
బంగారం రేటు ఏ రేంజ్‌లో ఉందో తెలిసిందే. కొనాలంటే.. గుండెల్లో గుబులు తెప్పించేలా ధర పలుకుతోంది. సామాన్యుడు సైతం బెంబేలేత్తెలా ఉంది. అలాంటిది అక్కడ ఏకంగా స్వచ్ఛమైన బంగారంతో దుస్తులు రూపొందించారట. పైగా దాని ధర వింటే కచ్చితంగా నోరెళ్లబెడతారు. మరి ఆ కథకమామీషు ఏంటో చకచక చదివేయండి మరి...
సౌదీ అరేబియాకు చెందిన ప్రముఖ ఆభరణాల సంస్థ అల్ రోమైజాన్ గోల్డ్ అండ్ జ్యువెలరీ కంపెనీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగారు దుస్తులను రూపొందించి సరి కొత్త చరిత్ర సృష్టించింది. 'దుబాయ్ డ్రెస్' పేరుతో రూపొందించిన ఈ gold dress గిన్నిస్ వరల్డ్ రికార్డులకెక్కింది. పూర్తిగా 21 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంతో తయారు చేశారు.
దీని మొత్తం బరువు 10.0812 కిలోగ్రాములు కాగా, మార్కెట్ విలువ సుమారు రూ. 11 కోట్లు పైనే ఉంటుందని అంచనా. కేవలం బంగారం ధర కారణంగానే కాకుండా కళాత్మకంగా రూపొందించిన విధానం కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అల్ రోమైజాన్ గోల్డ్ జ్యువెలరీ కంపెనీ ఈ డ్రెస్‌ని బంగారు కిరీటం(398 గ్రాములు), నెక్లెస్ (8,810.60 గ్రాములు,) చెవిపోగులు (134.1 గ్రాములు), తల అలంకరణ (738.5 గ్రాములు) బంగారంతో భాగాలుగా రూపొందించింది.
ఆ తర్వాత ఈ భాగాలను మొత్తం కలిపి దుస్తుల రూపంలో ప్రత్యేకంగా ధరించేలా డిజైన్ చేసింది. ఇందులో కేవలం బంగారమే కాకుండా రంగురంగుల విలువైన రత్నాలను కూడా ఉపయోగించింది జ్యువెలరీ కంపెనీ. క్లిష్టమైన ఈ డిజైన్‌ని అత్యంత నాజుగ్గానూ, ఎమిరేట్స్ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా రూపొందించింది. ఇందులోని ప్రతి నమునా చరిత్రకు అర్థంబట్టేలా తీర్చిదిద్దారు నిర్వాహకులు. ఈ డ్రెస్ ఆధునికత, చరిత్ర తోపాటు సృజనాత్మకతను ప్రతిబింబిస్తోంది. ఈ దుస్తుల డిజైన్ ప్రధాన ఉద్ధేశ్యం బంగారం, ఆభరణాల వ్యాపారానికి ప్రపంచ గమ్యస్థానంగా ఉన్న దుబాయ్‌ను మరింతగా బలపరచడమేనని సదరు జ్యువెలరీ నిర్వాహకులు చెబుతున్నారు.
ఈ దుస్తులు షార్జాలో జరుగుతున్న 56వ వాచ్ అండ్ జ్యువెలరీ మిడిల్ ఈస్ట్ షోలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న ఈ ఎగ్జిబిషన్‌లో 500కిపైగా ప్రదర్శకులు పాల్గొంటారు. అందులో ఇటలీ, భారతదేశం, టర్కి, అమెరికా, రష్యా, యునైటెడ్ కింగ్‌డమ్, జపాన్, చైనా, సింగపూర్, హాంకాంగ్, మలేషియా దేశాల జ్యువెలరీ డిజైన్లర్లు , తయారీదారులు పాల్గొంటారు. కాగా, ఈ షోలో తొలిసారిగా ఆస్ట్రేలియా, మయన్మార్, పాకిస్తాన్ దేశాల డిజైనర్లు, తయారీదార్లు కూడా పాల్గొనడం విశేషం.
(చదవండి: అందరికీ ఒకటే రక్తం!)