
ఎన్టీఆర్ జిల్లా టేకులపల్లిలో యూరియా టోకెన్ల కోసం ఎగబడుతున్న రైతులు
ఒక్క కట్ట కోసం క్యూలైన్లలో రైతన్నల పడిగాపులు
ఆత్మగౌరవాన్ని దిగమింగుకుని రోజంతా అగచాట్లు
ఎంత తిరిగినా యూరియా దొరక్క ఖరీదైన కాంప్లెక్స్ ఎరువుల కొనుగోలుతో ఖర్చులు తడిసిమోపెడు
పెట్టుబడి సాయం అందక.. మద్దతు ధర లేక విలవిల
రాష్ట్రంలో ఏ ఒక్క పంటకూ దక్కని మద్దతు ధర
వరి, మిర్చి, పొగాకు, ఉల్లి, అరటి, చీని.. అన్నిటి దుస్థితి అదే
భరోసా కల్పించాల్సిన సర్కారు.. దిక్కులు చూస్తున్న వైనం
అన్నదాతకు ఎన్నడూ చూడని దుస్థితి.. 15 నెలల్లో అప్పులపాలై 300 మంది రైతన్నల బలవన్మరణాలు
ఒక్కరికీ పరిహారం చెల్లించి ఆదుకోని కూటమి సర్కారు
ఉచిత పంటల బీమా లేదు.. బీమా పరిహారం ఎగవేత..
కరువు సాయం బకాయిలూ ఎగ్గొట్టారు
ఆర్బీకేలు, సచివాలయాలు నిర్వీర్యం
వైఎస్సార్‌సీపీ హయాంలో ఊరు దాటాల్సిన అవసరం లేకుండా రైతు ముంగిటికే ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ ఉత్పాదకాలు సరఫరా
‘సీఎం’ యాప్, మార్కెట్ జోక్యంతో ఎప్పటికప్పుడు పర్యవేక్షణతో నాడు రైతులకు నిశ్చింత
కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన నువ్వుల శ్రీనివాసరావు పదెకరాలు కౌలుకు చేస్తున్నారు. ఈ సీజన్‌లో ఎంటీయూ 1318 రకం వరి పంట సాగు చేశారు. తొలి విడతలో అతికష్టమ్మీద మూడు కట్టల యూరియా మాత్రమే దొరికింది. రోజుల తరబడి పడిగాపులు కాసినా రెండో విడతలో నిరాశే మిగిలంది. దీంతో చేసేది లేక అధిక ఖర్చు అయినా కాంప్లెక్స్ ఎరువులు వేస్తున్నారు. అదే యూరియా దొరికితే ఎకరాకు రెండు కట్టల చొప్పున రూ.533తో సరిపోయేది. కాంప్లెక్స్ ఎరువులు వాడుతుండటంతో రూ.3 వేల దాకా ఖర్చు అవుతోంది. అంటే దాదాపు ఆరు రెట్లు అదనపు భారం పడింది. పైగా ఒక్కో సొసైటీలో ఒక్కో ధర. లోడింగ్, రవాణా ఖర్చులు దీనికి అదనం. గతంలో ఎరువులకు ఎకరాకు రూ.3 వేలు ఖర్చయితే ప్రస్తుతం రూ.8 వేలకు పైగా ధారపోయాల్సి వస్తోందని ‘సాక్షి’ ఎదుట రైతు వాపోయాడు.
ఎన్టీఆర్ జిల్లా పురుషోత్తపట్నానికి చెందిన రైతు మైనేని దుర్గాప్రసాద్ 17 ఎకరాలు కౌలుకు తీసుకొని 1318 వరి వేశారు. రెండో విడతగా కట్ట యూరియా కోసం నాలుగుసార్లు పనులు మానుకుని వచ్చినా మీ టోకెన్ నెంబర్ రాలేదంటూ తిప్పి పంపిస్తున్నారు. బయట మార్కెట్‌లో బస్తా రూ.300 నుంచి రూ.500 దాకా అడుగుతున్నారు. పైగా కాంప్లెక్స్ ఎరువులతో పాటు పురుగుల మందులు అంటగడుతున్నారు. యూరియా దొరక్కపోవడంతో చేసేది లేక 20ః20 వేశాడు. ఈ ప్రభుత్వం అదునుకు యూరియా కూడా అందించలేకపోతోందని, ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడూ చూడలేదని ఆక్రోశిస్తున్నాడు. ఈ ప్రభావంతో ఈసారి దిగుబడులు తగ్గిపోతాయని తీవ్ర ఆందోళన చెందుతున్నాడు.
సాక్షి, అమరావతి: ఒకపక్క యూరియా కరువు.. మరోవైపు ఏ పంటకూ మద్దతు ధరలు లేక అన్నదాతలు అల్లాడుతున్నారు. గతంలో ఎన్నడూ చూడని దయనీయమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. యూరియా కోసం క్యూలైన్లు నిత్యకృత్యంగా మారిపోయాయి. ఆత్మగౌరవాన్ని దిగమింగుకుని రోజుల తరబడి పడిగాపులు కాసినా అరకట్ట దొరకడం గగనంగా మారింది. ఎంత తిరిగినా యూరియా దొరక్క ఖరీదైన కాంప్లెక్స్ ఎరువుల కొనుగోలుతో పెట్టుబడి ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. రైతన్నకు భరోసా కల్పించాల్సిన సర్కారు.. దిక్కులు చూస్తోంది.
అటు పెట్టుబడి సాయం అందక.. ఇటు ఉచిత పంటల బీమాకు దూరమై రైతన్నలు అల్లాడుతున్నారు. పంట నష్టపోతే కనీసం కరువు సాయం కూడా అందని దుస్థితి నెలకొంది. వరి ప్రస్తుతం పొట్ట దశకు చేరుకున్న తరుణంలో రెండో విడతగా ఇవ్వాల్సిన యూరియా కోసం కటకటలాడుతున్నారు. కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో ‘సాక్షి’ బృందం క్షేత్రస్థాయి పరిశీలనలో యూరియా కోసం తమ అగచాట్లను అన్నదాతలు మొర పెట్టుకున్నారు. కూటమి సర్కారు నిర్లక్ష్యం, అసమర్థతపై మండిపడుతూ గత ఐదేళ్లలో ఎప్పుడూ ఇంతటి దయనీయ పరిస్థితులు లేవని చెబుతున్నారు.
పనులు వదిలేసి సొసైటీల వద్ద పడిగాపులు..
గత ప్రభుత్వ హయాంలో గ్రామంలోనే రైతు భరోసా కేంద్రాల ద్వారా కావాల్సినంత యూరియా అందుబాటులో ఉండేది. కియోస్క్‌లో బుక్ చేసుకున్న 24 గంటల్లోనే తమ కళ్లాలకు సరఫరా చేసేవారు. ఫలితంగా లోడింగ్, అన్‌లోడింగ్‌తో పాటు రవాణా ఖర్చుల రూపంలో బస్తాకు రూ.20–50 వరకు ఆదా అయ్యేది. ఆ ఐదేళ్లలో ఏ ఒక్క రోజూ విత్తనాలు, యూరియా కోసం ఎక్కడా క్యూలైన్లు కనిపించిన దాఖలాలు లేవు.
ఎప్పుడు కావాలంటే అప్పుడు.. ఎంత కావాలంటే అంత యూరియా దొరికేది. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాదిగా పరిస్థితి మారిపోయింది. ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు. రైతు సేవా కేంద్రాల ద్వారా నాన్ సబ్సిడీ విత్తనాల సరఫరాకు మంగళం పాడారు. సబ్సిడీ విత్తనాలకూ కోత పెట్టారు. మరోవైపు ఎరువుల సరఫరాను సొసైటీలకు పరిమితం చేశారు. దీంతో ఎరువుల కోసం సీజన్‌లో పొలం పనులు మానుకుని మండల కేంద్రాలకు పరుగులు తీయాల్సిన దుస్థితి దాపురించింది.
ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో దాదాపు 10 రోజుల పాటు పొలం పనులు వదిలేసి సొసైటీల వద్ద పడిగాపులు కాస్తేగానీ అరకట్ట దొరకడం గగనమైపోయింది. టీడీపీ కూటమి నేతల సిఫార్సు మేరకు సరఫరా జరుగుతుండటంతో సన్న, చిన్న కారు రైతులు అల్లాడుతున్నారు. కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సీసీ ఆర్సీ కార్డులున్న వారు సైతం యూరియా దొరక్క ప్రైవేటు వ్యాపారుల వద్ద నిలువు దోపిడికి గురవుతున్నారు. కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో నూటికి 70–80 శాతం మంది కౌలు రైతులే. వీరంతా రెండో విడతలో కూడా యూరియా దొరక్క యాతన అనుభవిస్తున్నారు.
బాపట్ల జిల్లా ఆవులవారిపాలెంలో యూరియా కోసం రైతుల పడిగాపులు (ఫైల్)
పక్కదారి పట్టిన యూరియా..
వ్యవసాయ సీజన్‌లో 10 శాతానికి మించి పనులు సాగని జూన్, జూలైలోనే దాదాపు 35 శాతం యూరియా అమ్మకాలు జరగడం చూస్తే అదంతా నల్ల బజారుకు చేరిపోయిందని అర్ధమౌతుంది. డిమాండ్ సాకుగా చేసుకుని టీడీపీనేతలు యూరియాను అధికధరలకు అమ్ముకున్నారు. వరి పొలాలకు యూరియా ఇవ్వాల్సిన తరుణంలో సర్కారు చేతులెత్తేసింది. పెద్ద ఎత్తున నిల్వలు పక్కదారి పట్టినా కళ్లప్పగించి చూసింది. దీంతో కట్ట యూరియా కోసం రైతన్నలు రోడ్డెక్కి ధర్నాలు, రాస్తారోకోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
యూరియా సరఫరాలో అలసత్వాన్ని ఎండగడుతూ రైతులకు అండగా వైఎస్సార్‌సీపీ పోరుబాట చేపట్టే వరకు చంద్రబాబు సర్కారు మేలుకోలేదు. పరిస్థితి చేయి దాటిపోవడంతో అదునుకు యూరియా దొరక్క రైతులు ఖరీదైన కాంప్లెక్స్ ఎరువులను కొనుగోలు చేయాల్సి వస్తోంది. యూరియా కట్ట రూ.266.50 కాగా సొసైటీల్లోనే రూ. 25 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో రూ.500 వరకు గుంజుతున్నారు.
ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పలు ప్రాంతాల్లో బస్తా రూ.600–700 వరకు పిండుతున్నట్లు రైతులు చెబుతున్నారు. బలవంతంగా కాంప్లెక్స్ ఎరువులతో పాటు అవసరం లేని పురుగు మందులను అంటగడుతుండడంతో ఎకరాకు రూ.5 వేలకు పైగా అదనపు భారం పడుతోందని వాపోతున్నారు. ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో సొసైటీలను పరిశీలించగా చాలా చోట్ల యూరియా నిల్వలే లేవు. డిమాండ్‌కు సరిపడా లేక రైతులు ఖాళీ చేతులతో వెనుదిరుగుతున్న పరిస్థితులు కనిపించాయి.
అదునుకు అందకపోతే..
