సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ కార్యాలయాల వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ ఆఫీసుల ముట్టడికి కాంగ్రెస్ శ్రేణులు యత్నించాయి. గాంధీభవన్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. బీజేపీ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు. కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది.
నల్లగొండ జిల్లా: బీజేపీ కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ కార్యకర్తలు ప్రతిఘటించగా.. పోటాపోటీ నినాదాలతో బీజేపీ కార్యాలయ ప్రాంతం దద్దరిల్లితోంది. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేస్తుండగా.. వారిపైకి దూసుకెళ్లేందుకు బీజేపీ శ్రేణులు యత్నించాయి. దీంతో పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగింది. బీజేపీ కార్యాలయంపై కోడిగుడ్ల దాడికి యత్నించగా.. కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.
నిజామాబాద్: బీజేపీ కార్యాలయ ముట్టడికి కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీగా బయలుదేరగా.. ఎన్డీఆర్ చౌరస్తా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, కాంగ్రెస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. జిల్లా అధ్యక్షుడు నగేష్ రెడ్డి సహా 50 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేపీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
కరీంనగర్ జిల్లా: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కార్యాలయం వద్ద హైటెన్షన్ నెలకొంది. ఎంపీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ED అక్రమకేసులపై నిరసనగా కరీంనగర్ ఎంపీ అఫీసు ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. కాంగ్రెస్ ముట్టడిని ఎదుర్కోనేందుకు ఎంపీ ఆఫీసుకు బీజేపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. బారీకేడ్లతో ఎంపీ ఆఫీసుకు రాకుండా పోలిసులు ఆంక్షలు విధించారు. వరంగల్, భూపాల్‌పల్లి జిల్లాలోనూ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.


