతో వారి అవసరాలను బట్టి పట్టా పాస్‌పుస్తకం ఆధారంగా రేషన్ పద్ధతిలో సరఫరా చేయాలని నిర్ణయించారు. వరితో పాటు మొక్కజొన్న, ఇతర పంటలకు కూడా పంట విస్తీర్ణానికి అనుగుణంగానే యూరియా సరఫరా చేయనున్నారు.


