మోగనుంది పెళ్లి బాజా | Marriage Muhurat 2026 Complete Hindu Wedding Dates Calendar | Sakshi
Sakshi News home page

మోగనుంది పెళ్లి బాజా

Feb 7 2026 1:48 PM | Updated on Feb 7 2026 2:45 PM

Marriage Muhurat 2026 Complete Hindu Wedding Dates Calendar

ముగియనున్న మూడు నెలల మూఢం 

వివాహాలు, గృహప్రవేశాల సందడి 

ఉమ్మడి జిల్లాలో    వివిధ రంగాల వారికి ఉపాధి

పెళ్లి బాజాలు మోగే సమయం సమీపిస్తోంది. యువతీ యువకులు మూడుముళ్లతో ఒక్కటై పెద్దల ఆశీర్వచనాలు అందుకోవాలని భావిస్తున్నారు. మూడు నెలల మూఢం ముగియనుంది. ఈ నెల 19 నుంచి          సుముహూర్తాలు ఉండటంతో సందడి మొదలుకానుంది. పెళ్లి ముహూర్తాలు సమీపిస్తుండటంతో అనేక       మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది.

కల్యాణ వీణ మోగే వేళ దగ్గరకొస్తోంది. మూడు నెలల విరామం తర్వాత సుముహూర్తాలు రావడంతో శుభకార్యాల సందడి మొదలుకానుంది. గతేడాది నవంబర్‌ 26 నుంచి ఫిబ్రవరి 13 వరకు మూఢం కావటంతో వివాహాది శుభకార్యాలకు ముహూర్తాలు లేవు. మాఘ మాసం శుభప్రదమైనా మూఢం కారణంగా ఈ నెల 18 వరకు ముహూర్తాలు లేవు. ఎట్టకేలకు ఈ నెల 19 నుంచి ఫాల్గుణమాసం మొదలు కావడంతో ఉమ్మడి జిల్లాలో పలువురు శుభకార్యాలకు సిద్ధమవుతున్నారు.   

శుభకార్యాల సీజన్‌.. 
శుభకార్యాల సీజన్‌ కావడంతో ఊరువాడా సందడి మొదలు కానుంది. పచ్చని పందిళ్లు, ముత్యాల తలంబ్రాలు, పెద్దల దీవెనలతో జంటలు ఒక్కటికానున్నాయి. వివాహాలతో పాటు గృహ ప్రవేశాలు, ఉపనయనాలు, నిశి్చతార్థాలులు జరగనున్నాయి. ఇప్పటికే రెండు, మూడు నెలల ముందు నుంచి సంబంధాలు కుదుర్చుకున్న జంటల తల్లిదండ్రులు కల్యాణ మండపాలు మాట్లాడటం, బంగారం, పట్టుబట్టలు ఇతర సామగ్రి కొనుగోలును ముమ్మరంగా చేస్తున్నారు. పల్లెలు పట్టణాలు తేడా లేకుండా అన్నిచోట్లా బాజాభజంత్రీలు     మార్మోగనున్నాయి.   

ఎందరికో ఉపాధి.. 
శుభఘడియలు రానుండటంతో చాలా వర్గాల వారికి ఉపాధి దొరకనుంది. 20 నుంచి 25 వర్గాలకు ఉపాధి లభించనుంది. ప్రధానంగా పురోహితులు, షామియానా సెట్టింగ్‌లు, వాయుద్య కళాకారులు, ఫొటో, వీడియో గ్రాఫర్స్, ఆర్కెస్ట్రా, క్యాటరింగ్, బ్యూటీ పార్లర్, ట్రావెల్‌ ఏజెన్సీలకు డిమాండ్‌ ఏర్పడింది. చాలామంది ఇప్పటికే బుక్‌ చేసుకోవటంతో వాటికి డిమాండ్‌ పెరిగింది.  

సుముహూర్తాలు ఇవే 
ఈ ఏడాది ఫిబ్రవరితో పాటు మార్చి, ఏప్రిల్, మే, జూన్, ఆగషు్ట, నవంబర్, డిసెంబర్‌ నెలల్లో ఎక్కువగా పెళ్లిళ్లు జరగనున్నాయని పండితులు చెబుతున్నారు.  

ఫిబ్రవరి నెలలో: 19,20,21,24,25,26 
మార్చిలో: ,5,6,7,8,11,12,13,14,20,21,25,29 
ఏప్రిల్‌లో: 1,2,3,4,5,6,7,8,10,11,12,21,25,26, 28,29,30

సిద్ధమవుతున్నారు  
గత ఏడాది నవంబర్‌ నెలాఖరు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 18 వరకు మూఢాలు ఉండటంతో మంచి ముహూర్తాలు లేవు. ఫిబ్రవరి 19 నుంచి మంచి ముహూర్తాలు ఉండటంతో పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలతో పాటు పలు శుభకార్యాలు జరగనున్నాయి. ముందుగా సంబంధాలు కుదుర్చుకున్న వారు వివాహాలు సిద్ధమవుతున్నారు. 
–లంకా లక్ష్మణశర్మ, వేదపండితులు

అభిరుచికి తగిన విధంగా 
మూడు నెలలుగా మూఢం ఉండటంతో పెళ్లిళ్లు లేవు. దీంతో పనులు లేకుండా పోయాయి. ఫిబ్రవరి 19 నుంచి మంచి ముహూర్తాలు ఉండటంతో సీజన్‌ మొదలైంది. వరుసగా మూడు నెలలు పాటు మంచి ముహూర్తాలు ఉన్నాయి. శుభకార్యాలు చేసుకునే వారి అభిరుచికి తగ్గట్లుగా ప్రోగ్రాంలు        తీస్తున్నాం. 
–ఎ.దేవివరప్రసాద్, ఫొటోగ్రాఫర్‌

ముందుగానే బుక్‌ చేసుకుంటున్నారు 
ముహూర్తాలు ఎక్కువగా ఉండటంతో కల్యాణ మండపాలు ముందే బుక్‌ చేసుకుంటున్నారు. అడ్వాన్స్‌లు కడుతున్నారు. కల్యాణ మండపాలతో పాటు పచ్చిపూల మండపాలు కట్టేవారు, క్యాటరింగ్, వంటమేస్త్రి, పురోహితుల ఇలా ఎంతో మందికి డిమాండ్‌ ఏర్పడనుంది. వ్యాపారాలు బాగుంటాయని ఆశగా ఎదురు చూస్తున్నారు. 
–దేరంగుల శ్రీనివాసరావు, ఫంక్షన్‌హాల్‌ నిర్వాహకుడు  

Advertisement
 
Advertisement
Advertisement