సాక్షి, తాడేపల్లి: ఏ అంటే ఎటాక్.. పీ అంటే ప్రాపగాండ.. వెరసి చంద్రబాబు, లోకేష్‌లు ఏపీ అర్థమే మార్చేశారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అన్నారు. అనంతపురం కదిరి నియోజకవర్గ పరిధిలో జరిగిన ఘటన.. దానిని వైఎస్సార్సీపీకి ఆపాదించే ప్రయత్నంలో టీడీపీ అండ్ కో బోల్తాపడడంపై బుధవారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
‘‘ఆంధ్రా కిమ్ నారా లోకేష్. ఆయన రెడ్ బుక్ మంత్రిగా మారారు. అనంతపురం జిల్లాలో జరిగిన కుటుంబ గొడవని రాజకీయంగా వాడుకున్నారు. అజయ్ దేవ అనే జనసేన కార్యకర్తకి వైఎస్సార్సీపీ ముద్ర వేసి పోలీసులతో కొట్టించారు. సినిమాలో చూపించినట్టు రోడ్డుపై నడిపించారు. అసలు అజయ్ దేవతో మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు..
.. అజయ్ దేవ జనసేన కార్యకర్త. అతని గ్రామానికే చెందిన జనసేన ఎంపీటీసి అమర్ వాస్తవాన్ని చెప్పాడు. బాధితురాలు, అజయ్ సొంత వదిన మరిదిలే. వారి కుటుంబాల మధ్య చాలాకాలంగా గొడవలు ఉన్నాయి.
నారా లోకేష్ అన్యాయంగా జనసేన కార్యకర్తని కొట్టించారు. యోగి ఆదిత్య నాధ్ ట్రీట్‌మెంట్ ఇస్తానంటూ పవన్ చెప్పిన 24 గంటల్లోనే లోకేష్ జనసేన మీదనే అమలు చేశారు. ఇంకా ఎంతమంది జనసైనికులు లోకేష్ దెబ్బకి బలవ్వాలో?. పిచ్చోడి చేతిలో రాయిలాగ లోకేష్ చేతిలో పదవి ఉంది. దీని వలన రాష్ట్రానికే ప్రమాదం’’ అని నాగార్జున యాదవ్ అన్నారు.



