మా అన్న పవన్‌ వీరాభిమాని: రజిత | Andhra Pradesh Kadiri Incident New Twist | Sakshi
Sakshi News home page

మా అన్న పవన్‌ వీరాభిమాని: రజిత

Dec 24 2025 2:30 PM | Updated on Dec 24 2025 4:36 PM

Andhra Pradesh Kadiri Incident New Twist

సాక్షి, అనంతపురం: కదిరి ఘటనలో ఇంకో ట్విస్ట్‌ చేసుకుంది. అజయ్‌కు వైఎస్సార్‌సీపీతో ఎలాంటి సంబంధం లేదని స్వయంగా అతని సోదరి రజిత స్పష్టత ఇచ్చింది. ఇంతకు ముందు.. ఇదే విషయాన్ని ఎంపీటీసీ అమర్‌ సైతం ధృవీకరించారు. పోలీసుల చేతుల్లో దెబ్బలు తిన్న అజయ్‌ జనసేన అని ప్రకటించారు. దీంతో ఎల్లో మీడియా ఎలివేషన్‌లు కాస్త తుస్సుమనిపిస్తున్నాయి. 

‘‘మా అన్నకు వైఎస్సార్‌సీపీతో సంబంధం లేదు. అతను ముందు నుంచే జనసేనలో ఉన్నాడు. మా అన్న మొదటి నుంచి పవన్‌ అభిమానే. అందుకే చెయ్యిపై పవన్‌ కల్యాణ్‌ టాటూ కూడా వేయించుకున్నాడు(పీఎస్ పీకే). ఎంపీటీసీ అమర్‌తో మా అన్నకు పదేళ్ల పరిచయం ఉంది. పక్కా జనసేన. మా అన్నని పాత కక్షలతోనే ఇరికించారు’’ అని రజిత  ఓ వీడియో సందేశంలో క్లారిటీ ఇచ్చింది. మరోవైపు అజ‌య్‌పై ఫిర్యాదు చేసిన గ‌ర్భిణీ కుటుంబంతో పాత గొడవలు ఉన్నాయని.. త‌న తండ్రిని తిట్టింద‌న్న కోపంతో ఆమెను అజ‌య్ తోసేశాడ‌ని స్థానికులు చెబుతుతుండడం గమనార్హం.

వైఎస్సార్‌సీపీపై బురదజల్లే ప్రయత్నంలో పచ్చ మీడియా, పోలీసులు చేసిన ప్రయత్నం ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది. కదిరి తనకల్లు మండలం ముత్యాలవాండ్లపల్లిలో వైఎస్‌ జగన్‌ బర్త్‌డేనాడు పటాకులు పేలుస్తున్న వాళ్లను ఓ గర్భిణిపై మందలించిందని.. అందుకు ఆమెను కాలితో తన్ని దాడి చేశాడని.. దీంతో ఆమె ఆస్పత్రిపాలై కడుపులో బిడ్డ కదలికలు సైతం లేవని.. పోలీసులు అతన్ని తమశైలిలో బుద్ధి చెప్పి(కోటింగ్‌) నడిపించారంటూ అజయ్‌ దేవ్‌ గురించి కూటమి అనుకూల మీడియా.. సోషల్‌ మీడియాలో వరుస కథనాలు వచ్చాయి. 

ఏపీలో ఆదిత్యా యోగినాథ్‌ ట్రీట్‌మెంట్‌ అంటూ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాన్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్‌.. అజయ్‌ వైఎస్సార్‌సీపీ కార్యకర్తే అంటూ ఎల్లో మీడియా కలరింగ్‌.. అది నమ్మి కదిరి పోలీసులు, ప్ర‌భుత్వ పెద్ద‌ల ఆదేశాల‌తో అజయ్‌ను అదుపులోకి తీసుకోవడం.. నాటకీయ పరిణామాలను తలపించింది. చివరకు.. అజయ్ దేవ్ త‌మ‌ పార్టీ కార్యకర్తేనని స్థానిక జనసేన ఎంపీటీసీ అమర్ బహిరంగంగా అంగీకరించడంతో ఈ ఎపిసోడ్‌ మరో మలుపు తిరిగినట్లైంది.

ప్రత్యక్ష సాక్షులు, స్థానికులు చెప్పినదాని ప్రకారం.. 
ఈనెల 21వ తేదీన వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు ముత్యాలవాండ్లపల్లిలో ఘనంగా జరిగాయి. వైఎస్సార్ సీపీ నేతలు కేక్ కట్ చేసే సమయంలో అటుగా వెళ్తున్న జనసేన నేత అజయ్ కూడా కేక్ తిన్నాడు. కాస్త ముందుకు వెళ్లిన తర్వాత సంధ్యారాణితో అజయ్‌కి మాటామాటా పెరిగి గర్భిణి పై చేయి చేసుకున్నారు. ఈ ఘటనను ఆసరాగా చేసుకుని టీడీపీ నేతలు, ఎల్లో మీడియా ప్రతినిధులు రెచ్చిపోయారు. 

అజయ్ దేవ్ వైఎస్సార్ సీపీ నేత అని.... గర్భిణి పై దాడి చేశారంటూ అబద్ధాలు ప్రచారం చేశారు. ఆగమేఘాలపై స్పందించిన మంత్రి నారా లోకేష్ వెనుకాముందు ఆలోచించకుండా వైఎస్సార్సీపీపై అభాండాలు వేశారు. విచారణ సందర్భంగా అజయ్ దేవ్ జనసేన నేత అని కదిరి పోలీసులు గుర్తించారు. అయితే... మంత్రి నారా లోకేష్, ఎల్లో మీడియా ఆరోపణలు నిజం చేసే బాధ్యత తీసుకున్న పోలీసులు అజయ్‌ని ఊరేగించారు.  

ఇప్పుడు.. అజయ్ జనసేన కండువాతో ఉన్న ఫోటోలు, పవన్ కళ్యాణ్ అభిమానులతో కలిసి సంబరాలు చేసుకున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. అటు జనసేన అమర్‌ క్లారిటీ ఇవ్వగా.. ఇటు ఫేక్ ప్రచారంపై అజయ్ సోదరి రజిత భగ్గుమంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement