సాక్షి, శ్రీ సత్యసాయి జిల్లా: వైఎస్సార్‌సీపీపై బురదజల్లాలని పచ్చ మీడియా, పోలీసులు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. కదిరిలో గర్భిణిపై దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గర్భిణిపై దాడి చేసిన అజయ్ దేవ్ వైఎస్సార్‌సీపీకి చెందిన కార్యకర్త కాదని.. అతడు జనసేన యాక్టివ్ కార్యకర్త అని ఆ పార్టీ నేత అంగీకరించారు. దీంతో, ఈ కేసులో మరో టర్న్ తీసుకుంది.
వివరాల ప్రకారం.. శ్రీసత్యసాయి జిల్లాలో కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం ముత్యాలవాండ్లపల్లిలో గర్భిణిపై అజయ్ దేవ్ దాడి చేశాడు. దీంతో, నిందితుడు అజయ్.. వైఎస్సార్‌సీపీ కార్యకర్త అంటూ ఎల్లో మీడియా కలరింగ్ ఇచ్చింది. తప్పుడు కథనాలను ప్రచురించింది. పచ్చ మీడియా ప్రచారాన్ని నమ్మిన కదిరి పోలీసులు, ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో అజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్త అని భావించి.. అతడిపై పోలీసులు తమదైన మార్క్‌తో కోటింగ్ ఇచ్చారు. అనంతరం, పోలీసుల విచారణలో తీవ్రంగా గాయపడిన నిందితుడిని కదిరి పట్టణంలో ఊరేగింపుగా తీసుకెళ్లారు. అంతేకాకుండా.. అతడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి.

అయితే, నిందితుడు అజయ్ జనసేనకు చెందిన వ్యక్తి అని తాజాగా వెలుగులోకి వచ్చింది. అజయ్ దేవ్ తమ పార్టీ కార్యకర్తేనని స్థానిక జనసేన ఎంపీటీసీ అమర్ బహిరంగంగా అంగీకరించారు. అజయ్‌కి వైఎస్సార్‌సీపీకి సంబంధం లేదన్నారు. అజయ్ చేతిపై పవన్ కల్యాణ్ పచ్చబొట్టు కూడా ఉందని క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా.. పవన్ కళ్యాణ్ అభిమాని అంటూ అజయ్ దేవ్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక, ఏదైనా ఘటన జరిగిన వెంటనే నిందితులను వైఎస్సార్‌సీపీ కార్యకర్తలుగా ఎల్లో మీడియా, పోలీసులు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని పార్టీ నేతలు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. నిందితుడు జనసేన కార్యకర్త అజయ్‌పై ఫిర్యాదు చేసిన గర్భిణీ.. ఇతనికి దాయాదులని, తన తండ్రిని తిట్టిందన్న కోపంతో ఆమెను అజయ్ తోసేశాడని స్థానికులు చెబుతున్నారు.


