మహారాష్ట్రలో రాజకీయాల్లో మరోసారి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్సీపీ సీనియర్ నేత మాణిక్‌రావ్ కోకాటే.. క్రీడా శాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో సభలోనే ఆన్‌లైన్ రమ్మీ ఆడి.. రమ్మీ మినిస్టర్‌గా ఈయన పేరు పొందిన సంగతి తెలిసే ఉంటుంది. ఆ సమయంలో కోకాటేను వ్యవసాయ శాఖ నుంచి తప్పించి క్రీడా శాఖకు మార్చడమూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే..
మూడు దశాబ్దాల నాటి హౌసింగ్ స్కాం కేసులో నాసిక్ సెషన్స్ కోర్టు బుధవారం మాణిక్‌రావ్ కొకాటే(Manikrao Kokate)ను దోషిగా తేల్చి.. శిక్షను ఖరారు చేసింది. దీంతో.. ఆయన ఎమ్మెల్యే సభ్యత్వం, మంత్రి పదవి రద్దయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితుల నడుమ ముందుగానే ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే.. కోకాటే రాజీనామా లేఖ ఇంకా సీఎం పేషీకి చేరలేదు. దీంతో.. ప్రస్తుతానికి ఆయన పోర్ట్‌ఫోలియో లేని మంత్రిగా ఉన్నారు.
కేసు ఏంటంటే..
1995లో హౌజింగ్ సొసైటీలకు సంబంధించి ఆర్థిక బలహీన వర్గాల (EWS) కోసం కేటాయించిన 10% కోటాను దుర్వినియోగం చేశారని మాణిక్‌రావ్, ఆయన సోదరుడు విజయ్‌పై కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులో.. ఛీటింగ్, ఫోర్జరీలకు పాల్పడడ్డారని తేలడంతో ఇద్దరికీ రెండు సంవత్సరాల జైలు శిక్ష పడింది. తీర్పు ఇచ్చిన వెంటనే కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
ప్రజాప్రతినిధుల చట్టం, 1951 సెక్షన్ 8 ప్రకారం.. క్రిమినల్ కేసుల్లో ప్రజాప్రతినిధులకు(ఎమ్మెల్యే/ఎంపీ) రెండేళ్లు.. అంత కంటే ఎక్కువ శిక్ష పడితే తక్షణమే సభ్యత్వం రద్దు అవుతుంది. ఒకవేళ పైకోర్టులు వాటిపై స్టే విధిస్తే వాళ్లకు ఊరట దక్కుతుంది. దీంతో..
బుధవారం నాడే బాంబే హైకోర్టులో నాసిక్ కోర్టు తీర్పును కోకాటే బ్రదర్స్ సవాల్ చేశారు. అత్యవసర విచారణను శుక్రవారం జరుపుతామని కోర్టు తేల్చి చెప్పింది. ఈలోపు అనారోగ్యం పేరిట ముంబైలోని లీలావతి కొకాటే చేరడంతో అరెస్ట్ తాత్కాలికంగా వాయిదా పడింది.
అత్యవసర భేటీ, ఆపై..
కోర్టు తీర్పు నేపథ్యంలో ఎస్పీపీ చీఫ్ అజిత్ పవార్.. సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో భేటీ అయ్యారు. శివసేన, బీజేపీ ఒత్తిళ్ల మేరకు కొకాటేను తొలగించాల్సిందేనని ఫడ్నవిస్ పవార్‌కు స్పష్టం చేశారు. దీంతో ఎన్సీపీ అత్యవసర సమావేశం నిర్వహించి కీలక నేతలతో అజిత్ పవార్ చర్చలు జరిపారు. అనంతరం.. కొకాటే తన రాజీనామా ప్రకటన చేశారు. కొకాటే రాజీనామాతో క్రీడా శాఖ బాధ్యతలు ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ వద్దకు వెళ్లింది.
మరోవైపు.. ఈ పరిణామంపై కాంగ్రెస్, శరద్ పవార్ ఎన్సీపీ వర్గం భగ్గుమంటోంది. మహారాష్ట్ర మహాయుతి ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని ఆరోపిస్తున్నారు. గతంలో.. రాహుల్ గాంధీ, సునీల్ కేదార్(మహారాష్ట్ర మాజీ మంత్రి) కేసుల్లో తీర్పు వెలువడిన వెంటనే డిస్క్వాలిఫికేషన్ జరిగిందని, కోకాటే విషయంలో ఆలస్యం ఎందుకు? అని ప్రశ్నించారు..
అటు హస్తినలో..
కొకాడే రాజీనామా వ్యవహారం అటు ఢిల్లీలోనూ హాట్ టాపిక్‌గా మారింది. అదే సమయంలో ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) నేత ధనంజయ్ ముండే ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవడం చర్చనీయాంశంగా మారింది. అయితే.. తనది రాజకీయ భేటీ కాదని ముండే ఆ తర్వాత మీడియాకు స్పష్టత ఇచ్చారు.
ఐదుసార్లు ఎమ్మెల్యే..
ఈ ఏడాది జులైలో. అసెంబ్లీలో రమ్మీ ఆడుతూ మాణిక్‌రావ్ కోకాటేపై కెమెరా కంటికి చిక్కారు. దీంతో.. రైతుల ఆత్మహత్యలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. అయితే తాను ఫోన్ ఆపరేట్ చేస్తుండగా పాపప్ నోటిఫికేషన్ వచ్చిందని, ఉద్దేశపూర్వకంగా తాను దానిని తెరవలేదని కోకటే వివరణ ఇచ్చుకున్నారు. అయినప్పటికీ ఆయన్ని వ్యవసాయ శాఖ నుంచి తొలగించి.. క్రీడా మంత్రిత్వ శాఖతో పాటు యువజన సంక్షేమ, మైనారిటీ సంక్షేమ శాఖలను కేటాయించింది ఫడ్నవిస్ ప్రభుత్వం. సిన్నార్ ఎమ్మెల్యే అయిన కోకటే.. ఇప్పటి దాకా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
“#जंगली_रमी_पे_आओ_ना_महाराज…!”
सत्तेतल्या राष्ट्रवादी गटाला भाजपला विचारल्याशिवाय काहीच करता येत नाही म्हणूनच शेतीचे असंख्य प्रश्न प्रलंबित असताना, राज्यात रोज ८ शेतकरी आत्महत्या करत असताना सुद्धा काही कामच नसल्याने कृषिमंत्र्यांवर रमी खेळण्याची वेळ येत असावी.
रस्ता भरकटलेल्या… pic.twitter.com/52jz7eTAtq
— Rohit Pawar (@RRPSpeaks) July 20, 2025