శాస్త్రవేత్తల సిఫార్సు మేరకు గోదావరి, కృష్ణా, పెన్నా డెల్టాతో పాటు ఉత్తర కోస్తాలో ఎకరాకు 75–80 కేజీలు యూరియా అవసరం. గిరిజన ప్రాంతాల్లో 55–69 కిలోలు వినియోగించాలి. వర్షాధార ప్రాంతాల్లో మూడు విడతల్లో 100–125 కేజీలు, నీటిపారుదల ప్రాంతాల్లో నాలుగు విడతల్లో 80–90 కిలోల చొప్పున పంటలకు యూరియా వేస్తారు. వర్షాధార ప్రాంతాల్లో విత్తే సమయంలో తొలి విడతగా, 30–35 రోజుల మధ్య రెండో విడత, మిగిలింది 50–55 రోజుల మధ్య వేస్తారు. నీటిపారుదల ప్రాంతాల్లో నాట్లు వేసిన 7–10 రోజుల్లో తొలి విడత, 25–30 రోజుల్లో 2వ విడత, 45–50 రోజుల మధ్య మూడో విడత, చివరగా 60–65 రోజుల మధ్య నాలుగో విడత యూరియా అవసరం ఉంటుంది.
తొలిదశలో యూరియాతో పాటు డీఏపీ లేదంటే కాంప్లెక్స్ ఎరువులు వేస్తారు. రెండో విడతలో యూరియాతో పాటు కాంప్లెక్స్ ఎరువు 20–25 కేజీలు వేస్తారు. చివరి రెండు దశల్లో యూరియా ఎక్కువగా అవసరం ఉంటుంది. మూడో దశకు యూరియా అందకపోతే పంట ఏపుగా ఎదగదు. దుబ్బులో పిలకలు తగ్గిపోతాయి. చివరి దశలో యూరియా అదునుకు ఇవ్వకుంటే కంకి సైజు తగ్గిపోవడం, గింజ బరువు తగ్గిపోవడం జరుగుతుంది. 3, 4వ దశల్లో నత్రజని అందకపోతే దిగుబడి గణనీయంగా 5–10 బస్తాల వరకు తగ్గిపోతుంది.
రెండో దశలోనూ కటకట..
ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ప్రస్తుతం వరి పంట పొట్ట దశకు చేరుకుంది. కృష్ణా డెల్టా పరిధిలో ఎకరాకు దాదాపు రెండు బస్తాల యూరియా వాడతారు. రెండో విడతలోనూ మెజార్టీ రైతులకు యూరియా అందకపోవడంతో చేసేది లేక కాంప్లెక్స్ ఎరువులను వినియోగించారు. యూరియాలో 46 శాతం నత్రజని ఉంటుంది. అదే కాంప్లెక్స్ ఎరువు (20ః20)లో 20 శాతం మాత్రమే నత్రజని, 20 శాతం ఫాస్పేట్ ఉంటాయి. తీవ్ర కొరత కారణంగా రెండు మూడు విడతల్లో 20 కేజీల చొప్పున వేయాల్సిన యూరియాకు బదులుగా 20ః20 కాంప్లెక్స్ ఎరువులను వినియోగించారు. యూరియాలో ఉండే నత్రజని కోసం దాదాపు 60 కేజీల కాంప్లెక్స్ ఎరువులను వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అంటే 20 కేజీల యూరియాకు రూ.135 ఖర్చవుతుండగా, 60 కేజీల కాంప్లెక్స్ కోసం దాదాపు రూ.1,600 వరకు వెచ్చించాల్సిన అగత్యం తలెత్తింది. ఈ లెక్కన 2–3 విడతల్లో 45 కేజీల యూరియా బస్తాకు కేవలం రూ.266.50 ఖర్చు చేస్తే సరిపోయేది. కానీ కాంప్లెక్స్ ఎరువుల వినియోగం వల్ల దాదాపు రూ.3,200 వ్యయం అయింది. అంటే ఐదారు రెట్లు అదనంగా రైతుల నెత్తిన భారం పడింది. అయినప్పటికీ పంట ఎదుగుదల కానరాక ఈసారి దిగుబడులు తగ్గిపోతాయన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. కనీసం ఎకరాకు 5 బస్తాలకు పైగా దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని వ్యవసాయ నిపుణులు అంచనా వేస్తున్నారు.
