ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పెరుగుతున్న వలసలను పరిగణలోకి తీసుకున్న ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ (యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ), వలస వెళుతున్న పౌరులందరి కోసం డిసెంబర్ 18 ని అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం (ఇంటర్నేషనల్ మైగ్రంట్స్ డే) గా ప్రకటించింది. ఈమేరకు ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ (యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ) 35 ఏళ్ల క్రితం 18 డిసెంబర్ 1990 సంవత్సరంలో జరిగిన సమావేశంలో "అందరు వలస కార్మికులు, వారి కుటుంబ సభ్యుల హక్కుల రక్షణ" గురించి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ సందర్భంగా, తెలంగాణ నుంచి గల్ఫ్ దేశాలకు సాగుతున్న వలసలపై గల్ఫ్ వలసలపై చర్చిద్దాం.
దయలేని ఎండలో, ఎడారి గల్ఫ్ దేశాల్లో 50° డిగ్రీల ఎండకు కార్మికులు కుప్పకూలిపోవడం, ఉక్కపోత కార్మిక శిబిరాలలో ఉడికిపోవడం గతంతో పోలిస్తే ఇప్పుడు కొద్దిగా తగ్గింది. ఉప్పు నీటి ద్రావణం ఎలక్ట్రోలైట్ కలిపిన నీరు తాగుతూ నీడలేని స్థితిలో పనిచేయడం సాధారణం. నీడ కలిగిన పని ప్రదేశాలు, 35° డిగ్రీలు దాటితే ప్రతి గంటకు 15 నిమిషాల విరామం లాంటి వసతులను ఇప్పుడు అమలు చేస్తున్నారు.
“మా కుటుంబం పేదది, అప్పుల్లో ఉంది. నా పిల్లలకు చదువు అవసరం. అందుకే ఇక్కడే ఉంటూ, మా కష్టాలను పూడ్చేందుకు ఇంకా ఎక్కువ గంటలు పని చేస్తున్నాను.” అని ఒక కార్మికుడు చెప్పిన విషయం, హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) కు చెందిన విజయ్ కొర్రా, సంతోష్ గుగులోతు 2017 లో చేసిన అధ్యయనం లోనిది. ఇది గల్ఫ్ వలసలలో తక్కువ నైపుణ్య కార్మికులపై మోపుతున్న కనిపించని భారాన్ని వెలుగులోకి తెస్తుంది. తెలంగాణ నుంచి లక్షలాది గ్రామీణ యువత బ్లూ కాలర్ ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్తున్నారు. స్వదేశానికి సొమ్ము పంపాలనే 'రెమిటెన్స్' కల, అనారోగ్యం, ఆర్థిక పతనం, కుటుంబాల దుస్థితితో ముగిసిన సందర్భాలున్నాయి. వాతావరణ మార్పుల (క్లయిమేట్ చేంజ్) తో గల్ఫ్ ప్రాంతంలోని నరక సమాన వేడిని మరింత పెంచుతున్న వేళ, భారత్ - గల్ఫ్ భాగస్వామ్య దేశాలు తక్షణమే దృఢంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
1983 వలస చట్టాన్ని పూర్తిగా మార్చేసి, త్వరలో ప్రవేశపెట్టనున్న 'ఓవర్సీస్ మొబిలిటీ' బిల్ సురక్షిత, చట్టబద్ధ, క్రమబద్ధ వలసలకు అనుకూలంగా విధానాలు రూపొందించాలి. వెల్ఫేర్ ఫండ్ ద్వారా సమగ్ర బీమా సబ్సిడీలు, చికిత్సలు, వేతన నష్టం పూడ్చేలా చర్యలు తీసుకోవాలి. స్వదేశానికి తిరిగి వచ్చిన వారికి సోలార్ టెక్, అగ్రో-ప్రాసెసింగ్ వంటి వాతావరణ అనుకూల నైపుణ్యాల్లో పునః శిక్షణ ఇచ్చి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక పునరావాస కార్యక్రమాలు చేపట్టాలి.
ఎన్నారైలు పంపే విదేశీ మారక ద్రవ్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మేలు జరుగుతున్నది. ప్రభుత్వాలకు ఎన్నారైల పెట్టుబడులపై ఉన్న ప్రేమ వారి సంక్షేమం పట్ల లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ఎన్నారై పాలసీ (ప్రవాసీ విధానం) ప్రవేశపెట్టాలని, గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండుకు ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ఎన్నారైలకు (NRIs) ఈ-బ్యాలెట్ ఆన్‌లైన్ ఓటింగు సౌకర్యం కల్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆకాశహర్మ్యాలను నిర్మించిన కార్మికులను పట్టించుకోకపోతే, వారు పాలకులకు అధఃపాతాళం చూపిస్తారు.
- మంద భీంరెడ్డి
(రచయిత: తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మరియు వలస కార్మిక హక్కుల కోసం పనిచేస్తున్న నిపుణుడు)


