వెండి భారీ పతనం
అదే బాటలో పసిడి, రాగి
గరిష్ట స్థాయిలో అమ్మకాలు
ఫ్యూచర్స్‌లో సిల్వర్ 8 శాతం, పసిడి 5 శాతం డౌన్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతుండటం, ఎగుమతులపై చైనా ఆంక్షలు తదితర అంశాల కారణంగా ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో పసిడి, వెండి, రాగి తదితర కమోడిటీల ధరలు సోమవారం కుదేలయ్యాయి. వరుసగా నాలుగు సెషన్ల పాటు కొనసాగిన వెండి ర్యాలీకి బ్రేక్ పడింది.
అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు, గరిష్ట స్థాయిలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్ (ఎంసీఎక్స్) ఫ్యూచర్స్ మార్కెట్లో మార్చి కాంట్రాక్టు ఒక దశలో సుమారు 6 శాతం క్షీణించి రూ. 2,26,275 (కిలోకి) వద్ద ట్రేడయ్యింది. సోమవారం తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైన సిల్వర్, ఇంట్రాడేలో జీవితకాల గరిష్టం రూ. 2,54,174ని తాకినప్పటికీ రూ. 2,25,500కి కూడా క్షీణించింది. ఇంట్రాడే గరిష్టం నుంచి దాదాపు రూ. 28,674 మేర పతనమైంది. గత వారంలో సిల్వర్ ఏకంగా రూ. 31,348 (15.04 శాతం) ఎగిసిన సంగతి తెలిసిందే.
పసిడి 3%, రాగి 13 శాతం డౌన్ ..
అటు పసిడిలో కూడా లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఫిబ్రవరి కాంట్రాక్టు పది గ్రాముల బంగారం ధర ఒక దశలో రూ. 4,946 మేర (3.54 శాతం) క్షీణించి రూ. 1,34,927కి తగ్గింది. ఇంట్రాడేలో రూ. 1,40,444 గరిష్ట స్థాయిని చూసింది. అంతక్రితం సెషన్లోనే (శుక్రవారం) పుత్తడి ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి రూ. 1,40,465ని తాకిన సంగతి తెలిసిందే. ఇక, రాగి విషయానికొస్తే, జనవరి కాంట్రాక్టు 13 శాతం క్షీణించి రూ. 1,211.05 (కిలోకి) పడిపోయింది.
ఇంట్రాడేలో ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి రూ. 1,392.95ని తాకింది. రికార్డ్ స్థాయి ర్యాలీ అనంతరం ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడంతో వెండి, పసిడి రేట్లు తగ్గాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ చెప్పారు. భారీగా కొనుగోళ్ల వల్ల ఈ రెండూ ప్రస్తుతం ఓవర్‌బాట్ స్థితిలో ఉండటమనేది అప్రమత్తత వహించాల్సిన అవసరాన్ని సూచిస్తోందన్నారు. తదుపరి ర్యాలీకి ముందు కొంత కరెక్షన్ మంచిదని చెప్పారు.
అటు అంతర్జాతీయంగా కామెక్స్‌లో 2026 మార్చి నెల వెండి కాంట్రాక్టు ఔన్సుకి (31.1 గ్రాములు) 8 శాతం పైగా నష్టపోయి ఒక దశలో 70.56 డాలర్లకు తగ్గింది. ఇంట్రాడేలో 82.61 డాలర్ల గరిష్ట స్థాయిని తాకింది. అటు పసిడి ఫిబ్రవరి కాంట్రాక్టు అయిదు శాతం పైగా క్షీణించి ఒక దశలో 4,323.20 డాలర్ల స్థాయికి పడిపోయింది. ఇంట్రాడేలో నమోదైన 4,580.70 డాలర్ల స్థాయితో పోలిస్తే 257.5 డాలర్ల మేర పతనమైంది. తర్వాత కొంత కోలుకుని 4,344.50 వద్ద ట్రేడయ్యింది. ఫ్యూచర్స్ రేట్ల ప్రభావం మంగళవారం దేశీయంగా స్పాట్ మార్కెట్లో కనిపిస్తుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.
కారణాలు ఇవి..
వడ్డీ రేట్ల కోతలు, అంతర్జాతీయంగా వాణిజ్య ఉద్రిక్తతల కారణంగా కమోడిటీల్లో ర్యాలీ మొదలైందని, ప్రస్తుతం పరిస్థితులు కాస్త చక్కబడుతున్న దాఖలాలు కనిపిస్తుండటంతో లాభాల స్వీకరణ జరుగుతోందని భావించవచ్చని జేఎం ఫైనాన్షియల్ సరీ్వసెస్ వైస్ ప్రెసిడెంట్ ప్రణవ్ మేర్ తెలిపారు. అలాగే ఉక్రెయిన్–రష్యా మధ్య యుద్ధాన్ని నిలిపివేసేందుకు ఉద్దేశించిన శాంతి చర్చలు తుది దశకు చేరాయన్న సంకేతాలు కూడా భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుతాయనే ఆశాభావం కలిగిస్తున్నాయని యూబీఎస్ వర్గాలు తెలిపాయి. మరోవైపు, సీఎంఈ, కామెక్స్‌లాంటి ప్రధాన డెరివేటివ్స్ ఎక్సే్చంజీలను నిర్వహించే సీఎంఈ గ్రూప్.. వెండి డెరివేటివ్స్ కాంట్రాక్టులపై మార్జిన్లను 20,000 డాలర్ల నుంచి 25,000 డాలర్లకు పెంచేయడం వల్ల ట్రేడర్లు అమ్మకాలకు దిగి ఉంటారని మార్కెట్ వర్గాలు తెలిపాయి.
స్పాట్‌లో వెండి అప్..
ఫ్యూచర్స్ మార్కెట్లో పతనమైనప్పటికీ.. సోమవారం స్పాట్ మార్కెట్లో వెండి రేటు మరో కొత్త రికార్డును తాకింది. ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం ట్రేడర్లు కొనుగోళ్లు కొనసాగించడంతో, న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో కిలోకి రూ.3,650 పెరిగి రూ. 2,40,000 స్థాయిని తాకింది. మరో వైపు 99.9 శాతం స్వచ్ఛత గల పసిడి రేటు పది గ్రాములకు రూ.500 క్షీణించి రూ. 1,41,800 వద్ద క్లోజయ్యింది.