యూరియా కోసం తోపులాట..
తిరువూరు: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం టేకులపల్లి పీఏసీఎస్ పరిధిలో యూరియా పంపిణీ గందరగోళంగా మారింది. యూరియా వచ్చినట్లు తెలియడంతో చౌటపల్లి, గానుగపాడు, జీకొత్తూరు, తదితర గ్రామాల రైతులు ఆదివారం ఉదయం ఆరు గంటలకే సొసైటీ వద్దకు పోటెత్తారు. పోలీసులు తొమ్మిది గంటల సమయంలో అక్కడికి చేరుకోగా మూడు గంటల పాటు రైతులు పడిగాపులు కాశారు.
క్యూలైన్లు ఏర్పాటు చేసేలోపే పీఏసీఎస్ సిబ్బంది టోకెన్ల పంపిణీ ప్రారంభించడంతో ఒక్కసారిగా పరుగులు తీశారు. వారిని నియంత్రించలేక పోలీసులు చేతులెత్తేశారు. పోలీసులు, సహకార సిబ్బంది మధ్య సమన్వయం లేకపోవడంపై తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి కె.మాధురి ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఏసీఎస్ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని జిల్లా సహకార అధికారికి సిఫారసు చేశారు.శ్రీకాకుళం జిల్లా మజ్జిలిపేటలో యూరియా కోసం బారులు తీరిన రైతులు (ఫైల్)
పలుకుబడి ఉన్న వాళ్లకే ఇస్తున్నారు
నాకు సొంతంగా అరకెరం భూమి ఉంది. కౌలుకు ఏడెకరాలు తీసుకొని ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో వరి సాగు చేసా. యూరియా కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా ఇబ్బందిపడ్డాను. యూరియా దొరక్క కాంప్లెక్స్ వాడుతున్నాం. సొసైటీలో ఎకరాకు అరకట్టకు మించి ఇవ్వడం లేదు. ఇది ఏ మూలకు సరిపోతుంది. ఊర్లో పలుకుబడి ఉన్న వాళ్లకు మాత్రమే ఇస్తున్నారు. మాలాంటి బక్క రైతులను పట్టించుకునేవారు కరువయ్యారు..బహిరంగ మార్కెట్‌లో యూరియా దొరకడం లేదు. ఇంత దారుణమైన పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు. అదును యూరియా కూడా అందించడం ఈ ప్రభుత్వం చేతకావడం లేదు.
– తెన్నేటి శ్రీనివాసనాయక్, తెన్నేరు, కృష్ణా జిల్లా
అరకట్ట ఏ మూలకు సరిపోతుంది
ఆరుకట్టలు. పురుషోత్తపట్నం నుంచి మంతెన తీసుకెళ్తున్నారు.ఎకరాకు అరకట్ట ఇచ్చారు. చాలడం లేదు. 33 ఎకరాల సొంత భూమి భూమి ఉంది. ఉదయం నాలుగు గంటల నుంచి వెయిట్ చేస్తే..ఆరు కట్టలు ఇచ్చారు. మూడు విడతల్లో కట్ట వెయ్యాలి. కానీ అరకట్టే ఇస్తున్నారు. అమ్మోనియా వేస్తునాం.
– కిరణ్..పురుషోత్తçపట్నం, కృష్ణా జిల్లా
అందరికీ సరిపెట్టాలంటున్నారు
20 ఎకరాలు..10 కట్టలు ఇచ్చారు. ఒక కోటా వేసాం. అధిక వర్షాలకు పంట మునిగిపోయింది. పంట పోయింది. మళ్లీ నాట్లు వేసాం. రెండో విడతలో యూరియా దొరక్క అగచాట్లు పడుతున్నాం. ఎకరాకు అరకట్ట ఇస్తున్నారు,. చాలా ఇబ్బంది ఉంది. అడిగితే అందరికి సరిపెట్టాలి కదా అంటున్నారు.
