ఉగాది ప్రత్యేకం భక్షాలు | Ugadi Special Sweets: Traditional Bobbatlu Made with Jaggery Gain Popularity | Sakshi
Sakshi News home page

ఉగాది ప్రత్యేకం భక్షాలు

Mar 19 2026 11:58 AM | Updated on Mar 19 2026 1:37 PM

Ugadi Special Sweets: Traditional Bobbatlu Made with Jaggery Gain Popularity

జడ్చర్ల టౌన్‌: తెలుగు నూతన సంవత్సరం ఉగాది అనగానే షడ్రుచులతో కూడిన పచ్చడితోపాటు బెల్లం, చక్కెరతో చేసే భక్షాల వంటకం ప్రత్యేకం. ఈ రెండు ఉంటేనే ఉగాది పండుగ చేసుకున్నట్లు లెక్క. తెలంగాణ ప్రాంతంలో భక్షాలు, ఆంధ్ర, మహారాష్ట్ర, యూపీతో పాటు మరికొన్ని రాష్ట్రాలు, ప్రాంతాల్లో బొబ్బట్లు, పోలెలు అని పిలుచుకుంటారు. భక్షాలను మైదాపిండి, శనగపప్పు, బెల్లం, చక్కెర, ఇలాచీలు ఉపయోగించి చేస్తారు. అయితే ప్రతిఏటా బెల్లం భక్షాలకు డిమాండ్‌ పెరుగుతుంది. ఆరోగ్య రీత్యా బెల్లం వినియోగం మంచిదనే అభిప్రాయం ఉండటంతో వాటిపట్ల కొనుగోలు దారులు ఆసక్తి చూపుతున్నారు. 

15 వేలకు పైగా అమ్మకం  
పట్టణంలో పలుచోట్ల తయారు చేసి విక్రయిస్తుండటంతో పండుగ ఒక్కరోజే అన్ని కేంద్రాల్లో కలిపి 15వేలకు పైగా అమ్ముడవుతుంటాయి. యాంత్రిక జీవనం, పనిఒత్తిడి, ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయి చిన్న కుటుంబాలు పెరగటంతో భక్షాలు ఇళ్లల్లో తయారు చేసుకునేందుకు సమయం చాలటం లేదు. కొందరికి సమయం ఉన్నా చేయటానికి రాకపోవటంతో పండుగ పూట ఎలా అన్న అసంతృప్తి వెంటాడుతుంది. అలాంటి వారందరికీ భక్షాల తయారీ, విక్రయాలు వరంగా మారుతున్నాయి. 

పెరిగిన ధరలు 
వాణిజ్య గ్యాస్‌ సిలిండర్ల సరఫరాలో ఇబ్బందుల వల్ల భక్షాల ధరలకు సైతం రెక్కలు వచ్చాయి. గతేడాది చక్కెర భక్షాలు రూ.20– 22 ఉండగా ఈ ఏడాది రూ.24కు పెరిగింది. అదే బెల్లం భక్షం అయితే గత ఏడాది రూ.24 ఉండగా ఈ ఏడాది రూ.26కు పెంచారు. అయితే బేకరీలు, చిప్స్‌ సెంటర్లలో మాత్రం చక్కెర భక్షాలు ఇష్టారాజ్యంగా రూ.30కి ఒకటి విక్రయిస్తున్నారు.  

ఫార్మా సెజ్‌ కారణంగా 
పోలేపల్లి ఫార్మా సెజ్‌ కారణంగా జడ్చర్లలో వివిధ రాష్ట్రాల ప్రజలు వలస వచ్చి నివసిస్తున్నారు. వీరిలో ఆంధ్ర, మహారాష్ట్ర ప్రజలు బొబ్బట్లు, పోలెలుగా పిలుచుకునే భక్షాలను పండగపూట తినాలన్న ఆతృత కలిగి ఉండటం వల్ల ప్రతి ఏటా తయారీదారులకు డిమాండ్‌ పెరుగుతుంది. ఒక కూలి గంటకు 50 భక్షాలు తయారు చేస్తున్నప్పటికి వాటిని నిల్వచేసి విక్రయించే అవకాశం లేకపోవటంతో ఎక్కువగా ఆర్డర్లు తీసుకోలేకపోతున్నట్లు విక్రయదారులు పేర్కొంటున్నారు.  

ధరలు పెంచక తప్పటం లేదు 
గత కొన్నేళ్లుగా భక్షాలు తయారు చేస్తున్నాం. ఉగాది, దసరా పండగ రోజుల్లో భక్షాలకు ప్రతిఏటా ఆర్డర్లు పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఉగాదికి బుధవారం సాయంత్రం వరకు ఆర్డర్లు వస్తూనే ఉన్నాయి. అయితే పెరిగిన కూలీ ధరలు, గ్యాస్‌ సిలిండర్ల సమస్య వల్ల ధరలు పెంచక తప్పటం లేదు. ముందు రోజు  చేసి నిల్వ చేసే పరిస్థితి ఉండదు. తెల్లవారుజాము నుంచి తయారు చేయాల్సి వస్తుంది. 
– కోటకాడి కౌసల్య, బాలాజినగర్, జడ్చర్ల 

ఆర్డర్లు తీసుకోలేకపోతున్నాం.. 
ఉగాది పండుగకు ప్రతిఏటా 2వేల నుంచి 3వేలకు పైగా భక్షాలు తయారు చేస్తాం. ఎక్కువ ఆర్డర్లు వస్తున్నప్పటికీ తీసుకోలేని పరిస్థితి. గ్యాస్‌ సమస్య వల్ల ఈ ఏడాది భక్షాలు తయారు చేయటం కష్టంగా మారింది.  
– రాజనర్సింహ, భక్షాల విక్రయదారు, సాయినగర్‌ కాలనీ   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement