సాక్షి తాడేపల్లి: కూటమి ప్రభుత్వం రెడ్‌బుక్ పేరుతో అరాచకాలు సృష్టిస్తుందని వైస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. అనంతపురం జిల్లాలో గర్భిణిపై వైఎస్సార్‌సీపీ నేత దాడి అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. అయితే ఈ ఘటనతో తమ ఏలాంటి సంబంధం లేదనే విషయం ఇప్పటికే బయటపడిందని అన్నారు.
‘‘కుటుంబ వివాదాలతో ఘర్షణ, తోపులాట జరిగితే దాన్ని అన్యాయంగా వైస్సార్సీపీకి అంటగడుతున్నారు. ఈ ఘటనలో అజయ్ అనే వ్యక్తిని రోడ్డుపై కొట్టుకుంటూ తీసుకెళ్ళిన పోలీసులపై ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు పెట్టాలి. చంద్రబాబు ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందనే విషయం ముఖ్యమంత్రికి కూడా అర్థమయింది. చంద్రబాబు, లోకేష్ చర్యల వల్లే ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. చంద్రబాబుని పక్కన పెట్టి నారా లోకేష్ దుర్యోధనుడిలా వ్యవహరిస్తున్నారు..
.. పై స్థాయిలో తండ్రీ కొడుకుల దోపిడీ జరిగితే కింద స్థాయిలో ఎమ్మెల్యేల దోపిడీ జరుగుతోందన్నారు. పవన్ వస్తే కాపులకు ఏదో గొప్పగా చేస్తారని అనుకున్నారు. కానీ, వైఎస్ జగన్ ఇచ్చిన కాపు నేస్తం పథకాన్ని కూడా ఎగొట్టేశారు. రాష్ట్రంలో జరుగుతున్న తప్పులకు ముందుగా పవన్ కళ్యాణ్‌ని ప్రశ్నించాలి’’ అని సతీశ్ రెడ్డి అన్నారు.