2వేలకు పైగా అదనంగా ఖర్చు
15 ఎకరాల్లో వరి వేశా. 11 కట్టలిచ్చారు. పైగా సొసైటీలోనే కట్ట రూ.270 తీసుకుంటున్నారు. రెండో విడత యూరియా దొరక్క 20ః20 వేసాం. బస్తాకు రూ.1350 చొప్పున రెండు బస్తాలు వేయాల్సి వచ్చింది. దాదాపు 2వేలకుపైగా అదనంగా ఖర్చు చేయాల్సి
వస్తుంది.
– పిన్నబోయిన కొండలరావు, కృష్ణా జిల్లా
రైతులకు బాబు ఎగ్గొట్టిన బకాయిలిలా..
⇒ కేంద్రంతో నిమిత్తం లేకుండా అన్నదాతా సుఖీభవ కింద ప్రతీ రైతుకు ఏటా రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని సూపర్ సిక్స్‌లో హామీ ఇచ్చారు. దీన్ని తుంగలో తొక్కి 53.58 లక్షల మందికి రూ.20 వేల చొప్పున రూ.10,716 కోట్లు తొలి ఏడాది ఎగ్గొట్టారు. ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.5 వేల చొప్పున రూ.2342.92 కోట్లతో సరిపెట్టారు. గత ప్రభుత్వ హయాంతో పోల్చుకుంటే దాదాపు 7 లక్షల మందికి కోతపెట్టారు.
⇒ ఎన్నడూ లేని విధంగా గడిచిన 15 నెలల్లో అప్పుల ఊబిలో కూరుకుపోయి 300 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే ఏ ఒక్కరికీ పరిహారం ఇచ్చిన పాపాన పోలేదు.
⇒ ఎన్నికల కోడ్ కారణంగా ఉచిత పంటల బీమా పథకం కింద 2023–24 సీజన్‌కు సంబంధించి రైతుల తరపున చెల్లించాల్సిన రూ.930 కోట్ల ప్రీమియం సొమ్ములు కంపెనీలకు చెల్లించలేదు. ఫలితంగా ఆ సీజన్‌లో కరువు, వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతిన్న దాదాపు 11 లక్షల మంది రైతులకు రూ.1385 కోట్ల బీమా పరిహారం అందకుండా చేశారు.
⇒ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖరీఫ్–2024–25 ఉచిత పంటల బీమా పథకం కింద రైతుల తరపున చెల్లించాల్సిన రూ.833.92 కోట్లు ఇప్పటి వరకు చెల్లించలేదు.
⇒ రబీ–2024–25 సీజన్ నుంచి స్వచ్ఛంద నమోదు పద్ధతిన అమలు చేసిన ఫసల్ బీమా కోసం ప్రభుత్వం తరపున చెల్లించాల్సిన రూ.88.09 కోట్లు ఇప్పటి వరకు కంపెనీలకు జమ చేయలేదు. ఈ కారణంగా దాదాపు రూ.2 వేల కోట్లకుపైగా బీమా పరిహారం నేటికీ రైతులకు అందని పరిస్థితి నెలకొంది.
⇒ 2023–24 సీజన్‌కు సంబంధించి ఎన్నికల కోడ్‌తో పాటు వివిధ సాంకేతిక కారణాలతో 3.91 లక్షల మంది రైతులకు చెల్లించాల్సిన రూ.328 కోట్ల కరువు సాయం బకాయిలు ఎగ్గొట్టారు.
⇒ సున్నా వడ్డీ రాయితీ కింద ఖరీఫ్–2023 సీజన్‌కు సంబంధించి 2024 సీజన్‌లో 6.31లక్షల మందికి జమ చేయాల్సిన రూ.132 కోట్లు నేటికీ జమ చేయలేదు.
⇒ 2024–25 సీజన్‌లో వరుస వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న పంటలకు సంబంధించి 4.50 లక్షల మందికి చెల్లించాల్సిన మరో రూ.650 కోట్లు ఇప్పటికీ జమ చేయలేదు. ఈ విధంగా దాదాపు రూ.23,584 కోట్లు కూటమి సర్కారు రైతులకు ఎగ్గొట్టింది.
