
‘మనుషులందరిలోనూ ఒకటే నెత్తురు’... ‘ఏ మనిషిలో ఉండే నెత్తుటిదైనా ఒకటే రంగు, ఎరుపు’.. పాత సినిమాల్లో ఇంచుమించుగా ఇలాంటి డైలాగులు వినే ఉంటారు. మనుషులందరిలోనూ ఉండే నెత్తుటి రంగు ఎరుపే అయినా, నెత్తుటిలో రకాలు ఉన్నాయని ఆధునిక వైద్యశాస్త్రం చెబుతోంది. వైద్య శాస్త్ర ప్రకారం మనుషుల్లో ఏ, బీ, ఓ, ఏబీ బ్లడ్ గ్రూపులు ఉన్నాయి. వీటిలోనూ ఒక్కోదానికి పాజిటివ్, నెగటివ్ రకాలు ఉన్నాయి. శస్త్రచికిత్సలు జరిగేటప్పుడు, ఆకస్మిక ప్రమాదాలు జరిగినప్పుడు మనుషులను బతికించాలంటే, నెత్తురు అత్యవసరం.
అవసరంలో ఉన్నవారి ప్రాణాలను నిలబెట్టడానికి ప్రపంచవ్యాప్తంగా పెద్దపెద్ద ఆస్పత్రులు బ్లడ్‌బ్యాంకులను కూడా నిర్వహిస్తుంటాయి. ఇన్ని ఉన్నా, ఒక్కోసారి అవసరమైన వేళకు తగిన రక్తం దొరకక గాల్లో కలిసిపోతున్న ప్రాణాలెన్నో! ఒక్కొక్కరికి ఒక్కో రకం రక్తంతో పని లేకుండా, అందరికీ సరిపోయే కృత్రిమ రక్తాన్ని జపానీస్ ప్రొఫెసర్ హిరోమీ సకాయి రూపొందించారు.
జపాన్‌లోని కషిహరాలో ఉన్న నరా మెడికల్ యూనివర్సిటీలో కెమిస్ట్రీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న హిరోమీ ‘హిమోగ్లోబిన్ బేస్డ్ ఆక్సిజన్ క్యారియర్స్’ (హెచ్‌ఓబీసీ) ఉపయోగించి, నానో టెక్నాలజీ ద్వారా ఈ కృత్రిమ రక్తాన్ని తయారు చేశారు. ఈ రక్తం ఏ గ్రూపు రక్తం ఉన్నవారికైనా సరిపోతుంది. ఈ కృత్రిమ రక్తం విస్తృతంగా అందుబాటులోకి వస్తే, ఆపదలో ఉన్న ఎన్నో ప్రాణాలు నిలబడతాయి. అంతేకాకుండా, రక్తదాతల అవసరం కూడా తగ్గుతుంది.
(చదవండి: ప్రెగ్నెట్ టైంలో సైనటిస్ మందులు వాడితే ప్రమాదమా..?)