మొయినాబాద్: హైదరాబాద్ మహానగర ప్రజలకు మంచినీరు అందిస్తున్న గండిపేట జలాశయం గలీజవుతోంది. సెప్టిక్ ట్యాంకులోని మల, మూత్ర విసర్జన వ్యర్థాలను జలాశయంలో వదులుతున్నారు. ఈ తతంగం ఏన్నాళ్ల నుంచి జరుగుతుందోగాని.. బుధవారం స్థానికులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని జలమండలి అధికారులకు అప్పగించారు. అదే సమయంలో.. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
ఇన్‌స్పెక్టర్ పవన్‌కుమార్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హిమాయత్‌నగర్ పక్కనే గండిపేట జలాశయం ఉంది. బుధవారం ఇక్కడ ఉన్న కట్టపై ఎఫ్‌టీఎల్ 428వ పాయింట్ వద్ద ఓ సెప్టిక్ ట్యాంక్ వాహనం నుంచి మల, మూత్ర విసర్జన వ్యర్థాలను జలాశయంలోకి వదులుతున్నారు. దుర్వాసన రావడంతో గమనించిన స్థానికులు సెప్టిక్ ట్యాంక్ డ్రైవర్‌ను నిలదీశారు. స్థానికులు జలమండలి అధికారులకు సమాచారం ఇవ్వడంతో వాటర్ వర్క్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ నరహరి అక్కడికి చేరుకుని డ్రైవర్‌ను ప్రశ్నించారు.
అది శివనాయక్‌కు సంబంధించిన వాహనమని.. హిమాయత్‌నగర్ గ్రామంలో నుంచి వ్యర్థాలను తీసుకొచ్చి వదులుతున్నట్లు డ్రైవర్ చెప్పాడు. దీంతో డీజీఎం నరహరి మొయినాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వాహనాన్ని సీజ్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
తాగే నీళ్లలో మనుషుల వ్యర్థాలు అన్‌లోడ్ వ్యవహారంపై హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీని స్థానికులు తిట్టిపోస్తున్నారు. ఉస్మాన్‌సాగర్‌లో అధికారులే దగ్గరుండి పారబోయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు అధికారి నరహరిపైనా ఫిర్యాదు చేస్తున్నట్లు తెలుస్తోంది.