మద్దతు ధర కరువు..
సీజన్ ఆరంభంలోనే ధరల పతనం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. నెల్లూరులో మాసూళ్లకు వచ్చిన సన్నరకాలకే మద్దతు ధర కరువైంది. మద్దతు ధర ప్రకారం పుట్టికి (850 కేజీలు) రూ.19,720 దక్కాల్సి ఉండగా రూ.14వేల నుంచి రూ.15 వేలు మాత్రమే పలుకుతోంది. అదీ కూడా కొనేవారు లేక రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఏ పంటకూ కనీస మద్దతు ధరలు దక్కడం లేదు. మార్కెట్‌లో జోక్యం చేసుకొని ధరలు పతనం కాకుండా అడ్డుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం రైతులను గాలికొదిలేసింది.
ఉల్లి కిలో 50 పైసలకు పడిపోయింది. జీ–9 రకం అరటి టన్ను రూ.4–6 వేలకు పడిపోగా చీని (బత్తాయి) ధర టన్ను రూ.6–12వేలకు పతనమైంది. ఉల్లి రైతుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ప్రభుత్వం ప్రకటించినట్లుగా క్వింటా రూ.1,200 చొప్పున తమ వద్ద ఉల్లిని కొనుగోలు చేయాలని రైతులు కోరుతుంటే వారిని మభ్యపుచ్చేందుకు హెక్టార్‌కు రూ.50 వేల సాయం అంటూ కొత్త డ్రామాలు మొదలుపెట్టింది. తొలి ఏడాది పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టి రెండో విడతలో 7 లక్షల మందికి కోతపెట్టింది.
ఉచిత పంటల బీమాను అటకెక్కించి బీమా ప్రీమియం భారాన్ని రైతుల నెత్తిన మోపింది. ఏడాదిగా కంపెనీలకు చెల్లించాల్సిన ప్రీమియం ఎగ్గొట్టడంతో రైతులకు దక్కాల్సిన రూ.2 వేల కోట్లకుపైగా పంటల బీమా పరిహారం అందకుండా పోయింది. కరువు బారిన పడి నష్టపోయిన రైతులకు పైసా పరిహారం ఇవ్వలేదు. కౌలు రైతులకు పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టింది. సున్నా వడ్డీ రాయితీకి చాప చుట్టేసింది.
గత ప్రభుత్వం ఆదుకుంది ఇలా..
వైఎస్సార్‌సీపీ హయాంలో 39.01 లక్షల మంది రైతుల నుంచి రూ.67,906 కోట్ల విలువైన 3.60 కోట్ల టన్నుల ధాన్యాన్ని సేకరించి అండగా నిలిచింది. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయడమే కాదు.. ధరలు పతనమైన ప్రతిసారి మార్కెట్ లో జోక్యం చేసుకొని వ్యాపారులతో పోటీపడి రైతుల నుంచి పంట ఉత్పత్తులను కొనుగోలు చేసి కనీస మద్దతు ధరలు దక్కేలా చర్యలు తీసుకుంది.
సీఎం యాప్ ద్వారా ఎప్పటికప్పుడు గ్రామస్థాయిలోనే పంటల ధరలను పర్యవేక్షించింది. టమాటా, ఉల్లి, బత్తాయి, పొగాకు, పత్తి తదితర పంటలను మద్దతు ధరలకు కొనుగోలు చేయడం ద్వారా వ్యాపారుల్లో పోటీని పెంచింది. ఇలా ఐదేళ్లలో రికార్డు స్థాయిలో 6.20 లక్షల మంది రైతుల నుంచి రూ.7,796 కోట్ల విలువైన 21.73 లక్షల టన్నుల ఇతర పంట ఉత్పత్తులను కొనుగోలు చేసి అండగా నిలిచింది.